Begin typing your search above and press return to search.

విజయనగరంలో చక్రం తిప్పేది ఆయనేనా ?

విజయనగరంలో రాజుల ఆధిపత్యం దశాబ్దాలుగా సాగుతూ వస్తోంది. పీవీజీ రాజు నుంచి మొదలుపెడితే అశోక్ గజపతిరాజు దాకా డెబ్బై అయిదేళ్ళుగా జిల్లాను రాజకీయంగా శాసించారు.

By:  Tupaki Desk   |   15 July 2025 8:15 AM IST
విజయనగరంలో చక్రం తిప్పేది ఆయనేనా ?
X

విజయనగరంలో రాజుల ఆధిపత్యం దశాబ్దాలుగా సాగుతూ వస్తోంది. పీవీజీ రాజు నుంచి మొదలుపెడితే అశోక్ గజపతిరాజు దాకా డెబ్బై అయిదేళ్ళుగా జిల్లాను రాజకీయంగా శాసించారు. ఇపుడు కురు వృద్ధ రాజకీయ నేతగా ఉన్న అశోక్ గజపతి రాజు రాజ్యాంగబద్ధమైన పదవిలోకి మారిపోతున్నారు.

ఆయన ఇప్పటిదాకా ఏ మాత్రం రాజకీయ ప్రకటనలు చేసినా ఇక ముందు అది కూడా ఉండదు. నిజం చెప్పాలీ అంటే గత ఏడాది కాలంగా అశోక్ గజపతిరాజు రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. అపుడపుడు మాత్రమే ఆయన ముఖ్యమైన టీడీపీ కార్యక్రమాలలో కనిపిస్తున్నారు. ఇపుడు ఆయనను గవర్నర్ పదవి వరించింది.

దాంతో ఆయన రాజ్ భవన్ లోకి కొత్త పదవిలోకి మారబోతున్నారు. గవర్నర్ పదవి అంటే రాజ్యాంగపరమైనది. ప్రోటోకాల్ తో కూడుకున్నది గవర్నర్లు రాజ్యాంగ పరిరక్షకులుగా ఉంటారు. దాంతో అశోక్ ఆ పదవిలో పూర్తిగా కుదురుకోబోతున్నారు.

దశాబ్దాల తరబడి విజయనగరం జిల్లాను అశోక్ శాసించారు. ఎన్టీఆర్ హయాం అయినా చంద్రబాబు జమానా అయినా విజయనగరం జిల్లాలో రాజకీయం పూర్తిగా అశోక్ కనుసన్నలలోనే నడుస్తూ వచ్చింది. ఆయన మాటే శిరోధార్యంగా ఉండేది. ఆయన అనుకున వారే పదవులు అందుకునేవారు. 2024 ఎన్నికల్లో కూడా ఆయన మాటే చెల్లింది అని ప్రచారంలో ఉంది.

ఆయన చెప్పిన వారే మంత్రి పదవిని అందుకున్నారని అంటారు. ఈ క్రమంలో జిల్లాలో రాజకీయం ఇపుడు ఎవరి చేతులల్లోకి వెళ్ళబోతోంది అన్నది చర్చగా ఉంది విజయనగరం జిల్లా బీసీలు బలంగా ఉన్న ప్రాంతం, వెలమలు తూర్పు కాపులు ఈ జిల్లాలో కీలకంగా ఉంటారు. అయినా సరే అశోక్ చక్రం తిరిగింది. పూసపాటి వంశీకులకు ఉన్న గౌరవ మర్యాదలతో సామాజిక సమీకరణలు తేడాపాడాలు లేకుండా అంతా పెద్దాయనగా అశోక్ చెప్పినట్లే నడచుకున్నారు.

అయితే అశోక్ సైతం ఎవరికీ అన్యాయం చేయలేదు. పైగా సమన్యాయం పాటించారు. అటువంటి వారు రాజకీయాలకు దూరంగా ఉండడడం అంటే జిల్లాకూ టీడీపీకి కూడా నష్టమే అని చెప్పాలి. అశోక్ అంటే ప్రజలకు ఎంతో గురి. అందుకే ఆయనతోనే అంతా అడుగులు వేశారు. ఇపుడు పెద్దాయన బాధ్యతలు ఎవరు తీసుకుంటారు అన్న చర్చ పార్టీలో సాగుతోంది.

విజయనగరం జిల్లాలో వైసీపీ బలంగానే ఉంది సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆయన బంధువులు సన్నిహితులు అంతా కలసి వైసీపీలో పటిష్టంగా ఉన్నారు. అలా జిల్లా మీద రాజకీయంగా ఈ రోజుకీ బొత్స తన పట్టు చూపిస్తున్నారు ఆయన దశాబ్దాలుగా అశోక్ తోనే తన రాజకీయ సమరం సాగించారు. ఇపుడు బొత్స ఈవైపున ఉన్నారు. టీడీపీ వైపున ఎవరు అన్నదే చూడాల్సి ఉంది.

అయితే ఇదే జిల్లాకు చెందిన సీనియర్ నేత ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు 2024లో మంత్రి పదవి దక్కాల్సి ఉంది. అయితే కొండపల్లి శ్రీనివాస్ అనూహ్యంగా మంత్రి అయ్యారు. ఆయన జిల్లా మొత్తం రాజకీయాన్ని హోల్డ్ చేయలేకపోతున్నారు అన్నది అయితే పార్టీలో ఉంది.

దాంతో మంత్రివర్గంలో మార్పు చేర్పులు జరిగితే మాత్రం కిమిడి కళా వెంకటరావుకు మంత్రి పదవి దక్కుతుందని చర్చ అపుడే మొదలైంది. జిల్లాలో రాజకీయాన్ని ఒడిసిపట్టాలన్నా వైసీపీని గట్టిగా ఢీ కొట్టాలన్న బీసీ నేత అయిన కళా వెంకటరావుని రంగంలోకి దించాల్సిందే అని అంటున్నారు కళా కూడా ఈ సమయం కోసం ఎదురుచూస్తున్నారు అని అంటున్నారు.

అశోక్ కి గవర్నర్ గా పదవి దక్కడం అంటే ఒక విధంగా పూసపాటి రాజకీయానికి ముగింపు పలికినట్లేనా అన్న చర్చ కూడా ఉంది. ఆయన వారసురాలిగా వచ్చిన అదితి గజపతిరాజు తండ్రి మాదిరిగా అనుభవంతో రాణించాలంటే చాలా కష్టపడాల్సి ఉంది. పైగా బీసీలు ఇపుడు తమ వాటాను గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అశోక్ ని పెద్దాయనగా అంతా చూశారు. ఇపుడు అదితి తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడమే కాకుండా విజయనగరం నియోజకవర్గం వరకైనా పూసపాటి వారి వారసత్వం నిలబెట్టాల్సి ఉందని అంటున్నారు.