అశోక్ గజపతి సౌమ్యుడే కానీ !
అయితే 2019లో ఆమెకు టీడీపీ టికెట్ దక్కలేదు దాంతో ఆమె పార్టీ నుంచి వేరుపడి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.
By: Tupaki Desk | 17 April 2025 5:09 PMవిజయనగరం సంస్థానానికి చెందిన పూసపాటి వారి వంశీకుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సౌమ్యుడే కానీ ఆయనకు ఆగ్రహం వచ్చినా లేక ఎవరి మీద అయినా అనుగ్రహం కలిగినా అది వేరేగా ఉంటుందని అంటున్నారు ఆయనకు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన టీడీపీ నేత కలిశెట్టి అప్పలనాయుడు మీద అనుగ్రహం కలిగింది. అంతే ఆయన విజయనగరం నుంచి ఎంపీ అయిపోయారు. పూసపాటి రాజులు ఎక్కువ సార్లు గెలిచిన ఎంపీ సీటు నుంచి ఆయన జయభేరీ మోగించారు. ఆయన ఎంపీ అయ్యారు అంటే దాని వెనక అశోక్ మార్క్ వ్యూహాలు ఉన్నాయని చెబుతారు.
అదే విధంగా రాజు గారికి ఆగ్రహం కలిగితే జిల్లాలో ఆయా పార్టీల నేతలకు శంకరగిరి మాన్యాలే అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. 2014 నుంచి 2019 మధ్యల్లో అశోక్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఇలాకా అయిన విజయనగరం అసెంబ్లీ సీటు నుంచి మీసాల గీత ఎమ్మెల్యే అయ్యారు. ఆమె ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో విజయనగరం జిల్లాకు గంటా శ్రీనివాసరావు ఇంచార్జి మంత్రిగా ఉన్నారు.
దాంతో గంటా మీసాల గీత విజయనగరం కోట రాజకీయాలకు వ్యతిరేకంగా చక్రం తిప్పారు అన్న చర్చ సాగింది. కట్ చేస్తే మీసాల గీత తనంతట తానుగా పార్టీ నుంచి వెళ్ళిపోయేలా అశోక్ అనుచరులే పొగబెట్టారని అంతా చెప్పుకుంటారు. ఆమె కోట రాజకీయాలకు యాంటీగా విజయనగరంలో ప్రత్యేకంగా టీడీపీ ఆఫీసు తెరచారు. సొంతంగా రాజకీయం చేశారు.
అయితే 2019లో ఆమెకు టీడీపీ టికెట్ దక్కలేదు దాంతో ఆమె పార్టీ నుంచి వేరుపడి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఇపుడు ఆమె రాజకీయంగా ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు అని అంటున్నారు. మరో వైపు చూస్తే గజపతినగరం నుంచి కొండపల్లి అప్పలనాయుడు 2014 నుంచి 2019 మధ్యలో ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచారు. ఆయన కూడా కోట రాజకీయాలకు వ్యతిరేకంగా మీసాల గీతతో కలసి కొత్త రాజకీయం చేశారన్న ప్రచారం ఉంది.
కట్ చేస్తే ఆయనకు 2024 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. ఆయన అన్న కుమారుడినే తెచ్చి మరీ టికెట్ ఇప్పించి మంత్రిని చేయడం వెనక అశోక్ గజపతి రాజు పలుకుబడి ఉందని అంటారు అలా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కి అమాత్య యోగం పట్టడం వెనక రాజు గారి ఆశీస్సులు నిండుగా ఉన్నాయని చెబుతారు.
ఇదే తీరున ఒక మాజీ మంత్రి టీడీపీ బిగ్ షాట్ కి మంత్రి పదవి దక్కకపోవడం వెనక చక్రం అడ్డు వేసిన వారుగా కూడా రాజు గారి పేరే చెబుతారు. ఇలా విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఆయనది చెరగని ముద్రగా ఉంటుంది. ఈ రోజుకీ అశోక్ బంగ్లాయే టీడీపీ రాజకీయాలను శాసిస్తుంది. అధినాయకత్వం కూడా ఆయన మాటకే ఓటు వేస్తుందని చెబుతారు. అదన్న మాట సంగతి.