Begin typing your search above and press return to search.

భారీ నిర్ణయాన్ని తీసుకున్న జగన్.. రూ.25 లక్షల వరకు ఆరోగ్య శ్రీ

వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఈ నెల 18నుంచి కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేయనున్నారు. దీని కింద సచివాలయ.. ఆరోగ్య సిబ్బందికి కొత్త ఆరోగ్య శ్రీ విధివిధానాలపై దిశానిర్దేశం చేస్తారు.

By:  Tupaki Desk   |   10 Dec 2023 6:20 AM GMT
భారీ నిర్ణయాన్ని తీసుకున్న జగన్.. రూ.25 లక్షల వరకు ఆరోగ్య శ్రీ
X

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మరోసంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎన్నికల్లో ఇవ్వని హామీని ఊహించని రీతిలో ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఏపీలో ఆరోగ్య శ్రీని భారీగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ పథకాన్ని పేదలకు మరింతగా చేరువు చేసేందుకు.. వారికి వచ్చే ఆరోగ్య సమస్యల కారణంగా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు వీలుగా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.

వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఈ నెల 18నుంచి కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేయనున్నారు. దీని కింద సచివాలయ.. ఆరోగ్య సిబ్బందికి కొత్త ఆరోగ్య శ్రీ విధివిధానాలపై దిశానిర్దేశం చేస్తారు. అంతేకాదు.. ఆరోగ్య శ్రీ లబ్థిదారులకు కొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల్ని పంపిణీ చేయనున్నారు. ఈ కొత్త కార్డుల ద్వారా రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమాను అందజేస్తారు. దీంతో.. ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చికిత్స పొందే వీలు కలుగుతుంది.

డిసెంబరు 19 నుంచి ఈ కొత్త కార్డుల పంపిణీ చేపడతారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.42 కోట్ల మందికి ఈ కొత్త ఆరోగ్య శ్రీ కార్డుల్ని అందజేయనున్నారు. ప్రస్తుతం ఉన్న విధానాల ద్వారా ఆరోగ్య శ్రీ కింద చికిత్సలో భాగంగా ఆసుపత్రి బిల్లు రూ.వెయ్యి దాటితే పథకం అమలు అయ్యేలా చూస్తున్నారు. ఈ పథకంలో భాగంగా 3257 చికిత్సల్ని ఉచితంగా అందిస్తున్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేందుకు ఉద్దేశించిన ఆరోగ్య శ్రీ కాత్త కార్డుల ద్వారా రూ.25 లక్షల వరకు వైద్యం ఉచితంగా చేయించుకోవటం భారీ ఊరటగా చెప్పాలి.

పేద ప్రజల ఆరోగ్యం కోసం జగన్ ప్రభుత్వం ఎన్నో చర్యల్ని తీసుకుంటుంది. ఆరోగ్య శ్రీతో పాటు.. ఫ్యామిలీ డాక్టర్.. జగనన్న సురక్ష.. మొత్తం సేవల్ని కొత్త ఆరోగ్య శ్రీ కార్డుల ద్వారా ఓకే చోట అందించేలా ఏపీ సర్కారు ప్లాన్ చేస్తోంది. ఏపీలోని ప్రతి పేద కుటుంబానికి ఈ కొత్త ఆరోగ్య శ్రీ కార్డు ఉపయోగపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా చెబుతున్నారు. అంతేకాదు.. ఏపీలోని ప్రతి ఒక్కరి మొబైల్ లో దిశ.. ఆరోగ్య శ్రీ యాప్ లు కచ్ఛితంగా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. దీంతో.. వైద్య చికిత్సల కోసం తక్షణమే సమాచారం అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.