Begin typing your search above and press return to search.

ట్రంప్‌ మోసగాడే: జడ్జి సంచలన వ్యాఖ్యలు!

ట్రంప్‌ తన కంపెనీ ఆస్తుల విలువను అధికంగా అంచనా వేయడం ద్వారా పలు ఒప్పందాలు చేసుకున్నారని వ్యాఖ్యానించింది.

By:  Tupaki Desk   |   28 Sep 2023 9:43 AM GMT
ట్రంప్‌ మోసగాడే: జడ్జి సంచలన వ్యాఖ్యలు!
X

వచ్చే అమెరికా ఎన్నికల్లో మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావిస్తున్న మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్‌ మోసగాడేనని న్యూయార్క్‌ న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌ జడ్జి ఇచ్చిన తీర్పు.. 2024 రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థిత్వానికి ట్రంప్‌ కు ఇబ్బంది అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ట్రంప్‌ తన కంపెనీ ఆస్తుల విలువను అధికంగా అంచనా వేయడం ద్వారా పలు ఒప్పందాలు చేసుకున్నారని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ట్రంప్‌ అక్రమంగా రుణాలు పొందారని న్యూయార్క్‌ న్యాయమూర్తి ఆర్థర్‌ ఎంగ్రోన్‌ తెలిపారు. తన ఆస్తుల విలువను డాక్యుమెంట్లలో భారీగా చూపించి, పలు బ్యాంకులు, బీమా సంస్థలను, ఇతరులను ట్రంప్‌ మోసం చేశారని వ్యాఖ్యానించారు.

రియల్‌ ఎస్టేట్‌ సామ్రాజ్యంతో ఆయనకు వచ్చిన జనాదరణే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవడానికి ట్రంప్‌ కు దారి వేసిందని తెలిపారు. ట్రంప్‌ సంస్థలకు చెందిన కొన్నింటి లైసెన్స్‌ లను న్యూయార్క్‌ పరిధిలో రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తాను స్వతంత్రంగా వారి సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షిస్తానని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

మోసాలకు పాల్పడిన నేపథ్యంలో డోనాల్డ్‌ ట్రంప్‌ కు సంబంధించిన కొన్ని వ్యాపార సంస్థల లైసెన్స్‌ లను రద్దు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా ట్రంప్, అతని ముగ్గురు పిల్లలు సంయుక్తంగా వారి కంపెనీల విలువను పెంచి, బ్యాంకులు, బీమా సంస్థలకు చూపారని న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ లెటిటియా జేమ్స్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇందుకు గానూ ట్రంప్‌ కు, ఆయన సంతానానికి 250 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించాలని జేమ్స్‌ కోరారు. అంతేకాకుండా న్యూయార్క్‌ లో ట్రంప్‌ వ్యాపారం చేయకుండా నిషేధించాలని డిమాండ్‌ చేశారు.

ఈ నేపథ్యంలో ట్రంప్‌ మోసాలను న్యాయస్థానం నిర్ధారించడంతో ఆయనకు విధించాల్సిన శిక్షపై న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి ముందు న్యూయార్క్‌ జడ్జి ఆర్థర్‌ ఎంగ్రోన్‌ అక్టోబర్‌ 2న నాన్‌–జ్యూరీ ట్రయల్‌ ని నిర్వహించాలని యోచిస్తున్నారు.

మరోవైపు ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్‌ చెబుతున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే బైడెన్‌ ప్రభుత్వం తనను అక్రమ కేసుల్లో ఇరికిస్తోందని మండిపడుతున్నారు. విచారణకు ముందే తనపై ఉన్న కేసును కొట్టివేయాలని ట్రంప్‌ లాయర్లు న్యూయార్క్‌ న్యాయమూర్తిని గతంలోనే కోరారు. తాజాగా న్యూయార్క్‌ కోర్టు ఇచ్చిన తీర్పును పైకోర్టులలో సవాలు చేస్తామని ట్రంప్‌ తరఫు న్యాయవాదులు తెలిపారు.