Begin typing your search above and press return to search.

ఐఫోన్‌ పాస్‌ వర్డ్‌ మర్చిపోయిన సీఎం.. యాపిల్‌ ఏం చేసిందో తెలుసా?

దీంతో కేజ్రీవాల్‌ ఐఫోన్‌ ను అన్‌ లాక్‌ చేయడంతోపాటు అందులోని డేటాను తమకందించాలని ఐఫోన్‌ తయారీ కంపెనీ యాపిల్‌ ను ఈడీ సంప్రదించిందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   3 April 2024 8:48 AM GMT
ఐఫోన్‌ పాస్‌ వర్డ్‌ మర్చిపోయిన సీఎం.. యాపిల్‌ ఏం చేసిందో తెలుసా?
X

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ను ఎనఫోర్సుమెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే, ఏప్రిల్‌ 11 వరకు కోర్టు ఆయనకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో ఆయనను తీహార్‌ జైలుకు తరలించారు.

కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక పాత్ర పోషించారని ఈడీ ఆరోపిస్తోంది. గోవా, పంజాబ్‌ ఎన్నికల్లో ఢిల్లీ మద్యం కుంభకోణంలో అందిన నిధులనే కేజ్రీవాల్‌ వాడారని చెబుతోంది. మద్యం కుంభకోణంలో ప్రధాన కుట్రదారుడు ఆయనేనని ఆరోపిస్తోంది.

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ను అరెస్టు చేశాక మద్యం కుంభకోణానికి సంబంధించిన వాట్సాప్‌ చాట్‌లు, కాల్‌ డేటాను తిరిగి పొందేందుకు ఆయనకు చెందిన వ్యక్తిగత ఫోన్‌ లను ఈడీ స్వాధీనం చేసుకుంది. అయితే తన ఐఫోన్‌ పాస్‌ వర్డ్‌ ను మర్చిపోయానని కేజ్రీవాల్‌ చెప్పడంతో ఆయన ఫోన్‌ లోని డేటాను ఈడీ అధికారులు పరిశీలించలేకపోయారు. దీంతో కేజ్రీవాల్‌ ఫోన్‌ లో డేటా సేకరణ ప్రక్రియ నిలిచిపోయింది.

దీంతో కేజ్రీవాల్‌ ఐఫోన్‌ ను అన్‌ లాక్‌ చేయడంతోపాటు అందులోని డేటాను తమకందించాలని ఐఫోన్‌ తయారీ కంపెనీ యాపిల్‌ ను ఈడీ సంప్రదించిందని తెలుస్తోంది.

అయితే ఫోన్‌ యజమాని మాత్రమే పాస్‌వర్డ్‌ ను యాక్సెస్‌ చేయగలరని యాపిల్‌ కంపెనీ ఈడీ అభ్యర్థనను తిరస్కరించిందని సమాచారం. తన ఫోన్‌ పాస్‌ వర్డ్‌ ను మర్చిపోయినట్లు సీఎం కేజ్రీవాల్‌ చెప్పడం, దాన్ని అన్‌లాక్‌ చేయాలన్న అభ్యర్థనను యాపిల్‌ తోసిపుచ్చడంతో, ఫోన్‌ డేటాను ఈడీ యాక్సెస్‌ చేయడంలో చాలా ఇబ్బంది పడుతున్నటు తెలుస్తోంది. మరి ఈడీ ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తుందో వేచిచూడాల్సిందే.

మరోవైపు తమ పార్టీని చిన్నాభిన్నం చేయడానికి ఈడీ మరో నలుగురు నేతలను అరెస్టు చేయనుందని ఆప్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ ఆర్థిక మంత్రి ఆతిశీ, ఎంపీ రాఘవ చద్దా, సౌరభ్‌ భరద్వాజ్, దుర్గేశ్‌ పాఠక్‌ లను అరెస్టు చేస్తారని ఆప్‌ నేతలు విమర్శలు చేస్తున్నారు. కేజ్రీవాల్‌ అరెస్టు తర్వాత కూడా ఆప్‌ పార్టీ ధృడంగా నిలబడటాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందని వారు ఆరోపిస్తున్నారు.