Begin typing your search above and press return to search.

ఇవన్నీ ప్రపంచానికి చెప్పాల్సిన విషయాలు.. పాక్ పై ఒవైసీ నిప్పులు!

అవును... ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విషయంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన పాకిస్థాన్ మానవాళికి ముప్పుగా మారిందనేది ప్రపంచదేశాలకు తన సందేశం అని అంటున్నారు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ.

By:  Tupaki Desk   |   17 May 2025 6:33 PM IST
ఇవన్నీ ప్రపంచానికి చెప్పాల్సిన  విషయాలు.. పాక్  పై ఒవైసీ నిప్పులు!
X

పహల్గాం ఉగ్రదాడి అనంతరం అవకాశం దొరికినప్పుడెల్లా పాక్ పై విరుచుకుపడిపోతున్నారు ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ. తాజాగా ప్రపంచ దేశాలకు కేంద్రం ప్రభుత్వం పంపుతున్న అఖిలపక్ష ప్రతినిధుల బృందాల్లోని ఒకదానిలో సభ్యుడిగా ఉన్న అసదుద్దీన్ ఒవైసీ... పాకిస్థాన్ మానవాళికి ముప్పుగా మారిందనేదే అంతర్జాతీయ సమాజానికి తన సందేశంలోని ప్రధానాంశం అని అన్నారు.

అవును... ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విషయంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన పాకిస్థాన్ మానవాళికి ముప్పుగా మారిందనేది ప్రపంచదేశాలకు తన సందేశం అని అంటున్నారు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన హైదరాబాద్ ఎంపీ... పాకిస్థాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ చేస్తోన్న పనులను ప్రపంచానికి చెప్పాలని అన్నారు.

ఇందులో భాగంగా.. పాకిస్థాన్ ప్రాయోజిత ఉగ్రవాదులు చాలా కాలంగా అమాయకులైన పౌరులను ఊచకోతకోస్తున్న విషయం ప్రపంచానికి చెప్పాల్సి ఉంటుందని అన్నారు. ఈ పాకిస్థాన్ ప్రాయోజిత ఉగ్రవాదానికి భారతదేశం అతిపెద్ద బాధితురాలని నొక్కి చెప్పారు. జియా-ఉల్-హక్ కాలం నుంచి మనందరం ఈ ఊచకోత కోయడాన్ని చూస్తున్నామని అన్నారు.

ఇదే సమయంలో.. భారత్ తో ఘర్షణ పడుతున్న సమయంలో పాకిస్థాన్ ముందుగా తనను తాను ఒక ఇస్లామిక్ దేశంగా చూపించుకోవడం మొదలుపెడుతుందని.. ఆ విషయాన్ని ఖండించాల్సిన అవసరం ఉందని. కారణం... సుమారు 20 కోట్ల మంది ముస్లింలు భారత్ లో నివసిస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలకు స్పష్టంగా తెలియజేయాలని అన్నారు.

భారత్ లో ప్రధానంగా మత విభజనను పెంచడం, దేశ ఆర్థికాభివృద్ధిని ఆపడం పాకిస్థాన్ ప్రధాన ఉద్దేశ్యాలని.. పాకిస్థాన్ రాజ్యం, సైన్యం ఎప్పుడూ ఇవే లక్ష్యంగా ఉంటాయని అసదుద్ధీన్ స్పష్టం చేశారు. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత జమ్మూకాశ్మీర్ లోకి ఆక్రమణదారులను పంపినప్పటి నుంచి పాక్ కుట్రను భారత్ అర్ధం చేసుకుని ఉండాల్సిందని అన్నారు.

ఏది ఏమైనా... పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారతదేశపు సహనం పూర్తిగా నశించిందని తెలిపారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ, వారికి ఆర్థిక సహాయం చేస్తూ, ఆయుధాలు అందిస్తూ పాకిస్థాన్ ప్రపంచ మానవాళికి ముప్పుగా మారిందని అన్నారు.