Begin typing your search above and press return to search.

పొత్తు పెట్టుకునే పార్టీలున్నాయా ?

దేనికంటే అసలు కాంగ్రెస్ తో పొత్తుకు ఏ పార్టీ అయినా ఆలోచిస్తోందా అన్నదే సందేహం.

By:  Tupaki Desk   |   14 Jan 2024 11:30 PM GMT
పొత్తు పెట్టుకునే పార్టీలున్నాయా ?
X

రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు చాలా వేగంగా మారిపోతున్నాయి. నిన్నటివరకు శతృవులుగా ఉన్నవారు సడెన్ గా ఇపుడు మిత్రులైపోతున్నారు. అలాగే బలమైన మద్దతుదారులుగా ఉన్న వారు ఇపుడు తీవ్ర వ్యతరేకులుగా మారిపోతున్నారు. ఇలాంటి సమయంలోనే కాంగ్రెస్ ఏపీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఒక ప్రకటనచేశారు. అదేమిటంటే కాంగ్రెస్ తో కలిసొచ్చే పార్టీలతో పొత్తులకు సిద్ధమన్నారు. ఇక్కడే రుద్రరాజు ప్రకటన పెద్ద జోక్ గా మారిపోయింది. దేనికంటే అసలు కాంగ్రెస్ తో పొత్తుకు ఏ పార్టీ అయినా ఆలోచిస్తోందా అన్నదే సందేహం.

అధికార వైసీపీ ఒంటరి పోరుకే రెడీ అవుతోంది. టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్నాయి. తమతో చేతులు కలపమని బీజేపీని పవన్ కల్యాణ్ అడుగుతున్నారు. అయితే టీడీపీతో పొత్తుపై బీజేపీ అగ్రనేతలు ఏమి సమాధానం చెప్పలేదు. ఈ రెండు పార్టీలతో బీజేపీ కూడా కలుస్తుందని ఒకసారి లేదు లేదు ఒంటరిపోరుకే మొగ్గు చూపుతోందని మరోసారి ప్రచారం జరుగుతోంది. ఇక మిగిలింది వామపక్షాలు మాత్రమే. చెప్పుకోవటానికి జాతీయస్ధాయిలో ఇండియా కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలు భాగస్వామ్య పార్టీలు మాత్రమే.

అయితే ఏపీలో కాంగ్రెస్ తో పొత్తుకు వామపక్షాలు సిద్ధం లేవు. టీడీపీతో పొత్తుకు సీపీఐ పదేపదే ప్రయత్నిస్తోందే కాని కాంగ్రెస్ వైపు మాత్రం వెళ్ళటం లేదు. తెలంగాణాలో కాంగ్రెస్ తో కోరి పొత్తు పెట్టుకున్న సీపీఐ ఏపీలో కాంగ్రెస్ ను అసలు పట్టించుకోవటంలేదు. కాబట్టి వామపక్షాలు కూడా కాంగ్రెస్ కు దూరమనే చెప్పాలి. ఇక మిగిలిన పార్టీలు ఏమున్నాయి కాంగ్రెస్ తో పొత్తుకు ? బీఎస్పీ, బీఆర్ఎస్ లాంటి ఉనికిలో కూడా లేని పార్టీలు మరికొన్ని ఉన్నాయి.

వీటిల్లో కూడా బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు. అసలు తెలంగాణాలో తగిలిన దెబ్బనుండి కేసీయార్ ఇంకా కోలుకున్నట్లు లేదు. కాబట్టి ఏపీలో పోటీచేసేది కూడా అనుమానమే. జాతీయ రాజకీయాల కారణంగా కాంగ్రెస్ తో కలవటానికి బీఎస్పీ కూడా అంగీకరించటంలేదు. అసలు వైఎస్ షర్మిల పార్టీలో చేరేంత వరకు కాంగ్రెస్ ను పట్టించుకున్న దిక్కేలేదు. అలాంటిది ఏకంగా పొత్తుల గురించే మాట్లాడేస్తున్నారు రుద్రరాజు.