Begin typing your search above and press return to search.

ఆ తప్పును అలా సరిదిద్దుకుంటున్న అసదుద్దీన్‌ ఓవైసీ!

మహిళలకు ఎంఐఎం పార్టీని మరింత చేరువ చేయడానికి అసదుద్దీన్‌ ఓవైసీ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   3 Oct 2023 11:30 PM GMT
ఆ తప్పును అలా సరిదిద్దుకుంటున్న అసదుద్దీన్‌ ఓవైసీ!
X

వచ్చే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వివిధ పార్టీల నేతలు తమ వారసులను బరిలోకి దించుతున్నారు. కొందరు నేతలు తాము పోటీ చేయడంతోపాటు తమ పిల్లలకు టికెట్లు కావాలని అడుగుతున్నారు. మరికొందరు తమకు బదులుగా తమ కుమారులు లేదా కుమార్తెలకు సీట్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ట్రెండ్‌ అన్ని ప్రధాన పార్టీల్లోనూ కొనసాగుతోంది.

ఇక ఇప్పుడు ఈ కోవలో తెలంగాణలో మజ్లిజ్‌ ఇత్తెహదుల్‌ ముస్లిమీన్‌ (మజ్లిస్‌) పార్టీ కూడా చేరింది. అసదుద్దీన్‌ ఓవైసీ నేతృత్వంలోని ఈ పార్టీ ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏడు సీట్లలో గెలుస్తోంది. ఈ ఏడూ కూడా హైదరాబాద్‌ పాతబస్తీ పరిధిలోనివే. ముస్లింలు అధికంగా ఉన్నచోట మాత్రమే మజ్లిస్‌ విజయాలు సాధిస్తూ వస్తోంది.

కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది నేతలు తప్పుకుని తమ వారసులకు సీట్లు ఇవ్వాలని అసదుద్దీన్‌ ఓవైసీని కోరుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధినేత ఓవైసీ కూడా పార్టీని యువరక్తంతో నింపాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరింపజేయాలంటే అది యువ ఎమ్మెల్యేల వల్లే అవుతుందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ఇప్పటివరకు ఎంఐఎంలో మహిళా నేతలు అంటూ ఎవరూ లేరు. ఆ పార్టీ చరిత్రలో మహిళలకు ఏ రోజూ సీటిచ్చింది కూడా లేదు. అంతేకాకుండా ఇటీవల పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లు పెడితే దానికి వ్యతిరేకంగా ఓటు వేసిన అపప్రధను మూటగట్టుకున్న పార్టీ కూడా ఎంఐఎం కావడం గమనార్హం. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు.

ఈ నేపథ్యంలో మహిళా ఓటర్లలో వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి, మహిళలకు ఎంఐఎం పార్టీని మరింత చేరువ చేయడానికి అసదుద్దీన్‌ ఓవైసీ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా అసదుద్దీన్‌ ఓవైసీ తన తమ్ముడు అక్బరుద్దీన్‌ కూతురు ఫాతిమా ఓవైసీని బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

అక్బరుద్దీన్‌ కుమార్తె ఫాతిమా ఓవైసీ ప్రస్తుతం లండన్‌ లో లా చదువుతోంది. ఆమెను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయిస్తే మహిళా వ్యతిరేకతను ఎదుర్కోవడంతోపాటు మహిళలకు పార్టీని చేరువ చేయొచ్చని అసదుద్దీన్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిద్వారా ఇన్ని రోజులు ఎంఐఎం పైన ఉన్న పురుషాధిక్య పార్టీ అనే ముద్రను చెరిపేసుకోవచ్చని ఆ పార్టీ భావిస్తోంది.

ఇదే విషయంపై అక్బరుద్దీన్‌ ఓవైసీ కూడా స్పష్టత ఇచ్చారు. తన కుమార్తె ఫాతిమా లండన్‌ లో లా చదువుతోందని.. ఆమె త్వరలోనే హైదరాబాద్‌ కు వచ్చి ప్రజా సేవ చేస్తుందని వెల్లడించారు.

మరోవైపు ప్రస్తుతం సిట్టింగ్‌ స్థానాల్లోని ముగ్గురు ఎంఐఎం ఎమ్మెల్యేలను వయోభారం కారణంగా తప్పించనున్నారని తెలుస్తోంది. అలాగే మరో స్థానంలో సైతం రాజకీయ పరిస్థితులను బట్టి అభ్యర్థి మార్పు జరిగే అవకాశాలు లేకపోలేదని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరి స్థానాల్లో యువతకు సీట్లు ఇస్తారని తెలుస్తోంది.

ఖాళీ అవుతున్న నాలుగు స్థానాల్లో వారసులతో పాటు కొత్త వారికి కూడా అవకాశం దక్కే అవకాశం ఉందని అంటున్నారు. గత పర్యాయం జరిగిన ఎన్నికల్లో ఏడుగురు సిట్టింగ్‌లకు అవకాశం లభించగా, అందులో అప్పటి యాకుత్‌ పురా ఎమ్మెల్యే అభ్యర్థిని చార్మినార్‌ కు, చార్మినార్‌ ఎమ్మెల్యే అభ్యర్థిని యాకుత్‌ పురా స్థానాలకు మార్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కొత్తగా పార్టీ సీనియర్‌ నేతల వారసుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ తమ్ముడు, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ, చార్మినార్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ల కుమారులు, కుమార్తె కూడా ఈసారి పోటీలో ఉంటారని ప్రచారం బాగా జరుగుతోంది.