ఒవైసీపై పాక్ లో ట్రోల్స్... ‘బావమరిది’ అంటూ స్పందించిన ఎంపీ!
పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ పై అవిరామంగా విరుచుకుపడుతున్నారు హైదరాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీ.
By: Tupaki Desk | 18 May 2025 2:23 PM ISTపహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ పై అవిరామంగా విరుచుకుపడుతున్నారు హైదరాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీ. ఈ నేపథ్యంలో... విదేశాలకు వెళ్లే ఏడు ప్రతినిధి బృందాల్లో ఆయననూ ఎంపిక చేసింది కేంద్రం. ఈ సందర్భంగా హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తనను పాకిస్థానీలు ట్రోల్స్ చేయడంపై స్పందిస్తూ.. ఆసక్తికర కౌంటర్ ఇచ్చారు.
అవును... గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ పై విపరీతంగా విరుచుకుపడుతూ, ఆ దేశం మానవాళి మనుగడకు ముప్పుగా మారిందని అంటున్నారు. పాక్ కు బుద్ది చెప్పాల్సిందే అని ఫైరవుతున్నారు. దీంతో.. సోషల్ మీడియాలో పాకిస్థానీలు ఒవైసీని ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. దీనిపై తాజాగా స్పందించిన ఎంఐఎం అధినేత.. నవ్వుతూ కౌంటర్ ఇచ్చారు.
ఇందులో భాగంగా... పాకిస్థాన్ కు ఒక్క దుల్హే భాయి (బావమరిది) ఉంటే అది తానే అని.. తనను మించిన ధైర్యంగా, అందంగా మాట్లాడగలిగేవారెవరూ వారికి కనిపించడం లేదని.. వారికి భారత్ లో కనిపించేది తాను మాత్రమే అని అన్నారు. ఈ సందర్భంగా.. తనను చూడాలని, తన ప్రసంగాలు వినాలని.. ఫలితంగా మీ జ్ఞానం పెరుగుతుందని, మీ మెదడులో ఉన్న చెడు, అజ్ఞానం పోతుందని పాక్ కు సూచించారు ఒవైసీ!
కాగా... పహల్గాం ఉగ్రదాడి అనంతరం కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి తొలుత ఒవైసీని కేంద్రం ఆహ్వానించలేదు. ఒవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో.. అమిత్ షా స్వయంగా ఒవైసీని ఆహ్వానించారు. అప్పటి నుంచి.. అన్ని అఖిలపక్ష సమావేశాలకూ ఒవైసీ హాజరవుతూ వచ్చారు. ఈ సమయంలో విదేశాల్లో భారత వాణిని వినిపించడానికి ఆయనను కేంద్రం ఎంపికచేసింది.
ఇక.. పహల్గాం ఉగ్రదాడి అనంతరం హైదరాబాద్ ఎంపీ ఒవైసీ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. శుక్రవారం ప్రార్థనల ముందు మసీదులో నలుపు రంగు పట్టీలను ధరించాలని సూచించారు. ఇదే సమయంలో పాక్ నేతలు చేస్తోన్న రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ధీటుగా స్పందించారు. దేశ భద్రత విషయంలో భారత్ కు తాను అండగా నిలుస్తానని ప్రకటించారు.
ఈ సందర్భంగా... పాకిస్థాన్ ముర్దాబాద్ – హిందూస్థాన్ జిందాబాద్ అంటూ గట్టిగా నినదించిన ఆయన వీడియోలు మతాలకు అతీతంగా ఆయనకు మరింత ప్రజాదరణ తెచ్చిపెట్టాయనే చెప్పాలి! దీంతో.. పాక్ లో ఆయనపై ట్రోల్స్ మొదలయ్యాయి. దీనిపై స్పందించిన ఒవైసీ... తాను పాక్ కు బావమరిదిని అని సరదాగా స్పందించారు!
