అశోక్ కంట తడి...తెగిన పసుపు బంధం
కేంద్ర మాజీ మంత్రి గోవాకు కొత్త గవర్నర్ అయిన పూసపాటి అశోక్ గజపతి రాజు కంట తడి పెట్టారు. ఆయన ఎంతో గంభీరంగా ఉంటారు.
By: Tupaki Desk | 18 July 2025 10:55 PM ISTకేంద్ర మాజీ మంత్రి గోవాకు కొత్త గవర్నర్ అయిన పూసపాటి అశోక్ గజపతి రాజు కంట తడి పెట్టారు. ఆయన ఎంతో గంభీరంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ కన్నీరు కార్చరు. అటువంటి మేరు నగధీరుడు, గంభీరుడు కూడా తల్లడిల్లారు. కలత చెందారు. తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యారు.
తనకు దశాబ్దాల పాటు ఉన్న పసుపు బంధం ఒక్కసారిగా తెగిపోయిందే అని వేదన చెందారు అశోక్ గజపతిరాజు పునాది నుంచి పార్టీలో ఉన్న నాయకుడు. ఒక్క మాటలో చెప్పాలీ అంటే చంద్రబాబు కంటే కూడా టీడీపీలో సీనియర్. అన్న ఎన్టీఆర్ మెచ్చిన నాయకుడు. జనతా పార్టీలో గెలిచి యువ ఎమ్మెల్యేగా తన సత్తా అయిదేళ్ళ పాటు ఉమ్మడి అసెంబ్లీలో చూపించిన వారు అశోక్.
తండ్రి కాంగ్రెస్ పార్టీలో అత్యంత విశ్వాసపాత్రుడిన నాయకుడు. ఎంపీగా పలు దఫాలుగా పనిచేసిన వారు. కాంగ్రెస్ అధినేత్రి శ్రీమతి ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడైన నాయకుడు. అలాంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన అశోక్ మాత్రం కాంగ్రెస్ వ్యతిరేక భావజాలాన్ని అలవరచుకున్నారు.
ఆయన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గళం విప్పారు. ఆ తరువాత జనతా పార్టీ ఆవిర్భవిస్తే అందులో చేరి 1978లో ఆ పార్టీ టికెట్ మీద పోటీ చేసి మంచి మెజారిటీతో ఎమ్మెల్యే అయ్యారు. అలా కాంగ్రెస్ వ్యతిరేకతనే ఆయన్ని ఎన్టీఆర్ టీడీపీ పట్ల ఆకర్షించేలా చేసింది ఎన్టీఆర్ సమక్షంలో ఆనాడు పసుపు కండుగా కప్పుకున్నారు అశోక్.
అన్న గారి ఉత్తరాంధ్రా చైతన్య రధ యాత్రను తాను కూడా చేయి వేసి మరీ విజయవంతం చేశారు. ఇక ఆనాటి నుంచి టీడీపీయే తన రాజకీయ గమ్యస్థానంగా సొంత ఇంటిగా చేసుకుని అశోక్ ప్రయాణించారు. ఆయనకు ఎన్నో పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినా నైతిక నిష్ట వదలలేదు, సిద్ధాంతాల పట్ల రాజీ పడలేదు.
నిజానికి అశోక్ కి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని చెబుతారు. ఆయన ఏ జాతీయ పార్టీలో ఉన్నా కూడా సీఎం అయ్యేవారు. ఇంతకంటే ఎక్కువసార్లు కేంద్రంలో కీలక పదవులు అందుకునేవారు. కానీ టీడీపీ సిద్ధాంతాన్ని ఆయన నమ్మారు. ఆ పార్టీలోనే కడవరకూ కొనసాగారు.
అయితే ఇపుడు ఆయన గవర్నర్ గా నియమితులు కావడంతో తన పార్టీ బంధాన్ని ఒదులుకోవాల్సి వచ్చింది. దాంతో జీవిత కాల సభ్యత్వాన్ని అలాగే పొలిట్ బ్యూరో మెంబర్ షిప్ ని వదులుకున్నారు. టోటల్ గా టీడీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన కంటతడి పెట్టారు. తల్లి లాంటి పార్టీ తనను ఎంతగానో ఆదరించింది అన్నారు
43 ఏళ్ల పార్టీ సహవాసం తనదని అన్నారు. పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉన్నా తాను రాజ్యాగం ప్రకారం నడచుకోవాలి కాబట్టి తప్పదని అన్నారు. మొత్తానికి అశోక్ కంట తడి చూడని వారంతా ఆయన బాధ చూసి తట్టుకోలేకపోయారు. తన ఇలవేలుపు ఇష్టదైవం అయిన అప్పన్నను పూజించిన ఆయన ఇక రాజకీయాలకు దూరంగా జరిగి రాజ్యాంగ రక్షకుడి పాత్రలోకి మారబోతున్నారు.
