Begin typing your search above and press return to search.

మోడీ గెలవాలని వేలు కోసుకుని రక్తంతో ఏమి రాశాడంటే...?

అవును... రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ మరోసారి గెలవాలని ఆకాంక్షిస్తూ కర్ణాటకకు చెందిన అరుణ్ వర్నేకర్ అనే వ్యక్తి తన ఎడమ చేతి చూపుడు వేలు కట్ చేసుకుని పలువురిని దిగ్భ్రాంతికి గురి చేశాడు!

By:  Tupaki Desk   |   8 April 2024 5:47 AM GMT
మోడీ గెలవాలని వేలు కోసుకుని  రక్తంతో ఏమి రాశాడంటే...?
X

సినిమా నటీనటులకు, క్రికెటర్లకూ అభిమానులు ఉన్నట్లే రాజకీయ నాయకులకు కూడా బలమైన ఫ్యాన్ బెల్ట్ ఉంటుంటుందనేది తెలిసిన విషయమే. కాకపోతే వీరిని అభిమానులు అని కాకుండా అనుచరులు, కార్యకర్తలు అని సంబోధిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా మోడీకి సంబంధించిన ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన మోడీ గెలవాలని చేతి వేలు కోసేసుకున్నాడు!

అవును... రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ మరోసారి గెలవాలని ఆకాంక్షిస్తూ కర్ణాటకకు చెందిన అరుణ్ వర్నేకర్ అనే వ్యక్తి తన ఎడమ చేతి చూపుడు వేలు కట్ చేసుకుని పలువురిని దిగ్భ్రాంతికి గురి చేశాడు! వర్నేకర్ ఈ విపరీతమైన చర్యను కాళీమాతకు త్యాగం చేస్తూ, మోడీ మూడవసారి అధికారంలోకి రావాలంటూ ప్రార్థించారు. కార్వార్ నగరంలోని సోనార్వాడ ప్రాంతంలో నివాసం ఉంటున్న వర్ణేకర్.. ప్రధాని మోడీ కోసం ఇలా చేయడం వైరల్ గా మారింది. .

ఇలా ప్రధాని మోడీ మూడోసారి గెలవాలని ఆకాంక్షిస్తూ తన చూపుడు వేలును కాళీమాతకు బలిదానం ఇచ్చిన అనంతరం... ఆ రక్తంతో ఆలయ గోడలపై.. "మోడీ బాబా సబ్సే మహాన్”.. "మా కాళీ మాతా, మోడీ బాబా కా రక్షా కరో" (మోడీ అందరికన్నా గొప్పవారు. నువ్వు ఆయనను గెలిపించాలి కాళీమాత) అని రాశాడు. అతను తన ఇంట్లోనే మోడీకి గుడి కట్టి రోజూ పూజలు చేస్తున్నాడు.

ఈ సందర్భంగా స్పందించిన వర్నేకర్... ప్రధాని మొడీ బాధ్యతలు చేపట్టినప్పటినుంచీ పొరుగు దేశాలతో హలహాలు తగ్గాయని చెబుతున్నారు! ఇదే సమయంలో... కాశ్మీర్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పినందుకు మోడీ ఘనత సాధించారని.. దేశ ప్రగతి మోడీ నాయకత్వంపైనే ఆధారపడి ఉందని విశ్వసిస్తున్నాడు వర్నేకర్! ఇదే క్రమంలో... దేశాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి అవసరం అని చెబుతున్నాడు!

కాగా... గతంలో ముంబై చిత్ర పరిశ్రమలో పనిచేసిన వర్నేకర్.. ఇప్పుడు కార్వార్ నగరంలో నివసిస్తూ తన వృద్ధతల్లిని చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో... అవివాహితుడైన వర్నేకర్ కి ప్రధాని మోడీపట్ల అభిమానం కాస్తా భక్తిగా మారిపోయిందని అంటున్నారు. దీంతో... నాయకులపై అభిమానం పేరుతో శరీరాలను గాయపరచుకునే పిచ్చి పనులు చేయొద్దని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.