Begin typing your search above and press return to search.

గురువార‌మే ముహూర్తం.. మూడు రాష్ట్రాల్లో ప్ర‌చారం స‌మాప్తం!

దేశ‌వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మూడు రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల పోలింగ్‌కు ముహూర్తం వ‌చ్చేసింది.

By:  Garuda Media   |   7 April 2026 7:15 PM IST
గురువార‌మే ముహూర్తం.. మూడు రాష్ట్రాల్లో ప్ర‌చారం స‌మాప్తం!
X

దేశ‌వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మూడు రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల పోలింగ్‌కు ముహూర్తం వ‌చ్చేసింది. గురువారం ఆయా రాష్ట్రాల్లో ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. దీంతో మంగ‌ళ‌వారంసాయంత్రం 5 గంట‌ల‌కే ప్ర‌చారానికి తెర‌ప‌డ‌నుంది. ఈ నేప‌థ్యంలోఆయా రాష్ట్రాల్లో బీజేపీ స‌హా అన్ని ప్ర‌ధాన పార్టీల అగ్ర‌నాయ‌కులు ప్ర‌చారాన్ని తీవ్ర‌త‌రం చేశారు.

అస్సాం, పుదుచ్చేరి, కేర‌ళం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంటలతో ముగియ‌నుంది. ఆయా రాష్ట్రాల్లో గురువారం పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈశాన్య రాష్ట్రం అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలు, కేర‌ళంలో 140 స్థానాలు, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఇప్ప‌ట‌కే ప‌టిష్ఠ‌మైన ఏర్పాట్లు చేసింది. ఈశాన్య రాష్ట్రం అస్సాంలోని స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో మూడంచెల భ‌ద్ర‌త‌ను క‌ల్పించారు.

అదేవిధంగా ప్ర‌తిపోలింగ్ స్టేష‌న్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొబైల్ వాహ‌నాలతో నిరంత‌రం ప‌ర్య‌వేక్షించేలా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. కాగా.. గోవా, క‌ర్ణాట‌క‌, నాగాలాండ్‌, త్రిపుర రాష్ట్రాల్లోని కొన్ని అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నికల పోలింగ్ కూడా గురువార‌మే జ‌ర‌గ‌నుంది. ఓట్ల లెక్కింపు మే 4న చేప‌ట్టి.. అదే రోజు ఫ‌లితాన్ని వెలువ‌రించ‌నున్నారు.

స‌ర్వేలు ఏం చెబుతున్నాయి?

ఇక‌, స‌ర్వేల విష‌యానికి వ‌స్తే.. అస్సాంలో వ‌రుస‌గా మూడోసారి బీజేపీ అధికారంలోకివ‌చ్చేందుకు అవ‌కా శం ఉంద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. కేర‌ళ‌లో అధికార ఎల్‌డీఎఫ్, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం యూడీఎఫ్ కూట‌మిలు నువ్వా నేనా అన్న‌ట్టుగా ఉన్నాయి. ఎక్కువ‌గా మొగ్గు యూడీఎఫ్ వైపు ఉంద‌ని అంటున్నారు. ఇక‌, బీజేపీ ఇక్క‌డ ఒంట‌రి పోరు చేస్తోంది. మ‌రోవైపు అసెంబ్లీతో కూడిన కేంద్ర‌పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ప్ర‌స్తుత అధికార ఎన్నార్ కాంగ్రెస్ కూట‌మి(బీజేపీ కూడా) మ‌రోసారి వ‌రుస‌గా అధికారం చేప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇక్క‌డ డీఎంకే+కాంగ్రెస్ కూట‌మిగా పోటీలో ఉన్నా.. ఎక్కువు ఫోక‌స్‌.. త‌మిళ‌నాడుపైనే ఉంది.