విశాఖ రైల్వే జోన్ కి గుడ్ న్యూస్
విశాఖకు రైల్వే జోన్ వచ్చింది. అయితే అధికారికంగా నోటిఫై చేస్తే పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలవుతాయి.
By: Satya P | 28 April 2026 11:48 AM ISTవిశాఖకు రైల్వే జోన్ వచ్చింది. అయితే అధికారికంగా నోటిఫై చేస్తే పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలవుతాయి. ప్రస్తుతానికి అయితే విశాఖ వద్ద రైల్వే జోన్ శాశ్వత భవనాల నిర్మాణం జరుగుతోంది. అదే విధంగా రైల్వే జోన్ కి సంబంధించిన కార్యాలయాలు తాత్కాలిక భవనాలలో పనిచేస్తున్నాయి. ఇక సిబ్బంది కేటాయింపు నిధులు విధులు అన్నీ తెలియచేసేలా అధికారిక నోటిఫికేషన్ అయితే కేంద్రం విడుదల చేయాల్సి ఉంది. విశాఖ నగర పర్యటనలో ఉన్న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే రైల్వే జోన్ గురించి గుడ్ న్యూస్ చెప్పేశారు.
ఆ రోజు ముహూర్తం :
విశాఖలోని సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను 2026 జూన్ 1 తేదీన అధికారికంగా నోటిఫై చేయబోతున్నామని కేంద్ర మంత్రి ప్రకటించారు. దాంతో ఆ రోజు నుంచి అఫీషియల్ గా విశాఖ రైల్వే జోన్ ఉంటుంది అన్న మాట. దేశంలో ఇప్పటికే ఉన్న 17 రైల్వే జోన్ల సరసన విశాఖ రైల్వే జోన్ చేరుతుంది అన్న మాట. ఆనాటి నుంచి అధికారిక కార్యక్రమాలతో రైల్వే జోన్ పరుగులు పెడుతుందని అంటున్నారు. నిజానికి ఏప్రిల్ 1వ తేదీకే అధికారిక నోటిఫికేషన్ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ మరో రెండు నెలలు వెనక్కి వెళ్ళినా అన్నీ పూర్తి చేసుకుని సరైన సమయానికి రైల్వే జోన్ కూత పెడుతుందని అంటున్నారు.
అమరావతికి శుభవార్త :
ఇక ఏపీలో అమరావతి రాజధానికి కూడా కేంద్ర రైల్వే మంత్రి శుభవార్త చెప్పారు. అమరావతి నుంచి హైదరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా త్వరలోనే సాకారం కాబోతోందని ఆయన చెప్పడం విశేషం. దీని వల్ల 70 నిమిషాల్లో అమరావతి నుంచి హైదరాబాద్ కు చేరుకునేలా అవకాశం ఉంటుందని అన్నారు. అంతే కాకుండా 112 నిముషాల్లో అమరావతి నుంచి చెన్నైకు చేరుకునేలా బుల్లెట్ ట్రైన్ నిర్మాణం చేస్తామని కూడా కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. అలాగే కోల్ కోతా నుంచి చెన్నై వరకూ ఉన్న తూర్పు కోస్తా రైల్వే డబుల్ లైన్లను ఫోర్ లైన్లు గా మారుస్తామని చెప్పారు. ఇక కంటైనర్ ఫ్రైట్ ట్రైన్లతో పాటు 500 రైళ్లతో ఈ ప్రాంతాన్ని అనుసంధానిస్తామని కూడా ప్రకటించారు.
గూగుల్ తో కొత్త శకం :
విశాఖలో ఏర్పాటు అవుతున్న గూగుల్ డేటా సెంటర్ తో గూగుల్ ఏఐ డేటా సెంటర్ తో విశాఖపట్నం ఇక ఏఐ పట్నం గా మారుతుందని కేంద్ర మంత్రి చెప్పడం విశేషం. విద్య వైద్యం ఏరోస్పేస్ లాజిస్టిక్స్ వ్యవసాయం ఇలా వేర్వేరు రంగాల్లో ఏఐ విప్లవం వస్తోందని ఆయన అన్నారు. అలాగే గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ ద్వారా విశేషమైన సేవలు అందుతాయని చెప్పారు. ఒప్పందం చేసుకున్న అతి తక్కువ సమయంలో గూగుల్ ఏఐ డేటా హబ్ శంకుస్థాపన జరుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే విశాఖ ఏఐ డేటా సెంటర్ ను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించుకునే రోజు కూడా ఉందని ఆయన వెల్లడించారు.
లీడర్ గా భారత్ :
ఇక ప్రపంచంలోనే ఐటీ సేవల రంగంలో భారత్ లీడర్ గా ఎదిగిందని కేంద్ర మంత్రి గుర్తు చెశారు. సెమీ కండక్టర్లు చిప్స్ ల్యాప్ టాప్, మొబైల్ ఉత్పత్తుల లాంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తితో పాటు మొబైల్ మాన్యు ఫాక్చరింగ్ లో భారత్ అగ్రగామిగా మారుతోందని అన్నారు. భారత్ నుంచి ఇప్పుడు అత్యధికంగా ఎగుమతి అవుతున్న ఉత్పత్తిగా ఇప్పుడు మొబైల్ ఫోన్ మారిందని అన్నారు అలాగే దేశీయంగా అవసరమైన యాభై శాతం ఎలక్ట్రానిక్ పరికరాలను భారత్ లోనే ఉత్పత్తి చేసుకుంటున్నామని వివరించారు.
దక్షిణాదికి న్యాయం :
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అన్ని రకాలుగా దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం చేస్తోంది అని అశ్విని వైష్ణవ్ గుర్తు చేశారు. అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి వాటాని ఇస్తోందని ఆయన చెప్పుకొచ్చారు ఏ విధంగానూ వివక్ష అన్నది లేకుండా చూస్తున్నామని చెప్పారు. అయినా సరే పని గట్టుకుని ప్రతిపక్ష పార్టీలు మాత్రం ప్రతీ అంశాన్నీ రాజకీయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.
