Begin typing your search above and press return to search.

ఆన్నా హజారే శిష్యుడు...అవినీతి ఆరోపణలతో...!

అన్నా హజారే. మహారాష్ట్రకు చెందిన గాంధేయవాది. అవినీతి మరక అంటని మహనీయుడు.

By:  Tupaki Desk   |   22 March 2024 3:54 AM GMT
ఆన్నా హజారే శిష్యుడు...అవినీతి ఆరోపణలతో...!
X

అన్నా హజారే. మహారాష్ట్రకు చెందిన గాంధేయవాది. అవినీతి మరక అంటని మహనీయుడు. ఇప్పటికి 13 ఏళ్ల క్రితం అంటే 2011లో 135 కోట్ల మంది దాకా జనాభా ఉన్న భారత్ ని ఏకత్రాటిపైకి నడిపించి కొన్ని నెలల పాటు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించి పాలకులను గడగడలాడించారు. ఏ పదవీ లేని ఒక సామాన్యుడు అత్యంత శక్తివంతమైన కేంద్ర ప్రభుత్వం మీద పూరించిన సమర శంఖారావం దేశానికి రెండవ స్వాతంత్ర పొరాటంగా అభివర్ణించారు.

ఆయన అవినీతి రహిత సమాజం కోరుకున్నారు. దాని కోసం చట్టాలను తీసుకుని రావాలని జన లోక్ పాల్ బిల్లుని తీసుకుని వచ్చి దాని పరిధిలోకి ప్రధాని పదవిని తీసుకుని రావాలని డిమాండ్ చేశారు అవినీతి అణువు వంతు ఉన్నా చీల్చిచెండాడాల్సిందే అని ఆయన నాడు సింహగర్జన చేశారు.

ఒకనాడు దేశాన్ని మహాత్ముడు స్వాతంత్ర కాంక్ష నింపుతూ ఆసేతు హిమాచలం ఒక్కటిగా చేసి ఉత్తేజపరిస్తే 2011 నాటికి అన్నా హజారే అన్న మహానుభావుడు అంతకు అంతా చేశారు. మరో గాంధీగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆబాల గోపాలం అన్నా హజారే నినాదాన్ని అందిపుచ్చుకుని గల్లీ నుంచి ఢిల్లీ దాకా రోజులు నెలల తరబడి ఉద్యమించింది.

చివరికి ఆ ఉద్యమ ప్రభావం ఎంతటిదాకా వెళ్లింది అంటే నాడు అధికారంలో ఉన్న యూపీఏ సర్కార్ ని కూలదోసింది. అదే సమయంలో బీజేపీకి గొప్ప వరంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం నుంచి జాతీయ స్థాయిలోకి వచ్చి బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా మారి ఫుల్ మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం వెనక అన్నా హజారే ఉద్యమం ప్రభావం ఎంతో ఉందని కూడా చెప్పాల్సి ఉంటుంది.

ఇదంతా ఎందుకు అంటే నాటి అన్నా హజారే ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారు అరవింద్ కేజ్రీవాల్ అన్న వారు. ఆయన తాను చేస్తున్న అత్యున్నత ఐఆర్ఎస్ ఉద్యోగాన్ని వదులుకుని అవినీతి వ్యతిరేక ఉద్యమంలో నడిచారు. అన్నా హజారేకు ప్రియ శిష్యుడిగా మారారు. ఆయన ఆ తరువాత కూడా అన్నా హజారే స్ఫూర్తితో ఆప్ ఆద్మీ పార్టీని స్థాపించారు.

అయితే అక్కడే గురు శిష్యుల మధ్య విభేదాలు వచ్చాయని అంటారు. పార్టీ స్థాపించవద్దు అని అన్నా హజారే అన్నారని కూడా చెబుతారు. అయితే కేజ్రీవాల్ మాత్రం కొత్త వ్యవస్థ అంటూ 2012 లో పార్టీని పెట్టారు. జనాలు కూడా ఆయన్ని ఆదరించారు. 2013 మొదలుకుని ఈ రోజు వరకూ ఢిల్లీ సీఎం గా ఆయనే కొనసాగుతున్నారు. అక్కడ ఆప్ పుట్టిన తరువాత మరో పార్టీని ఢిల్లీ పీఠం దక్కినది లేదు.

అయితే అనూహ్యంగా లిక్కర్ స్కాం మాత్రం ఆప్ ప్రభుత్వాన్ని చుట్టుముట్టింది. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా ఆప్ ని ఉక్కికి బిక్కిరి చేస్తోంది. ఆప్ లో కేజ్రీవాల్ తరువాత కీలకంగా ఉన్న మనీష్ సిసోడియాను ఏడాది క్రితమే అరెస్ట్ చేశారు. నాటి నుంచే కేజ్రీవాల్ మీద అరెస్ట్ కత్తి వేలాడుతోంది. అది ఇన్నాళ్ళకు జరిగింది.

ఎక్సైజ్ పాలసీలో మార్పులు తీసుకుని వచ్చారు అన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ.ఆప్ ప్రభుత్వం 2021లో కొత్తగా లిక్కర్ పాలసీని తెచ్చింది. ఈ పాలసీ మేరకు మద్యం అమ్మకాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం జరిగింది. దాంతో ఇందులో పెద్ద స్కాం ఉందని ఆరోపణలు గుప్పుమన్నాయి.

ఇక ఢిల్లీలో కొత్తగా చీఫ్ సెక్రటరీగా వచ్చిన ఆయన ఇందులో స్కాం ఉందని గుర్తించి తన నివేదికను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కి ఇచ్చారు. దాంతో ఆయన అప్పట్లోనే సీబీఐ విచారణకు ఆదేశించారు. ఇందులో కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగింది అని భావించిన నేపధ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. ఇదిలా ఉంటే ఇప్పటి దాకా లిక్కర్ స్కాం లో ఏకంగా 15 మంది పెద్ద తలకాయలు అరెస్ట్ అయ్యాయంటేనే ఈ స్కాం ప్రాధాన్యత తెలుస్తోంది అని అంటున్నారు.

కేజ్రీవాల్ గురించి చెప్పాలంటే హిమశిఖరాలను చుంబించిన గంగాదేవి పాతాళ కుహరాలకు జారిపోయింది అన్నట్లుగా ఆయన ఒక నాడు సొంతంగా పరివర్తన ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. అన్నా హజారేతో కలసి అవినీతి రహిత దేశం కోసం అలుపెరగని పోరాటం చేశారు. ఇపుడు అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ అయ్యారు. ఇందులో నిజానిజాలు కోర్టులు తేలుస్తాయి కానీ క్రేజ్రీవాల్ అరెస్ట్ మాత్రం మధ్యతరగతి వర్గానికి అవినీతిని వ్యతిరేకించేవారికి మింగుడుపడని అంశమే.