శభాష్ అసదుద్దీన్ ఓవైసీ.. రోటీన్ కు భిన్నమైన పిలుపు!
పహల్గాంలో చోటు చేసుకున్న ఉగ్రదాడి వేళ.. మతం పేరు అడిగి మరీ.. చంపేసిన వైనం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న హిందువుల్లో వేదనకు గురి చేస్తోంది.
By: Tupaki Desk | 25 April 2025 10:41 AM ISTరాజకీయం రాజకీయమే. కానీ.. మానవత్వానికి ముప్పు వాటిల్లేలా.. దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర జరుగుతున్న వేళలో..ఇగో లను.. పార్టీ విధానాల్ని పక్కన పెట్టేసి.. మరింత పెద్ద మనసుతో.. దూరద్రష్టి తో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముందు ఉన్నారని చెప్పాలి. నిజమే.. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దేశంలోని ముస్లింల ప్రయోజనాల కోసం.. వారి తరఫున కొట్లాడుతుంటారు. ఆ విషయంలో వేరే మాట లేదు. కానీ.. మతం కంటే దేశం మరింత ముఖ్యమని.. ఈ దేశం బలోపేతంగా ఉండాలంటే.. మతం పేరుతో ప్రజలు విభజనకు గురి కాకూడదన్న విషయాన్ని అసద్ లాంటి వారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
పహల్గాంలో చోటు చేసుకున్న ఉగ్రదాడి వేళ.. మతం పేరు అడిగి మరీ.. చంపేసిన వైనం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న హిందువుల్లో వేదనకు గురి చేస్తోంది. ఇలాంటి వేళ.. వారి వేదనా భరిత హృదయాలకు సాంత్వన కలిగేందుకు వీలుగా మజ్లిస్ అధినేత తాజాగా ఇచ్చిన పిలుపు అందరిని ఆకర్షిస్తోంది. గాయపడిన మనసులకు ఊరట కలిగించేలా.. ఉగ్రవాదులు వేసిన దుర్మార్గ ప్రణాళికకు చెక్ పెట్టేలా అసద్ స్పందన ఉందని చెప్పాలి.
పహల్గాం ఉగ్రచర్యను ఖండిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు శుక్రవారం జరిగే ప్రార్థనల సందర్భంగా నల్ల రిబ్బన్ పెట్టుకొని తమ నిరసనను తెలియజేయాలని పిలుపునిచ్చారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో నిరసనలు తెలుపుతున్న హిందువులకు.. హిందూ సంఘాలకు మద్దతుగా ముస్లింలు రోడ్ల మీదకు రావాలన్న వాదనకు చాలామంది సెక్యులరిస్టులు అవసరం లేదన్న మాటల్ని.. దేశంలోని ముస్లింలు తమ శీలాన్ని ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదన్న వెకిలి మాటల్ని పక్కన పెట్టేయాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే.. మతం పేరుతో మారణహోమానికి పాల్పడితే.. అదే మతానికి చెందిన వారు కూడా సహించమన్న హెచ్చరికను ఉగ్రసంస్థలకు పంపాల్సిన అవసరం ఉంటుంది కదా? ఈ చిన్న లాజిక్ ను మేధావులుగా చెప్పుకునే సెక్యులరిస్టు లు ఎందు కు మిస్ అవుతున్నారు? ఇక్కడే మరో విషయాన్ని మర్చిపోకూడదు. హిందూ ఛాందసం పెరగకుండా అడ్డుకోవటానికి వీలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలోని ముస్లింలు కూడా ఒక అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మజ్లిస్ అధినేత అసుదుద్దీన్ ఓవైసీ గుర్తించినట్లుగా కనిపిస్తోంది.
మతం పేరుతో రాజకీయం చేస్తూ.. రాజకీయ ప్రయోజనాలు పొందటం తప్పేం కాదు. అదే సమయంలో మతం కంటే మానవత్వం ముఖ్యమని.. మతం పేరుతో జరిగే ఉగ్రచర్యలకు చెక్ పెట్టకపోతే.. దేశ ఐక్యతకు భంగం వాటిల్లుతుందన్న విషయాన్ని అసదుద్దీన్ ఓవైసీ గుర్తించినట్లు గా కనిపిస్తోంది. ఈ కారణంతోనే కావొచ్చు. గతానికి భిన్నంగా ఆయన పహల్గాం ఉగ్రదాడికి నిరసన వ్యక్తం చేయాలంటూ దేశంలోని ముస్లింల కు పిలుపునిచ్చినట్లుగా చెప్పాలి. రోటీన్ కు భిన్నమైన పిలుపు ఇవ్వటం ద్వారా అసుద్దీన్ ఓవైసీ తనను విమర్శించే వారికి చెక్ పెట్టారని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి తీరు అభినందించదగినదని చెప్పక తప్పదు.
