ప్రజల చేతికి తుపాకులు.. ఎక్కడో కాదు.. మన దేశంలోనే..
గన్ కల్చర్.. ఇది అమెరికా గురించి ఎక్కువగా వినిపించే మాట. అక్కడ సాధారణ ప్రజల చేతుల్లోనూ తుపాకులు ఉంటాయి.
By: Tupaki Desk | 29 May 2025 9:28 AM ISTగన్ కల్చర్.. ఇది అమెరికా గురించి ఎక్కువగా వినిపించే మాట. అక్కడ సాధారణ ప్రజల చేతుల్లోనూ తుపాకులు ఉంటాయి. అయితే, ఇది ఆత్మరక్షణ కోసమే అయినా.. ఒక్కోసారి కాల్పులకు దారితీసి ప్రాణాలను బలిగొంటూ ఉంటుంది. అలాంటి సమయంలో అమెరికాలో తుపాకీ సంస్కృతిపై విసృ‍్తతమైన చర్చ జరుగుతూ ఉంటుంది. దానిని కట్టడి చేస్తామంటూ నాయకులు హామీలు ఇస్తుంటారు. తర్వాత అంతా మామూలే. ఇక భారత దేశంలో అయితే సాధారణ వ్యక్తుల చేతుల్లోకి తుపాకీ అనే మాటే ఉండదు. ఒకవేళ తుపాకీ కావాలంటే అందుకు తగిన కారణాలు చూపాలి. లైసెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు భారత్‌లోనూ ఓ రాష్ట్రంలో ప్రజల చేతికి తుపాకులు ఇస్తాం అంటున్నారు.
ఈశాన్యం రాష్ట్రం అసోం అంటే కాస్త భిన్నమైనది. విస్తీర్ణం, రాజకీయ చైతన్యంలో మిగతా ఈశాన్య రాష్ట్రాలకు పెద్దన్నలాంటిది కూడా. బంగ్లాదేశ్, భూటాన్‌తో పాటు పశ్చిమ బెంగాల్, ఈశాన్యంలోని అన్ని రాష్ట్రాలతో సరిహద్దులున్న రాష్ట్రం అసోం కావడం విశేషం. అలాంటి ఈ రాష్ట్రానికి ఫైర్ బ్రాండ్ నాయకుడు హిమంత బిశ్వశర్మ సీఎంగా ఉన్నారు. తరచూ హిందూత్వ వ్యాఖ్యలతో వివాదాల్లో నిలిచే బిశ్వశర్మ.. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చినవారు కావడం గమనార్హం. అయినా ఫక్తు బీజేపీ నాయకుడిలా వ్యవహరిస్తుంటారు. ఇక సీఎంగా అసోంలో అనేక చర్యలు తీసుకుంటూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అదేమంటే తమది ప్రత్యేక రాష్ట్రం అని చెబుతుంటారు. ఉమ్మడి పౌర సృ‍్మతి, కామన్ సివిల్ కోడ్ వంటి అంశాల్లో హిమంత దూకుడు చూపుతుంటారు. ఓ వర్గానికి వ్యతిరేకంగానూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటారు. వేరే ప్రాంతం నుంచి వలస వచ్చిన వారి కారణంగా స్థానికులు మైనారిటీలు అవుతున్నారనే ఆందోళన కూడా వ్యక్తం చేస్తుంటారు.
తాజాగా హిమంత తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది. తమ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని సీఎం హిమంత నిర్ణయించారు. ఈ ప్రాంతాల్లోని వారంతా అభద్రతతో జీవిస్తున్నారని.. అందుకే ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. అక‍్కడి ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌ను సమీక్షించి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తమది చాలా భిన్నమైన, సున్నిత రాష్ట్రం అని.. కొన్ని ప్రాంతాల్లోని ప్రజల భద్రతకు ముప్పు ఉందని పేర్కొన్నారు. ఇలాంటివారు ఆయుధ లైసెన్సులు కావాలని చాలాకాలంగా కోరుతున్న సంగతిని గుర్తుచేశారు. నిజంగానే ముప్పు ఉండి, మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానికులకు లైసెన్సులు ఇవ్వడంలో ఉదారంగా ఉంటామని చెప్పారు. కాగా, హిమంత చెబుతున్నదాని ప్రకారం అసోంలోని డుబ్రి, మోరిగావ్, బార్‌పేట, నాగావ్, దక్షిణ సల్మారా-మాంకాచార్ ప్రాంత ప్రజలకు ఆయుధ లైసెన్సులు దక్కే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారని హిమంత వ్యాఖ్యానించడమే దీనికి నిదర్శనం.
