బండి vs ఈటల వివాదంపై ఎంపీ అరవింద్ సంచలన కామెంట్స్
తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతల మధ్య అంతర్గత విభేదాలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి.
By: Tupaki Desk | 23 July 2025 9:00 PM ISTతెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతల మధ్య అంతర్గత విభేదాలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ కేంద్రమంత్రి, ఎంపీ బండి సంజయ్ , సీనియర్ నేత ఈటల రాజేందర్‌ల మధ్య నెలకొన్న వివాదంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదంపై పాత, కొత్త బీజేపీ అధ్యక్షులు కలిసి చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే, పార్టీ కేంద్ర హైకమాండ్ ఒక న్యూట్రల్ నోడల్ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయాలని అరవింద్ సూచించారు.
- వివాదాలొస్తాయి.. కానీ పరిష్కార మార్గం ముఖ్యం
ఎంపీ అరవింద్ మాట్లాడుతూ "ఎంత పెద్ద పార్టీ అయినా కొన్ని వివాదాలు సహజమే. కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి పరిస్థితిని చూసినా, బీఆర్‌ఎస్‌లో కవిత, కేటీఆర్ మధ్య జరుగుతున్న పరిణామాలను గమనించినా ఇది అర్థమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ నాయకత్వం కూడా ఈ విషయాన్ని తేలికగా తీసుకోకుండా, బాధ్యతతో పరిష్కరించాలి" అని అన్నారు. పార్టీలో ఐక్యత సాధించడం ఎంత ముఖ్యమో ఆయన నొక్కి చెప్పారు.
-రాజాసింగ్‌పై స్పందన
ఈ సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అంశాన్ని కూడా ఎంపీ అరవింద్ ప్రస్తావించారు. "రాజాసింగ్‌ను మేము గౌరవిస్తాం. ఆయన ఒక ఐడియాలాజికల్ మ్యాప్. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కాలేదు.. స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. రేపు మిస్డ్ కాల్ ఇస్తే తిరిగి సభ్యత్వం పొందవచ్చు" అని స్పష్టం చేశారు. కొన్ని అంశాల్లో మనస్థాపం చెంది ఆయన రాజీనామా చేశారని పేర్కొన్నారు.
-ఎంపీలకు రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలి
తెలంగాణ బీజేపీ ఎంపీలకు మరింత బాధ్యతలు అప్పగించాలని అరవింద్ కోరారు. "ఒక్కో ఎంపీకి రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలి. వారికి పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలి. ఫలితాలు రాకపోతే పక్కకు పెట్టడం సరైంది. కార్యకర్తలు బీజేపీకి బలమైన వెన్నుదన్ను. నాయకులు వారిలోంచే రావాలి" అని తెలిపారు. పార్టీ నిర్మాణం, కార్యకర్తల భాగస్వామ్యంపై ఆయన దృష్టి సారించారు.
-స్థానిక ఎన్నికల్లో బీజేపీ లక్ష్యం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఎంపీ అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. "ఇందూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని బీజేపీ గెలుస్తుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం. ఇది కార్యకర్తల కోసం జరిగే ఎన్నిక. శ్రేణులంతా ఈ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలి. కార్యకర్తలే నాయకులుగా ఎదగాల్సిన సమయం ఇది" అని స్పష్టంగా తెలిపారు.
ఈటల-బండి వివాదం ముదురకుండా ముందే పటిష్ట చర్యలు తీసుకోవాలన్న అరవింద్ వ్యాఖ్యలు బీజేపీకి ఇప్పుడున్న కీలక సందేశంగా కనిపిస్తున్నాయి. నాయకత్వం మధ్య ఐక్యత, క్షమాశీలత ఉంటే పార్టీ మరింత బలపడుతుందని ఆయన సందేశం స్పష్టంగా తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం ఈ అంతర్గత విభేదాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
