Begin typing your search above and press return to search.

ముద్రగడతో వంగవీటి రంగా కుమార్తె రహస్య భేటీ.. గోదావరి జిల్లాల్లో పొలిటికల్ హీట్!

కట్ చేస్తే.. గత వారం ఆశా కిరణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసానికి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Political Desk   |   14 Jun 2026 10:03 AM IST
ముద్రగడతో వంగవీటి రంగా కుమార్తె రహస్య భేటీ.. గోదావరి జిల్లాల్లో పొలిటికల్ హీట్!
X

గోదావరి జిల్లాల పొలిటికల్ సర్కిల్స్‌లో సెన్సేషనల్ న్యూస్ తెగ హల్‌చల్ చేస్తోంది. కాపు ఉద్యమ మాజీ నేత, ప్రస్తుత వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభ రెడ్డితో దివంగత కాపు నేత వంగవీటి మోహన రంగా కుమార్తె ఆశా కిరణ్ భేటీ అయ్యారనే వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న ఆశాకిరణ్ ఆకస్మాత్తుగా కిర్లంపూడిలో ప్రత్యక్షమవడం వెనుక పెద్ద పొలిటికల్ స్కెచ్చే ఉందనే టాక్ వినిపిస్తోంది. తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ గత ఏడాది ప్రకటించి హడావుడి చేసిన ఆశాకిరణ్ కొన్నాళ్లుగా సైలెంటుగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆకస్మాత్తుగా కాపు ఉద్యమ నేత ముద్రగడతో భేటీ కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గత ఏడాది మధ్యలో వంగవీటి ఆశా కిరణ్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, నేరుగా కాకుండా మొదట స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టి, ఆ తర్వాతే పూర్తిస్థాయి రాజకీయం చేస్తానని ఆమె చెప్పారు. ఇందులో భాగంగానే తన తండ్రి రంగా వర్ధంతిని పురస్కరించుకుని విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కానీ ఆ తర్వాత ఆమె ఎక్కడా పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదని అంటున్నారు. దీంతో కొన్నాళ్లుగా ఆశాకిరణ్ రాజకీయ ప్రవేశం ఉండకపోవచ్చని ఊహాగానాలు వ్యాపించాయి.

కిర్లంపూడిలో ముద్రగడతో భేటీ

కట్ చేస్తే.. గత వారం ఆశా కిరణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసానికి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడ ముద్రగడతో ఆమె సుమారు గంటకు పైగా సుదీర్ఘంగా చర్చలు జరిపారని అంటున్నారు. కేవలం మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగిందా అంటే.. కాపు సామాజికవర్గ నేతలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ, భవిష్యత్తు వ్యూహాల కోసమే ఆమె అంత దూరం వచ్చి ముద్రగడను కలిశారని గట్టిగా వాదిస్తున్నారు.

ముద్రగడ గేట్‌వే..

గతంలో కూడా చాలా మంది కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు మొదట ముద్రగడ పద్మనాభాన్ని కలిసి చర్చలు జరిపిన తర్వాతే ఓ రాజకీయ పార్టీలో చేరారని అంటున్నారు. ఇప్పుడు ఆశా కిరణ్ కూడా అదే రూట్ ఎంచుకున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆమె రాజకీయాల్లోకి రావాలని అనుకున్నప్పుడు వైసీపీ ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించిందని అంటున్నారు. అయితే అప్పట్లో ఆమె సేవా కార్యక్రమాలకే పరిమితమని ప్రకటించడంతో వైసీపీ వెనక్కి తగ్గింది. అయితే వైసీపీలో క్రియాశీలంగా పనిచేస్తున్న ముద్రగడను ఆశాకిరణ్ కలవడంతో వైసీపీలో చేరొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.