Begin typing your search above and press return to search.

తిరుపతిలో రాజకీయ దుమారం.. జనసేన ఎమ్మెల్యే ఆరణికి పొగబెడుతున్నారా?

ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వచ్చే ఎన్నికల్లో తిరిగి పోటీ చేసే పరిస్థితి లేదని జరుగుతున్న ప్రచారం కలకలం రేపుతోంది

By:  Tupaki Desk   |   26 July 2026 10:00 PM IST
తిరుపతిలో రాజకీయ దుమారం.. జనసేన ఎమ్మెల్యే ఆరణికి పొగబెడుతున్నారా?
X

రాయలసీమలో అత్యంత కీలకమైన తిరుపతి నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వచ్చే ఎన్నికల్లో తిరిగి పోటీ చేసే పరిస్థితి లేదని జరుగుతున్న ప్రచారం కలకలం రేపుతోంది. గతంలో చిత్తూరు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆరణి శ్రీనివాసులు ఎన్నికల సమయంలో జనసేనలో చేరి తిరుపతి నుంచి బరిలో దిగారు. కొద్దిరోజుల్లోనే స్థానికంగా పట్టుసాధించి కూటమి గాలిలో సునాయాశంగా గెలిచారు. అయితే స్థానికేతరుడు అనే ముద్ర, స్థానిక రాజకీయాల్లో పట్టులేకపోవడం వంటి కారణాలతో ఎమ్మెల్యే అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు కూడా ఎమ్మెల్యే ఆరణి పోటీపై ప్రభావం చూపవచ్చునని అంటున్నారు.

తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదన్న ప్రచారం అధికార కూటమిలో హాట్ టాపిక్ అవుతోంది. రెండేళ్ల క్రితం రికార్డుస్థాయి మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే రాయలసీమలోని కీలక నియోజకవర్గాన్ని వదులుకోడానికి సిద్ధమవుతున్న ప్రచారమే హీట్ పుట్టిస్తోంది. రాయలసీమలోని ఏకైక బలిజ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి అనారోగ్య సమస్యలే ప్రధాన కారణంగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే శ్రీనివాసులు చిత్తూరుకు మారాలనే ఆలోచనలో ఉన్నారని, అందుకే తిరుపతి వదులుకోవాలని భావిస్తున్నారని మరికొందరు చెబుతున్నారు. ఇదే సమయంలో ఆయన వారసులు బరిలోకి దిగుతారని అంటున్నారు. దీంతో ఎమ్మెల్యే ఆరణి భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయని అంటున్నారు.

గత కొంతకాలంగా ఆరణి శ్రీనివాసులు నియోజకవర్గానికి దూరంగా ఉండటం వల్ల ఆయన రాజకీయ భవిష్యత్తుపై చర్చ ఎక్కువగా జరుగుతోంది. కొన్నాళ్లుగా ఆరోగ్య పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. గత ఏడాది కాలంలో ఆయన కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడటమే కాకుండా, కీలకమైన శస్త్రచికిత్స కూడా చేయించుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సుమారు ఆరు నెలల పాటు ఆయన పార్టీ కార్యక్రమాలకు, నియోజకవర్గ పనులకు కొంతదూరం ఉండాల్సి వచ్చిందని అంటున్నారు. ఈ కారణంగానే నియోజకవర్గ బాధ్యతలను, కార్యకలాపాలను తన అన్న కుమారులకు అప్పగించారనే చర్చ జోరుగా సాగింది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో రాజకీయ ఒత్తిళ్లను దృష్టిలో ఉంచుకొని పోటీ నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, తన రాజకీయ వారసత్వాన్ని తన అన్న కుమారుడికి కట్టబెట్టే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

స్థానిక సవాళ్లతో సతమతం?

కేవలం ఆరోగ్యం మాత్రమే కాకుండా, పార్టీ అంతర్గత వాతావరణం కూడా ఆరణి శ్రీనివాసుకు కొన్ని సవాళ్లను విసురుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన పార్టీ స్థానిక నాయకులతో పూర్తిస్థాయి సఖ్యత లేకపోవడం ఆయనకు ఇబ్బందికరంగా మారిందనే వాదన ఉంది. ఆయన వ్యవహారశైలిపై కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారని, ఆయన స్థానికంగా అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, మరోవైపు స్థానిక నేతలే తనకు అందుబాటులో ఉండటం లేదంటూ ఆరణి వర్గం నుంచి కూడా గట్టిగానే వాదనలు వినిపిస్తున్నాయి.

టీడీపీతో సమన్వయ లోపం

ఇదిలాఉంటే, కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ)తో స్థానిక సమన్వయం కూడా మరో చర్చకు దారితీసింది. ఇటీవలి కాలంలో టీడీపీ స్థానిక నాయకులు నిర్వహించిన సమావేశంలో, వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానం నుండి తాము పోటీ చేయాలని భావిస్తున్నట్లు బహిరంగంగానే ప్రకటించడం రాజకీయంగా కలకలం రేపింది. ఈ పరిణామాలు కూడా ఆరణి శ్రీనివాసులు పునరాలోచనలో పడటానికి కారణమయ్యాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో తన సొంత నియోజకవర్గం చిత్తూరుపై ఎమ్మెల్యే ఫోకస్ చేస్తున్నారని కూడా అంటున్నారు.