Begin typing your search above and press return to search.

పెద్దాయన అశోక్ రాజకీయ వైరాగ్యం...!?

తెలుగుదేశం పార్టీకి ఆయన పెద్ద దిక్కు. ఏపీలో చంద్రబాబుకు ఆయన అత్యంత సన్నిహితుడు.

By:  Tupaki Desk   |   23 Jan 2024 4:26 AM GMT
పెద్దాయన అశోక్ రాజకీయ వైరాగ్యం...!?
X

తెలుగుదేశం పార్టీకి ఆయన పెద్ద దిక్కు. ఏపీలో చంద్రబాబుకు ఆయన అత్యంత సన్నిహితుడు. టీడీపీ పుట్టిన దగ్గర నుంచి ఆ పార్టీలో ఉంటూ అనేక పదవులు నిర్వహించిన సీనియర్ లీడర్. ఆయనే కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు. ఆయన రాజకీయ వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.

గట్టిగా రెండు నెలలు కూడా ఏపీలో ఎన్నికలకు ఉండదు. అయితే రాజు గారు మాత్రం హైదరాబాద్ లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు అని అంటున్నారు. ఈ మధ్య అశోక్ గురించి ఆయన నిరాడంబరత గురించి ఒక ఫోటో బయటకు వచ్చింది. ఆయన హైదరాబాద్ లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ సామాన్యులతో కలసి అక్కడ ఫ్లాట్ ఫారం వద్ద కూర్చున్న ఫోటో అది.

అయితే అశోక్ చాలా సిపుల్ అని గొప్పవారు అని మీడియా ఆ ఫోటోను పెట్టుకుని ఆకాశానికి ఎత్తేసింది. అవన్నీ కరెక్టే కానీ అశోక్ హైదరాబాద్ నుంచి అపుడు విజయనగరానికి వస్తున్నారు. ఆ రోజునే టీడీపీ అధినేత చంద్రబాబు బొబ్బిలి మీటింగ్ ఉంది. మరి చంద్రబాబు తమ సొంత జిల్లాకు వస్తున్న వేళ కూడా అశోక్ హైదరాబాద్ లోనే ఉన్నారు అన్నది కూడా ఆ ఫోటో చెప్పని మరో విషయం.

అంటే అశోక్ రాజకీయంగా అంతగా చురుకుగా లేరు అని చెప్పడానికి కూడా ఈ ఫోటోనే ఉదాహరణగా చెప్పాలని అంటున్న వారూ ఉన్నారు. అదే విధంగా చూస్తే టీడీపీ జనసేన పొత్తు ఉంది. ఏ సీటు ఎవరికి వస్తుందో తెలియదు. గతంలో అయితే ఎన్నికల వేళ క్షణం తీరిక లేకుండా అశోక్ బంగ్లాలో బిజీగా మీటింగులు జరిగేవి. అశోక్ కీలక పాత్ర పోషిస్తూ జిల్లా టీడీపీ మొత్తాన్ని శాసించేవారు.

ఆయన చెప్పిన వారికే టికెట్లు వచ్చేవి. ఇపుడు అలా పరిస్థితి లేదు అని ఒక ప్రచారం సాగుతోంది. అదే విధంగా చూస్తే అశోక్ రెండు టికెట్లు అడిగితే ఆయన కుటుంబానికే టికెట్ ఒకటి లేదు అంటున్న నేపధ్యం ఉంది అంటున్నారు. అలాగే టీడీపీలో లోకేష్ ఆధిపత్యం కూడా పెరిగింది. కొత్త తరం జిల్లాలోనూ పార్టీ హై కమాండ్ లోనూ వచ్చింది.

అశోక్ వంటి వారు అయితే ఈ పరిణామాలను చూసి మన వల్ల కాదు అనుకునే కాస్తా దూరంగా ఉంటున్నారు అని అంటున్నారు. అలాగే మరో విషయం కూడా ప్రచారంలో ఉంది. ఈసారి ఎన్నికల్లో పోటీకి కూడా అశోక్ దూరంగా ఉంటారు అని. ఆయన వయసు ఇపుడు డెబ్బై మూడేళ్ళు. అశోక్ తాను ఎన్నికల రాజకీయాలకు దూరం అవుదామని అనుకుంటున్నారు అని అంటున్నారు. ఆయన ఆరోగ్యం కూడా రాజకీయాలు దూకుడుగా చేసేందుకు సహకరించడంలేదు అని అంటున్నారు.

అందుకే ఆయన తమ కుటుంబానికి ఇచ్చే ఒక్క సీటూ తన కుమార్తె రాజకీయ వారసురాలు అయిన అదితి గజపతిరాజుకు ఇవ్వమని కోరుతున్నారని అంటున్నారు. విజయనగరం టీడీపీ నియోజకవర్గం ఇంచార్జిగా ఆమె ఉన్నారు. ఆమె జనంలో తిరుగుతున్నారు. దాంతో ఆమెను ఎమ్మెల్యేగా పోటీకి దించి తాను రాజకీయ రిటైర్మెంట్ తీసుకోవాలని కూడా పెద్దాయన భావిస్తున్నారు అని అంటున్నారు.

అయితే అదితికి టికెట్ రావడం అంత తేలికైన విషయం కాదు అని అంటున్నారు. అశోక్ వరకూ బాబు ఓకే కానీ అదితి అయితే అక్కడ మార్పు చేర్పులు ఉంటాయని అంటున్నారు. టీడీపీలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఆమె 2014లో ఆ సీటు నుంచి టీడీపీలో గెలిచారు. తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన బీసీ మహిళగా ఆమె ఉన్నారు.

ఇక మరో వైపు చూస్తే ఆ సీటు మీద జనసేన కూడా కన్నేసింది. జనసేన నాయకుడు తూర్పు కాపు నేత అయిన గురాన అయ్యలు టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. అలాగే పాలవలస యశస్విని కూడా టికెట్ కోసం రేసులో ఉన్నారు. ఆమె అంటే పవన్ కూడా టికెట్ ఇవ్వాలని చూస్తున్నారు. మొత్తానికి అశోక్ బరిలో ఉంటే ఓకే కానీ లేకపోతే టికెట్ ఎవరికైనా దక్కవచ్చు అన్నది ప్రచారంలో ఉన్న మాట. ఈ రకమైన పరిస్థితుల నేపధ్యంలోనే అశోక్ రాజకీయ వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు అని అంటున్నారు.