ఆ నియోజకవర్గం.. జనసేనదే.. రాసిపెట్టుకోవచ్చట.. !
కొన్నాళ్ల కిందట రోడ్లు వేయించారు. తర్వాత గిరిజనులకు చెప్పులు పంచారు. ఇటీవల మామిడికాయలు పంపించారు.
By: Tupaki Desk | 12 July 2025 7:03 PM ISTఅరకు పార్లమెంటు స్థానాన్ని గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీల హవా నడిచినప్పటికీ వైసీపీ దక్కించుకుంది. ఈ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా 6 ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఒకటి మాత్రమే ఎస్సీ వర్గానికి రిజర్వ్ అయింది. ఈ మొత్తం ఏడు నియోజకవర్గాల్లో కేవలం రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే వైసిపి గెలవగా ఓవరాల్ గా ఎంపి స్థానాన్ని మాత్రం వైసిపి తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అనేది గమనిస్తే ప్రస్తుతం అరకు పార్లమెంటు పరిధిలో ఉన్న పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా వంటి ఎస్టి సామాజిక వర్గం అధికంగా ఉన్న ఈ జిల్లాల్లో జనసేన పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
జనసేన నాయకులు తరచుగా అక్కడ పర్యటించడంతోపాటు ఆ పార్టీ అధినేత అక్కడ ఏం జరుగుతుందన్నది వారానికి ఒకసారి ఆరా తీస్తున్నారు. గిరిజనుల సౌకర్యాలు.. గిరిజనుల సమస్యలు.. గిరిజనులకు చేయాల్సిన పనులు వంటి అంశాలపై నిరంతరం పవన్ కళ్యాణ్ దృష్టి పెడుతున్నారు. దీనిని బట్టి అరకు పార్లమెంటుపై జనసేన ఒక విధమైన వ్యూహంతో అడుగులు వేస్తోంది అన్నది స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి వైసీపీకి ఎంతో బలమైన ఈ పార్లమెంటు స్థానంలో క్షేత్రస్థాయిలో జనసేన బలపడడం, అదే సమయంలో పనులు కూడా చేస్తుండడం కేవలం మాట మాత్రమే కాకుండా చేతల ద్వారా కూడా గిరిజనులను ఆకర్షించే ప్రయత్నం ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కొన్నాళ్ల కిందట రోడ్లు వేయించారు. తర్వాత గిరిజనులకు చెప్పులు పంచారు. ఇటీవల మామిడికాయలు పంపించారు. మనసును హత్తుకునే విధంగా గిరిజన జిల్లాల్లో జనసేన చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీనిని బట్టి వచ్చే ఎన్నికల్లో అరకు పార్లమెంటు స్థానాన్ని జనసేన దక్కించుకుని కూటమి తరపున పోటీ చేసినా ఆశ్చర్యం లేదనేది స్థానికంగా నాయకులు మధ్య జరుగుతున్న చర్చ. దీంతో వైసిపి ఖాతా నుంచి బలమైన అరకు పార్లమెంటు పోవచ్చు అనేది కూడా వారు చెబుతున్నారు.
ప్రస్తుతం అరకు ఎంపీగా వైసీపీ నాయకురాలు తనూజా రాణి ఉన్నప్పటికీ స్థానికంగా ఎమ్మెల్యేలు మాత్రం ఆమెకు ఏ మాత్రం సహకరించటం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల పార్లమెంటు స్థాయి సమావేశం నిర్వహిస్తే టిడిపి కానీ జనసేన కానీ ఒకరిని కూడా పంపించలేదు. కేవలం ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. దీంతో సదరు సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే ముగించారు. దీనిని బట్టి అరకు పార్లమెంటు స్థానంపై జనసేన గట్టి పట్టుదలతో అడుగులు వేస్తుంది అన్నది స్పష్టం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో దీనిని దక్కించుకుని ఏడుకు ఏడు చోట్ల జనసేన నాయకులు పోటీ చేసినా.. ఎంపీ స్థానం నుంచి పోటీ చేసినా ఆశ్చర్యం లేదన్న చర్చ సాగుతోంది.
