గవర్నర్ గా అశోక్ తొలిరోజు ఎలా గడిచింది..?
గోవా గవర్నర్ గా కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు శనివారం ఉదయం 11.30 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేసారు.
By: Tupaki Desk | 26 July 2025 1:43 PM ISTగోవా గవర్నర్ గా కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు శనివారం ఉదయం 11.30 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేసారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. రాజభవన్ దర్బార్ హాల్ లో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఇతర మంత్రివర్గ సభ్యులు గవర్నర్ అశోక్ గజపతిరాజు ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్రమంత్రులు నారా లోకేశ్, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ వెళ్లారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గవర్నర్ అశోక్ గజపతి ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు.
శుక్రవారం తన సొంత ఊరు విజయనగరం నుంచి గోవాకు వచ్చిన అశోక్ గజపతిరాజుకు అధికార యంత్రాంగం సాదరంగా స్వాగతం పలికింది. కుటుంబ సభ్యులు, భార్య సునీలా గజపతిరాజు, కుమార్తెలు విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, విద్యావతిదేవి కూడా అశోక్ తోపాటు గోవాకు వెళ్లారు. గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ఈ రోజు నుంచి ఐదేళ్లు కొనసాగనున్నారు. అశోక్ ప్రమాణస్వీకారం చేసిన వీడియోలను టీడీపీ వైరల్ చేస్తోంది. చాలాకాలం తర్వాత టీడీపీ నేత గవర్నర్ గా బాధ్యతలు చేపట్టడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఇక గవర్నర్ గా ఎంపిక కావడంతో అశోక్ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయినప్పటికీ ఆ పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో అశోక్ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లడంతో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లలేకపోయారని చెబుతున్నారు. ఇదే సమయంలో వ్యక్తిగతంగా గవర్నర్ అశోక్ గజపతిరాజుకు ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారని సీఎంవో వర్గాలు తెలియజేశాయి.
