Begin typing your search above and press return to search.

అనుకున్నదే అయ్యింది.. బీజేపీకి కోమటిరెడ్డి రాజీనామా!

. హైదరాబాద్‌ నగర పరిధిలోని ఎల్బీ నగర్‌ నుంచి తనకు, మునుగోడు నుంచి తన భార్య లక్ష్మికి ఆయన సీట్లు అడిగారని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   25 Oct 2023 7:20 AM GMT
అనుకున్నదే అయ్యింది.. బీజేపీకి కోమటిరెడ్డి రాజీనామా!
X

అంతా ఊహించినట్టే జరిగింది. బీజేపీకి మాజీ ఎంపీ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా చేశారు. కొద్ది రోజులుగా తన అనుచరులు, శ్రేయోభిలాషులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న ఆయన చివరకు బీజేపీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఆయన తన మాతృ పార్టీ కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించారు. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరతారని తెలుస్తోంది.

2009లో కాంగ్రెస్‌ తరఫున భువనగిరి ఎంపీగా విజయం సాధించిన రాజగోపాలరెడ్డి 2014లో మళ్లీ ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

2018 ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్‌ తరఫున గెలిచిన రాజగోపాలరెడ్డి ఆ తర్వాత బీజేపీలో చేరారు. తన ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికలో అధికార బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారని టాక్‌ నడిచింది.

తాజాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రెండు టికెట్లు ఆశించారని సమాచారం. హైదరాబాద్‌ నగర పరిధిలోని ఎల్బీ నగర్‌ నుంచి తనకు, మునుగోడు నుంచి తన భార్య లక్ష్మికి ఆయన సీట్లు అడిగారని చెబుతున్నారు.

అయితే అనూహ్యంగా బీజేపీ ఇటీవల ప్రకటించిన తొలి విడత జాబితాలో ఆయన భార్యకు కూడా సీటు దక్కలేదు. ఇదే పెద్ద షాక్‌ అనుకుంటే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి కూడా బీజేపీ సీటు ఇవ్వలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆశ్చర్యం వ్యక్తమైంది. బీజేపీ శ్రేణులు సైతం నివ్వెరపోయాయి.

దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి చెందారని టాక్‌. బీజేపీ కష్టకాలంతో తనను నమ్మించి వదిలేసిందని భావించిన ఆయన కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్నారని టాక్‌ నడిచింది.

ఈ క్రమంలో రాజగోపాలరెడ్డి కొద్ది రోజులుగా తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. వారంతా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా తమకు ఓకే అని చెప్పినట్టు సమాచారం. దీంతో రాజగోపాలరెడ్డి కాంగ్రెస్‌ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ కు రాజీనామా ప్రకటించారు. ఒకటి రెండు రోజుల్లో రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. వచ్చే ఎన్నికల్లో మునుగోడు నుంచే కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తారని తెలుస్తోంది.