Begin typing your search above and press return to search.

సంగీత లతకు అల్లుకున్న ఆశా బోంస్లే

ఇంట్లోనే సంగీతం ఉంది. దాంతో ఆమెలోనూ అది ప్రవహించింది. అక్క లతా మంగేష్కర్ అద్భుతమైన గాయనీమణి.

By:  Satya P   |   12 April 2026 11:52 PM IST
సంగీత లతకు అల్లుకున్న ఆశా బోంస్లే
X

ఇంట్లోనే సంగీతం ఉంది. దాంతో ఆమెలోనూ అది ప్రవహించింది. అక్క లతా మంగేష్కర్ అద్భుతమైన గాయనీమణి. ఆమె చెల్లెలుగా ఆశా భోంస్లే కూడా అంతే స్థాయిలో రాణించారు. ఆమె కొన్ని దశాబ్దాల పాటు భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని ఏలారు. ఆమె సినీ సంగీత ప్రయాణం 1943లో మొదలైంది. అలా అది ఒక దశలో ఉధృత ప్రవాహంగా మారింది. ఎన్నో పాటలు ఆమె గొంతులో ప్రాణం పోసుకున్నాయి. లతా మంగేష్కర్ అనే సంగీత లతకు అల్లుకుని సంగీతాభిమానుల ఆశలను దాహాన్ని ఎన్నో పాటల ద్వారా తీర్చిన ఘనత ఆశా బోంస్లేది అని చెప్పాలి. సాధారణంగా ఒకే కుటుంబంలో పుట్టిన ఏ ఇద్దరూ అత్యున్నత స్థాయిలో సరిసమానంగా నిలవడం అరుదు. ఆ ఘనతను లతా మంగేష్కర్ ఆశా బోంస్లే ఇద్దరూ సాధించారు. అందుకే భారతీయ సినీ సంగీత ప్రపంచం ఎప్పటికీ వారిని గుర్తుంచుకుంటుంది.

తెలుగులో తొలిసారి :

ఇదిలా ఉంటే ఆశా బోంస్లే తెలుగులో అనేక పాటలు పాడారు. వాటికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆమె తొలిసారిగా తెలుగులో పాడిన పాట ఇది మౌన గీతం అంటూ సాగే మెలోడీ. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన పాలు నీళ్ళు మూవీలో ఒక సందర్భోచితమైన సన్నివేశానికి వచ్చే పాట ఇది. ఆ పాటకు తెలుగులో పాడేందుకు దిగ్గజ గాయనీమణులు ఎంతో మంది ఉన్నారు. అప్పటికి పీ సుశీల ఎస్ జానకి కూడా ఈ తరహా పాటలను పాడి ఉన్నారు. అయితే దాసరి నారాయణరావు ఒక కొత్త గొంతుతో ఈ పాట పాడించాలని అనుకున్నారు ఆ విధంగా ఆశా బోంస్లే కు తెలుగులో ఇది మొదటి పాట అయింది. ఈ పాటకు సంగీత దర్శకుడు సత్యం మధురమైన బాణీలు సమకూర్చారు, సినిమాలో హీరోయిన్ జయప్రద మీద ఈ పాటను చిత్రీకరించారు. పాలూ నీళ్ళూ ఏవరేజ్ గా ఆడినా ఈ పాట మాత్రం ఈ రోజుకీ ఎవర్ గ్రీన్ గా నిలిచింది అంటే ఆ పాటను పాడిన ఆశా బోంస్లే మధురమైన గొంతుక అని చెప్పాలి. ఎంతో శ్రావ్యంగా ఆమె ఈ పాటను ఆలపించారు. ఒక క్లాసిక్ మెలోడీగా ఆ పాట గుర్తుండి పోతుంది.

వెంటాడే పాట :

ఆమె వయసు డెబ్బై ఏళ్ళు ఉన్నపుడు పాడిన ఒక సాంగ్ ఈ రోజుకీ హంట్ చేస్తూనే ఉంటుంది. రొమాంటిక్ ఫీల్ తో సాగే ఆ పాటే 2007లో వచ్చిన చందమామ సినిమాలోనిది ఈ పాట నాలో ఊహలకు అంటూ మొదలవుతుంది. కేఎం రాధాకృష్ణన్ సంగీతం అందించిన ఈ పాట ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఆశా బోంస్లేకు హాట్సాఫ్ అనాల్సిందే. ఏడు పదుల వయసులో ఎక్కడా ఏ చిన్న జీర గొంతులో లేకుండా రాకుండా చూసుకుంటూ ఆశా బోంస్లే పాడారు.

బాలయ్య మూవీలో :

ఇక బాలకృష్ణ అశ్వమేధం మూవీలో శీతాకాలం ప్రేమకు ఎండాకాలం అంటూ సాగే సాంగ్ ఆమె ఎస్పీబీ తో కలసి ఎంతో హృద్యంగా ఆలపించారు. ఈ సాంగ్ ని పిక్చరైజ్ చేసిన తీరు కూడా పాటను మరింతగా హైలెట్ చేసింది. దర్శకుడుగా రాఘవేంద్రరావు వ్యవహరించిన ఈ సినిమాలో ఆశా భోంస్లే చేత పాడించింది మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. సినిమాలో నగ్మాకు ఆశా భోంస్లే గొంతు అరువిచ్చారు. ఇది సూపర్ హిట్ గా నిలిచి మూడున్నర దశాబ్దాలు గడచినా నేటికీ వావ్ అనిపిస్తుంది. ఇలా తెలుగులో అనేక పాటలను ఆశా భోంస్లే పాడి తెలుగు వారి గుండెలలో గూడు కట్టుకున్నారు అని చెప్పాల్సి ఉంది.