కొత్త నేత: సొంత అజెండాతో జనం మనసులో.. !
ఈ వ్యవహారం.. వైసీపీలో చర్చనీయాంశంగా మారినప్పటికీ.. సదరు ఎమ్మెల్యే మాత్రం పట్టించుకోవడం లేదు.
By: Garuda Media | 17 Aug 2025 5:00 AM ISTఆయన కొత్త ఎమ్మెల్యే పైగా వైసీపీ నుంచి గెలిచిన యవ నాయకుడు. నిజానికి వైసీపీలో ఉన్న వారంతా.. మౌనంగా ఉన్నారు. తమకు అధికారం దక్కలేదనో.. లేక, ప్రత్యర్థులకు బలమైన సమాధానం చెప్పలేక పోతున్నామనో.. చాలా మంది నాయకులు ఇంటికే పరిమితం అవుతున్నారు. కానీ, కొత్తగా ఎన్నికైన ఈ ఎమ్మెల్యే మాత్రం దూకుడుగా ఉన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా.. సొంత అజెండా వేసుకుని.. ప్రజలకు చేరువ అవుతున్నారు. అంతేకాదు.. ప్రభుత్వ పథకాలు అందని వారికి వాటిని అందేలా కూడా చేస్తున్నారు.
ఈ వ్యవహారం.. వైసీపీలో చర్చనీయాంశంగా మారినప్పటికీ.. సదరు ఎమ్మెల్యే మాత్రం పట్టించుకోవడం లేదు. పైగా.. తాను ప్రజల కోసం ఎన్నికయ్యానని.. పార్టీ పరంగా ఏ కార్యక్రమం నిర్వహించినా పాల్గొంటున్నానని.. ప్రజలకు కూడా మేలు చేయాల్సిన అవసరం , బాధ్యత తనపై ఉన్నాయని ఆయన చెబుతున్నారు. ఆయనే అరకు నియోజకవర్గం నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న ఎస్టీ నాయకుడు రేగం మత్య లింగం. వైసీపీలో ఉన్న నాయకులకు చాలా భిన్నంగా ఈయన ఆలోచన చేస్తున్నారు.
అంతేకాదు.. ప్రజలకు చేరువయ్యేందుకు ఎక్కడా వెనుకాడడం కూడా లేదు. ఎవరు తన వద్దకు వచ్చి.. పనులు కావాలని కోరినా ఆయన చేస్తున్నారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. నిజానికి గిరిజనులకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం రహదారులు, ఇతర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. వీటి విషయంలో విమర్శలు చేయాలని పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయి. కానీ, మత్యలింగం మాత్రం పన్నెత్తు మాట అనలేదు. పైగా.. ఎక్కడెక్కడ రహదారులు అవసరమో.. ఆయన స్వయంగా అధికారులను కలిసి వివరిస్తున్నారు.
అంటే.. నియోజవకర్గం మేలు తప్ప..తనకు రాజకీయాలతో ఇప్పుడు పనిలేదని, మరోసారి విజయం దక్కించుకోవాలంటే.. ప్రజలకు అంతో ఇంతో పనిచేయాలని రేగం బల్లగుద్ది చెబుతున్నారు. ''మీరు పార్టీ పరంగా ఏ కార్యక్రమం ఇచ్చినా.. సక్సెస్ చేస్తున్నా. అవసరమైనప్పుడు.. విమర్శలు చేయడం బాగానే ఉంటుంది. కానీ, అనవసరంగా నోరు చేసుకునేది లేదు'' అని తేల్చి చెబుతున్నారు. దీంతో గిరిజనులు మత్య లింగానికి ఫిదా అవుతున్నారు. అలాగని ఆయన పార్టీ మారే ఉద్దేశం కూడా లేదు. వైసీపీలోనే ఉన్నా.. ప్రజల కోసం పనిచేస్తున్నానని చెబుతున్న తీరు అందరినీ మంత్ర ముగ్ధులను చేస్తోంది.
