Begin typing your search above and press return to search.

అద్వానీకి భారతరత్నపై అసదుద్దీన్‌ సంచలన ట్వీట్‌!

అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసదుద్దీన్‌ ఓవైసీ.. అద్వానీకి భారతరత్న ప్రకటించడంపై విరుచుకుపడ్డారు.

By:  Tupaki Desk   |   4 Feb 2024 4:19 AM GMT
అద్వానీకి భారతరత్నపై అసదుద్దీన్‌ సంచలన ట్వీట్‌!
X

రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అద్వానీకి భారతరత్న ప్రకటించడం దురదృష్టకరమని అన్నారు. గతంలో అద్వానీ చేపట్టిన రథయాత్రతో దేశంలో మతఘర్షణలు జరిగాయని గుర్తు చేశారు. దీనివల్ల ఎంతో మంది అమాయకులు మృతి చెందారన్నారు.

ఈ మేరకు హైదరాబాద్‌లో జమైతుల్‌ మోమీనాత్‌ ఇస్లామిక్‌ విద్యాసంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సదస్సులోనూ, అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసదుద్దీన్‌ ఓవైసీ.. అద్వానీకి భారతరత్న ప్రకటించడంపై విరుచుకుపడ్డారు. పాకిస్థాన్‌ పర్యటనలో దేశ విభజనకు కారణమైన జిన్నాను అద్వానీ ప్రశంసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్వానీ సమక్షంలోనే బాబ్రీ మసీదు ధ్వంసమైందని హాట్‌ కామెంట్స్‌ చేశారు. మత ఛాందసవాదికి భారతరత్న ప్రకటించడాన్ని తప్పుడు నిర్ణయంగా ఆయన అభివర్ణించారు.

1990లో అద్వానీ చేపట్టిన రథయాత్రకు సంబంధించిన మ్యాప్‌ ని సోషల్‌ మీడియాలో అసదుద్దీన్‌ షేర్‌ చేశారు. ఆ యాత్ర సందర్భంగా ఎంతోమంది మరణించారని గుర్తు చేశారు. ఎన్నో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అద్వానీని కూడా అరెస్టు చేశారని గుర్తు చేశారు. వీటన్నింటికి కారణమైన ఆయనకు భారతరత్న దక్కాల్సిందేనంటూ అసదుద్దీన్‌ ఎద్దేవా చేశారు

"భారతరత్నకు ఎల్కే అద్వానీ నిజంగా అర్హుడే. హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సమాధులు.. ఎదగడానికి మెట్లే తప్ప మరొకటి కావు" అని ఎక్స్‌ లోనూ అసదుద్దీన్‌ ఘాటుగా విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌ గా మారింది.

కాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మద్దతుగా ఎల్కే అద్వానీ రథయాత్రను 1990 సెప్టెంబర్‌ 25వ తేదీన ప్రారంభించిన సంగతి తెలిసిందే. గుజరాత్‌ లోని ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రం.. సోమనాథ్‌ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర అయోధ్యలో ముగిసింది. ఈ క్రమంలో బీహార్‌ లో అద్వానీ అరెస్టు అయ్యారు.

అయితే.. ఈ యాత్ర మార్గంలో ఎన్నో ఘర్షణలు, హింసాత్మక ఘటనలు జరిగాయి. తద్వారా.. చాలామంది మరణించారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ సంఘటనల్ని గుర్తు చేసుకునే.. అద్వానీకి భారతరత్న ఇవ్వడాన్ని అసదుద్దీన్‌ ఖండించారు.