ఎన్నికల ట్విస్టు: సీఎంపై నిప్పులు చెరిగిన ఓవైసీ బ్రదర్స్!
ఇదే తీరు చంద్రబాబు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలు కేసీఆర్.. తాజాగా రేవంత్ తోనూ అదే తీరును వారు ఫాలో అవుతున్నారు.
By: Garuda Media | 10 Feb 2026 10:25 AM ISTరాజకీయ ప్రయోజనాల ముందు మిత్రత్వాన్ని సైతం పక్కన పెట్టేయటం.. తాము అనుకున్నది అనుకున్నట్లు జరిగిన తర్వాత.. తాము చేయాల్సింది చేసే గుణం మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీకి మొదట్నించి అలవాటే. అధికారంలో ఉన్న వారితో స్నేహంగా ఉండటం.. అధికారపక్షానికి అండగా ఉంటూ.. తమ అధికారానికి తిరుగులేనట్లుగా ఉండటం ఓవైసీ బ్రదర్స్ లో కనిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో మిత్రుడి హోదాలో ఉండి కూడా.. వ్యంగ్య వ్యాఖ్యలు చేయటం.. ఆవేశపూరిత ప్రసంగాలు చేయటం లాంటివి చేస్తుంటారు.
ఇదే తీరు చంద్రబాబు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలు కేసీఆర్.. తాజాగా రేవంత్ తోనూ అదే తీరును వారు ఫాలో అవుతున్నారు. వీరందరికి ఒకే ఒక్క మినహాయింపు ఎవరైనా ఉన్నారంటే అది ఉమ్మడి రాష్ట్ర ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిగా చెప్పాలి. ఆయన కారణంగా ఏళ్లకు ఏళ్ల పాటు కాంగ్రెస్ తో మిత్రత్వానికి దూరంగా ఉన్న పరిస్థితి. రేవంత్ తెలంగాణ సీఎం అయ్యాక.. కొన్ని రోజులకు కానీ మిత్రులుగా మారని పరిస్థితి.
తాజాగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. రోజు వ్యవధిలో ఓవైపు అన్న అసద్.. తమ్ముడు అక్బరుద్దీన్ ఇద్దరూ అధికార కాంగ్రెస్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయటమే కాదు.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ పైనా విమర్శలు చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎన్నికల వేళ.. ఈ తరహా తీరు ఓవైసీ బ్రదర్స్ కు అలవాటే. తాజాగా జరుగుతున్న మున్సిపోల్స్ లో కొన్ని ప్రాంతాల్లో మజ్లిస్ కీలకభూమిక పోషిస్తుందని చెబుతున్నారు. ఈ కారణంగతోనే కాంగ్రెస్ పైన సైతం నిప్పులు చెరుగుతూ తమ ఓటర్లను ఒక్కతాటి మీదకు సమీకరించే వ్యూహంలో ఉన్నారని చెప్పాలి.
అందుకే ముఖ్యమంత్రి రేవంత్ పైనా విమర్శలు చేయటానికి ఓవైసీ బ్రదర్స్ అస్సలు లక్ష్య పెట్టలేదు. అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వద్దకు తాము వెళ్లమని.. వాళ్లే తమ వద్దకు వస్తారు’’ అనిని పేర్కొనటం గమనార్హం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ మద్దతు లేకుండానే కాంగ్రెస్ గెలిచిందా? అంటూ సూటిప్రశ్నను సంధించారు. అంతేనా.. రెడ్డి అయినా రావు అయినా తమ వద్దకు రావాల్సిందేనని వ్యాఖ్యానించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. తాజా మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ బ్రదర్స సత్తా చాటుతామని వ్యాఖ్యానించారు.
అక్బరుద్దీన్ ఏ రీతిలో రియాక్టు అయ్యారో.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ సైతం తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ ను ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా విమర్శల బాణాల్ని సంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీల్నినెరవేర్చటంలో విఫలమైందన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయింపుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించటంత పాటు.. ముస్లింలు తమకంటూ స్వతంత్ర రాజకీయ నాయకత్వాన్ని పెంపొందించుకోవాలని.. కాంగ్రెస్ లేదంటే ఇతర పార్టీలపై ఆధారపడొద్దని పిలుపునివ్వటం గమనార్హం.
అంతేకాదు..కాంగ్రెస్ లోని ముస్లిం ఎంపీలు సమాజ సమస్యలపై గొంతు ఎత్తటం లేదని టార్గెట్ చేయటం చూస్తే.. ముస్లింలను తాము తప్పించి.. మరెవరూ పట్టించుకోవటం లేదన్న విషయాన్ని సూటిగా.. స్పష్టంగా చెబుతున్నారని చెప్పాలి. ఓవైపు మిత్రుడిగా ఉంటూనే.. మరోవైపు అవసరానికి తగ్గట్లు విమర్శలు చేయటం దేనికి నిదర్శనం? మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తమ ప్రయోజనాలకు మాత్రమే పెద్దపీట వేసి.. మిత్రుడ్ని సైతం పక్కన పెట్టేసిన ఓవైసీ బ్రదర్స్ తీరు ఆసక్తికరంగా మారింది. తనను ఏ చిన్న మాట అన్నా ఘాటుగా రియాక్టు అయ్యే సీఎం రేవంత్.. తమ ప్రభుత్వం మీద ఓవైసీ బ్రదర్స్ చేసిన వ్యాఖ్యలకు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.
