మరోసారి మనసు దోచేసిన అశోక్ గజపతిరాజు
ఇప్పటి కుట్రల రాజకీయాలకు భిన్నంగా.. ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా మాట్లాడుకునే తీరు అక్కడ కనిపించింది.
By: Tupaki Desk | 27 April 2025 5:30 AMదశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉంటూ.. రాజకీయాలకు.. రాజకీయ నేతలకు ఉండే కనీస లక్షణాలకు దూరంగా ఉండే నేతలు అత్యంత అరుదుగా ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు లాంటి క్యారెక్టర్ మరెక్కడా కనిపించదు. ఆయనకు సాటి వచ్చే వారే ఉండరు. సమకాలీన రాజకీయాల్లో ఉంటూ తనకు ప్రత్యామ్నాయంగా ఎదిగిన నేతను.. అధినేత ముందు పొగడటం లాంటివి ఆయనకు మాత్రమే సాధ్యమవుతాయేమో. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం పర్యటన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
ఇప్పటి కుట్రల రాజకీయాలకు భిన్నంగా.. ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా మాట్లాడుకునే తీరు అక్కడ కనిపించింది. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన అధినేత చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు అశోక్ గజపతి రాజు హెలిప్యాడ్ వద్దకు వచ్చి.. వెల్ కం చెప్పారు. హెలిప్యాడ్ వద్ద ఆయన్ను చూసినంతనే స్పందించిన చంద్రబాబు.. ‘‘ఎండ బాగా ఉంది. మీరెందుకు వచ్చారు? ’ అని అడగ్గా.. అందుకు స్పందించిన అశోక్ గజపతి రాజు ‘అధినేత మా ప్రాంతానికి వచ్చినప్పుడు స్వాగతం పలకటానికి రావటం బాధ్యత’ అంటూ తన విధేయతను మరోసారి ప్రదర్శించారు. ఇందుకు ఆయన ఎలాంటి ఇబ్బందికి గురి కాలేదు.
అంతేనా.. ఇక్కడే మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. విజయనగరానికి మంచి ఎంపీ దొరికారని.. అతి తక్కువ వ్యవధిలోనే నియోజకవర్గ ప్రజలకు అప్పలనాయుడు చేరువైనట్లుగా అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. దీనికి స్పందించిన చంద్రబాబు.. ‘‘ఐయామ్ హ్యాపీ విత్ అప్పలనాయుడు. ఢిల్లీలోనూ బాగా పని చేస్తున్నారు’’ అంటూ వ్యాఖ్యానించారు.
గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి.. ఇప్పుడు మరో నేత ప్రాతినిధ్యం వహిస్తుంటే.. సదరు నేత పని తీరును అధినేత వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించటం చూస్తే.. ఈ రోజుల్లో అశోక్ గజపతి రాజు లాంటోళ్లు అత్యంత అరుదుగా ఉంటారని మాత్రం చెప్పక తప్పదు.