Begin typing your search above and press return to search.

జగనన్న ఆరోగ్య సురక్ష.. ఎన్నికల వేళ బ్రహ్మాస్త్రం.. అదెలానంటే?

వ్యూహాత్మకంగా వ్యవహరించటం ఒక ఎత్తు. వ్యూహాన్ని ఓపెన్ గా చెప్పేసి.. దానికి అనుగుణంగా చేసుకుంటూ పోవటం మరో ఎత్తు

By:  Tupaki Desk   |   27 Sep 2023 5:35 AM GMT
జగనన్న ఆరోగ్య సురక్ష.. ఎన్నికల వేళ బ్రహ్మాస్త్రం.. అదెలానంటే?
X

వ్యూహాత్మకంగా వ్యవహరించటం ఒక ఎత్తు. వ్యూహాన్ని ఓపెన్ గా చెప్పేసి.. దానికి అనుగుణంగా చేసుకుంటూ పోవటం మరో ఎత్తు. రాజకీయాల్లో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా.. వారి ఆలోచనలకు అందకుండా ప్లానింగ్ చేసే విధానానికి భిన్నంగా.. చెసేది చెప్పేస్తూ.. ఏమేం చేయాలి? ఎలా చేయాలి? అన్న విషయాల్ని ఓపెన్ గా చెప్పేస్తూ.. మనసు దోచుకునే కార్యక్రమాల్ని చేపట్టటం ద్వారా ప్రజాఅభిమానాన్ని సొంతం చేసుకోవటం మరో ఎత్తు. ఇప్పుడు అలాంటి ఎత్తుగడకు తెర తీశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

రానున్న ఆర్నెల్లలో జరిగే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తామన్న విషయాన్ని బ్రహ్మ పదార్థంలా కాకుండా.. తన చేతిలోని ఎన్నికల బ్రహ్మాస్త్రాన్ని వివరంగా చెప్పేసిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సరికొత్త తీరులో రాజకీయాల్ని చేపడుతూ.. ప్రత్యర్థులకు అర్థం కానట్లుగా వ్యవహరించే జగన్.. తాజాగా అలాంటి కార్యక్రమాన్నే చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికలకు పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు వీలుగా కొత్త ప్రోగ్రాంలను తెర మీదకు తెస్తున్న జగన్.. తన చేతిలోని ఎన్నికల బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీశారు.

రాబోయే ఆర్నెల్లలో చేపట్టనున్న కార్యక్రమాన్ని వెల్లడించిన జగన్.. అందులో కీలకమైన ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నవంబరు చివరి నాటికి పూర్తి చేయనున్నారు. ఐదు దశల్లో నిర్వహించే జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంను విజయవంతంగా పూర్తి చేయటం ద్వారా.. వైనాట్ 175? లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంతకూ ఐదు దశల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఏం చేస్తారు? ప్రజల మనసుల్ని ఎలా దోచుకుంటారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. తాము చేయాల్సిన ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సీఎం జగన్ స్వయంగా వెల్లడించారు.

గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతి ఇంటిని జల్లెడ పట్టటంతో పాటు.. అందరి ఆరోగ్య సమస్యలకు పరిష్కారం వెతికే ఈ ప్రోగ్రాం రానున్న రోజుల్లో సంచలనంగా మారుతుందని చెప్పాలి. ఇంతకూ ఐదు దశల్లో ఈ ప్రోగ్రాంను ఎలా నిర్వహిస్తారన్నది చూస్తే..

మొదటి దశ

వలంటీర్లు.. గ్రహసారథుల ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి వివరిస్తారు.

రెండో దశ

ప్రతి ఇంటికి వెళ్లే ఏఎన్ఎంలు.. సీహెచ్ వోలు.. ఆశావర్కుర్లు పరీక్షలు చేస్తారు. ఆరోగ్య శ్రీని ఎలా ఉపయోగించుకోవాలో వివరాలు అందజేస్తారు.

మూడో దశ

ఆరోగ్య క్యాంపుల ఏర్పాటు వివరాల్ని తెలియజేస్తారు. క్యాంపు కన్నా మూడు రోజుల ముందే ఈ అలెర్టు చేసే కార్యక్రమం ఉంటుంది. దీని ద్వారా.. ఎవరూ క్యాంపుల్ని మిస్ అయ్యే అవకాశం ఉండదు.

నాలుగో దశ

క్యాంపుల్ని ఏర్పాటు చేస్తారు. వారికి అవసరమైన అనారోగ్య సమస్యలకు పరిష్కారాన్ని సూచన చేస్తారు.

ఐదో దశ

అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించి.. వారి సమస్యలు నయం అయ్యేలా చేయూతను ఇస్తారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది.

ఇవాల్టి రోజున ప్రతి ఇంట్లో కాకున్నా.. ఐదు ఇళ్లల్లో రెండు ఇళ్లలో అయినా ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉండనే ఉంటుంది. ఇందుకోసం బోలెడంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. మధ్యతరగతి.. దిగువ మధ్యతరగతికి చెందిన వారికి వైద్యం ఖర్చులు తడిచి మోపెడు అవుతాయి. అలాంటిది.. ఆ సమస్య లేకుండా.. వారిఆరోగ్య సమస్యల్ని ఉచితంగా పూర్తి చేసి.. వారికి స్వస్థత చేకూర్చటం ద్వారా వారి మనసుల్నిదోచుకోవటమే కాదు.. వైనాట్ 175? అన్న లక్ష్యాన్ని చేరుకోవటం కష్టం కాదన్న మాట వినిపిస్తోంది. జగన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఈ నెల 29న ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారు. 30న అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు స్టార్ట్ చేస్తారు. పేపర్ మీద అదిరేలా ఉన్న ఈ ప్లాన్.. అమలు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరమని చెప్పక తప్పదు.