పాక్ ఆర్మీ చీఫ్ కు అమెరికాలో ఘోర అవమానం.. వీడియోలు వైరల్!
వాషింగ్టన్ డీసీ పర్యటన సందర్భంగా పాకిస్థాన్ పవర్ ఫుల్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కు బిగ్ షాక్ తగిలింది.
By: Tupaki Desk | 17 Jun 2025 11:00 PM ISTవాషింగ్టన్ డీసీ పర్యటన సందర్భంగా పాకిస్థాన్ పవర్ ఫుల్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కు బిగ్ షాక్ తగిలింది. అక్కడున్న పాకిస్థాన్ సంతతికి చెందిన పౌరుల చేతిలో ఘోర అవమానం జరిగింది! ఇందులో భాగంగా.. రాజధానిలోని ఉన్నత స్థాయి ఫోర్ సీజన్స్ హోటల్ వెలుపల నిరసనకారులు ఆయనను బిగ్గరగా తిట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
అవును... ప్రపంచ దేశాల్లోని పౌరులకే కాదు.. పాకిస్థాన్ పౌరులకు, అమెరికాలోని పాక్ జాతీయులకు కూడా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీమ్ మునీర్ నియంతృత్వ వైఖరిపై తీవ్ర వ్యతిరేకత ఉందని అంటారు. తాజాగా అది మరోసారి రుజువైంది! ఇందులో భాగంగా.. అమెరికా అధికారిక పర్యటనలో ఉన్న మునీర్ కు సొంత పౌరుల నుంచే తీవ్ర నిరసన ఎదురైంది.
ఇందులో భాగంగా... అమెరికా రాజధాని వాషింగ్టన్ లో మునీర్ బస చేస్తున్న హోటల్ ఎదుట పాకిస్థాన్ జాతీయులు ఆయనకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. ఆయన హోటల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అక్కడకు చేరుకున్న పాకిస్థాన్ జాతీయులు ఆయనకు వ్యతిరేకంగా తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా... నువ్వు హంతకుడివి, ప్రికివాడివి, నియంతవు, సిగ్గు సిగ్గు మునీర్ అంటూ పాక్ ఆర్మీ చీఫ్ కు వ్యతిరేకంగా ఆ దేశ పౌరులు నినాదాలు చేశారు. దేశంలో తుపాకులు మాట్లాడుతున్నప్పుడు ప్రజాస్వామ్యం చనిపోతుందంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. పాక్ ప్రజల మరణాలకు మునీర్ వైఖరే కారణమని ఆవేదన వ్యక్తం చేసారు.
మునీర్ ఉన్నంత కాలం పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యం బ్రతికి బట్టకట్టదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "ఆసిమ్ మునీర్.. ఇస్లామాబాద్ హంతకుడు" అంటూ మరో నిరసనకారుడు గట్టిగా నినదించారు. ఈ సందర్భంగా స్పందించిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) 'ఎక్స్' లో స్పందిస్తూ.. మునీర్ ను నిరసిస్తూ పాక్ ప్రజలకు వ్యతిరేకంగా ఆయన చేసిన నేరాలను ఖండిస్తున్నారని తెలిపింది.
ఈ విధంగా పాక్ ఆర్మీ చీఫ్ కు అమెరికాలో సొంత పౌరుల చేతిలోనే జరిగిన ఘోర అవమానానికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీంతో.. ఈ అవమానానికి మునీర్ అర్హుడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
