Begin typing your search above and press return to search.

ముఖ్యమంత్రిని వేటాడుతున్న ఈడీ!

అడవిజంతువుల కోసం వేటగాడు వేటాడినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోసం ఈడీ వేటాడుతోంది.

By:  Tupaki Desk   |   15 Feb 2024 10:30 AM GMT
ముఖ్యమంత్రిని  వేటాడుతున్న ఈడీ!
X

అడవిజంతువుల కోసం వేటగాడు వేటాడినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోసం ఈడీ వేటాడుతోంది. పదేపదే నోటీసులిచ్చి విచారణకు రమ్మని ఒత్తిడి పెడుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే ఒకసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ హాజరయ్యారు. మరి ఆ విచారణలో ఏమి అడిగారు, కేజ్రీవాల్ ఏమిచెప్పారో ఎవరికీ తెలీదు. కానీ అప్పుడు కొద్దిరోజులు ఏమీ మాట్లాడకుండా ఉన్న ఈడీ తర్వాత నుండి పదేపదే నోటీసులు ఇస్తున్నది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే చాలామందిని విచారించిన ఈడీ చాలామందిని అరెస్టు కూడా చేసింది. అరెస్టయిన వారిలో కొందరు ఇంకా జైలులోనే ఉంటే కొందరు బెయిల్ పైన బయటకు వచ్చారు. వీరిలో కూడా కొందరు అప్రూవర్లుగా మారిపోయారు. స్కామ్ లో సూత్రదారుగా చార్జిషీట్లలో, రిమాండ్ రిపోర్టుల్లో చెప్పిన కల్వకుంట్ల కవితను కూడా విచారణకు రమ్మని ఈడీ నోటీసులు ఇస్తునే ఉంది. నోటీసులను చాలెంజ్ చేస్తు కవిత సుప్రింకోర్టులో పిటీషన్ దాఖలుచేశారు. ఆ పిటీషన్ కోర్టు విచారణలో ఉంది.

అందుకనే కవిత జోలికి ఈడీ వెళ్ళటంలేదు. అయితే కేజ్రీవాల్ అటు కోర్టుకూ వెళ్ళలేదు ఇటు విచారణకూ హజరుకావటంలేదు. గడచిన రెండు నెలల్లో సుమారు ఏడుసార్లు ఈడీ నోటీసులు జారీచేసుంటుంది. ఏ నోటీసును కూడా అరవింద్ లెక్కచేయటంలేదు. వేరే కేసులో సీబీఐ కేజ్రీవాల్ ఆఫీసును రెండుమూడుసార్లు తనిఖీలు చేసింది. ఆ తనిఖీల్లో ఏమి దొరికిందో కూడా తెలీలేదు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ప్రభుత్వంలో మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మాజీమంత్రి సత్యేంద్ర జైన్ అరెస్టయి చాలా కాలంగా జైలులోనే ఉన్నారు.

వీళ్ళని విచారించిన ఈడీ ఏమి సమాచారం సంపాదించిందో తెలీలేదు. చాలామందిని అరెస్టుచేసినా ఎవరి దగ్గరా కేజ్రీవాల్ పాత్రకు సంబంధించిన సమాచారం దొరికినట్లు లేదు. అప్రూవర్లుగా మారిన వాళ్ళు కూడా స్కామ్ లో అరవింద్ పాత్రున్నట్లు చెప్పలేదేమో. అందుకనే కేజ్రీవాల్ ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే ఈడీ పదేపదే నోటీసులు జారీచేస్తోంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.