Begin typing your search above and press return to search.

షెడ్యూల్ కు తగ్గట్లే భూమికి తిరిగి వచ్చిన ఆర్టిమిస్ 2

షెడ్యూల్ కు తగ్గట్లే.. చంద్రుడ్నిచుట్టేసిన ఆర్టెమిస్ 2 తిరిగి భూమికి క్షేమంగా చేరుకుంది. నాసా చేపట్టిన ఈ ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది.

By:  Garuda Media   |   11 April 2026 3:18 PM IST
షెడ్యూల్ కు తగ్గట్లే భూమికి తిరిగి వచ్చిన ఆర్టిమిస్ 2
X

షెడ్యూల్ కు తగ్గట్లే.. చంద్రుడ్నిచుట్టేసిన ఆర్టెమిస్ 2 తిరిగి భూమికి క్షేమంగా చేరుకుంది. నాసా చేపట్టిన ఈ ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది. కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రం శాన్ డియాగో తీరంలో వ్యోమగాముల ఒరాయన్ క్యాప్సుల్ ల్యాండ్ అయ్యింది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 5.38 గంటల వేళకు వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు.

దీంతో.. వీరి పది రోజుల జాబిల్లి యాత్ర పూరతైంది. భూమి నుంచి అత్యంత దూరం ప్రయాణించిన మానవసహిత అంతరిక్ష యాత్రగా ఆర్టెమిస్ 2 రికార్డును క్రియేట్ చేసింది. ఈ యాత్రలో రీడ్ వైజ్ మాన్.. విక్టర్ గ్లోవర్.. క్రిస్టినా కోచ్.. కెనడాకు చెందిన జెరెమీ హాన్సెన్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర ఇస్పెషల్ ఏమంటే.. యాభై ఏళ్ల తర్వాత చంద్రుడి దరిదాపుల్లోకి వెళ్లిన మొదటి వ్యోమగాములుగా నిలిచారు. అంతేకాదు మానవులు భూమి నుంచి ప్రయాణించిన అత్యంత సదూర ప్రాంతంగా దీన్ని చెప్పాలి. వీరి మొత్తం ప్రయాణం సుమారు 4 లక్షల కిలోమీటర్లుగా చెప్పొచ్చు.

ఆసక్తికర అంశం ఏమంటే.. భూవాతావరణంలోకి ప్రవేశించే సమయానికి వ్యోమనౌక వేగం గంటకు అక్షరాల 40 వేల కిలోమీటర్లకు పైనే ఉంటుంది. పారాచూట్ల సాయంతో నౌకను సురక్షితంగా సముద్రంలో ల్యాండ్ అయ్యింది. దీంతో.. ఆర్టెమిస్ 3 ప్రయోగానికి కౌంట్ డౌన్ షురూ అయ్యిందని చెప్పాలి. ఈ ప్రయోగంలో చంద్రుడిపై మానవులను ల్యాండ్ చేసే మిషన్ ను నాసా రెఢీ చేస్తోందని చెప్పాలి. ఆర్టెమిస్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వ్యోమగాములు సముద్రంలో ల్యాండ్ అయ్యాక.. అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్ఎస్ జాన్ పి. ముర్తా అనే నౌకలో వీరిని హెలికాఫ్టర్ ద్వారా తీసుకెళ్లారు. ఈ నౌకలో వ్యోమగాములకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా దాదాపు 12 గంటల నుంచి 24 గంటల వరకు నౌకలోనే ఉండాల్సి వస్తుంది.

సాధారణంగా అంతరిక్ష ప్రయాణం తర్వాత వ్యోమగాముల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు కొన్నిరోజులు వైద్యుల నిఘాలో ఉంచుతారు.ఆర్టెమిస్ 2 కేవలం పది రోజుల మిషన్ అన్నది తెలిసిందే. సాధారణంగా ఐఎస్ఎస్ లో ఉన్న వారితో పోలిస్తే వీరికి ఎక్కువ కాలం క్వారంటైన్ అవసరం లేదు. కాకుంటే వారి శరీరంలో వచ్చిన మార్పులను అధ్యయనం చేసేందుకు వారం నుంచి పది రోజు ల వరకు వారికి పరీక్షలు ఉండొచ్చు. అయితే.. వీరు తమ కుటుంబ సభ్యుల్ని ఈ రోజే కలిసే వీలుందని చెబుతున్నారు.

అధికారిక వైద్య పరీక్షల అనంతరం వీరిని ఇళ్లకు పంపుతారు. ఇందుకోసం ఒకట్రెండు వారాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం వారు తమ సాధారణ జీవితాన్ని షురూ చేయొచ్చు. నాసా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అందరూ వ్యోమగాములు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వీరిని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ కు చేరుకున్న అనంతరం కుటుంబ సభ్యులతో కలుస్తారు. అనంతరం ఇంటికి వెళ్లిపోతారు. కాకుంటే.. వైద్య పరీక్షల కోసం రోజువారీగా వారు జాన్సన్ స్పేస్ సెంటర్ కు రావాల్సి ఉంటుంది.

చంద్రుడియాత్రకు వెళ్లి వచ్చిన తర్వాత భూమి గురుత్వాకర్షణకు తిరిగి అలవాటు పడేందుకు వ్యోమగాములకు మూడు నుంచి ఐదు రోజుల పాటు సమయం పడుతుంది. అంతేకాదు.. సుదీర్ఘ ప్రయాణం తర్వాత వారి మానసిక స్థితిని పరిశీలిస్తారు. అన్నింటి కంటే ముఖ్యంగా వ్యోమగాముల ఎముకల సాంద్రత.. కండరాల పటిష్టతను చెక్ చేస్తుంటారు. ఈ యాత్రలో పాల్గొన్న వారిలో విక్టర్ గ్లోవర్..‘ఇక్కడి నుంచి చాలా అందంగా కనిపిస్తోంది. మనమంతా ఒకే జాతి’ అంటూ ఉద్వేగానికి గురయ్యారు. మరో వ్యోమగామి రీడ్ వైజ్ మాన్ తన దివంగత భార్యకు గుర్తుగా చంద్రుడిపై ఒక క్రేటర్ కు ఆమె పేరు పెట్టిన వైనం తనకు ఎదురైన అత్యంత భావోద్వగ క్షణంగా పేర్కొన్నారు.

ఈ ప్రయోగం కోసం సుమారు రూ.35 వేల కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. చంద్రుడి నుంచి తిరిగి వచ్చి సముద్రంలో ల్యాండ్ అయిన తర్వాత ఓరియన్ నౌకను యూఎస్ఎస్ జాన్ పి. ముర్తా అనే నౌక ద్వారా తరలిస్తున్నారు. అనంతరం శాన్ డియాగోలోని నావికా దళ స్థావరానికి తరలిస్తారు. అనంతరం దీన్ని ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ కు తీసుకెళ్లి.. 2028లో ప్రయోగించే ఆర్టెమిస్ 3 మిషన్ కోసం ఇందులోని కీలక భాగాల్ని మళ్లీ ఉపయోగించే వీలుందా? లేదా? అన్నది పరిశీలిస్తారు. ఈసారి ప్రయోగంలో చంద్రుడి మీద ల్యాండ్ అవుతారు. తదుపరి ప్రయోగానికి అవసరమైన వ్యోమగాముల కోసం ప్రస్తుతం 18 మందిని ఎంపిక చేశారు. వీరిలో నలుగురిని తుది ఎంపిక చేసి చంద్రుడి మీదకు పంపనున్నారు. ఈ ప్రయోగం 10-14 రోజుల వరకు సాగనుంది.