Begin typing your search above and press return to search.

ఏపీ ఓటర్ల ఆలోచన ఇలా ఉందా...!?

రాజకీయ నేతలు తమకు తామే సాటి అనుకుంటారు. కానీ అయిదేళ్లకు ఒకసారి ఈవీఎం మీట నొక్కే ఓటరుకి వారిని మించిన తెలివి.

By:  Tupaki Desk   |   25 March 2024 1:30 PM GMT
ఏపీ ఓటర్ల ఆలోచన ఇలా ఉందా...!?
X

రాజకీయ నేతలు తమకు తామే సాటి అనుకుంటారు. కానీ అయిదేళ్లకు ఒకసారి ఈవీఎం మీట నొక్కే ఓటరుకి వారిని మించిన తెలివి. 2019లో చంద్రబాబు పసుపు కుంకుమ పంచేశామని ఇక గెలుపుకు అడ్డేముందని అతి ధీమాతో ఉంటే 151 సీట్లతో వైసీపీని అర్ధరాత్రి దాకా బూత్ లలో ఉండి మరీ ఓటేసి గెలిపించేశారు ఓటర్లు. అందులో నారీ జనాలే ఎక్కువ.

ఇలా ఎందుకు అంటే జగన్ ఇచ్చే పధకాలు. నవ రత్నాలు ఇవన్నీ వారికి మహా బాగు అనిపించాయి. దాంతో అటు వైపునకు వెళ్లారు. అయిదేళ్ళు వైసీపీ నవ రత్నాల పధకాలు అమలు చేసింది. దాంతో ఈ అయిదేళ్ళూ సంక్షేమ పధకాల ఫలాలను ఏపీలోని కోట్లాది మంది లబ్దిదారులు అందుకున్నారు.

ఇపుడు మరోసారి ఎన్నికలు వస్తున్నాయి. జనాల ఆలోచనలు ఎలా ఉన్నాయి. ఓట్లేసే ఓటర్ల మూడ్ ఎలా ఉంది అన్నది అందరిలోనూ సరికొత్త ఆలోచనలు రేకెత్తిస్తోంది. ఏపీలో చూసుకుంటే ఒక లెక్క ప్రకారం మొత్తం ఓటర్లలో 40 శాతం మంది వైసీపీ పధకాల లబ్దిని పొందారు అని అంటున్నారు. అంటే నాలుగు కోట్ల మంది ఓటర్లలో వీరి సంఖ్య కోటీ అరవై లక్షల పై చిలుకు ఉంటుందని ఒక లెక్కగా ఉంది.

మరి ఇంత పెద్ద ఎత్తున లబ్దిని పొందిన వారు బహుశా దేశంలోనే ఎక్కడా ఉండరేమో. అలా అప్పులు చేసి మరీ ఏపీ ప్రభుత్వం అయిదేళ్ళ పాటు వారిని పోషించింది అనే చెప్పాలి. ఈ లెక్కన చూస్తే వైసీపీ ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్ల రూపాయలను నేరుగా నగదు బదిలీ పధకం ద్వారా మరో లక్ష కోట్లను వివిధ స్కీముల ద్వారా జనాలకు చేరవేసింది.

అంటే రెండు బడ్జెట్లు రాష్ట్ర ప్రభుత్వానివి దాదాపుగా పధకల కోసమే వెచ్చించారు అని అర్ధం అవుతోంది. మిగిలిన మూడు బడ్జెట్ లతోనే ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు ఖర్చు చేసింది అని అనుకోవాల్సి ఉంది. ప్రతీ పధకం కూడా ఎలాంటి శ్రమ లేకుండా నాలుగు అడుగులు కూడా కదల్చకుండా వాలంటీర్లే ఇంటికి వచ్చి మరీ ఇస్తున్నారు.

అలా అయిదేళ్ల కాలంలో జనాలకు పధకాల రుచి బాగానే ఉంది అని అంటున్నారు. ఈ పధకాలు ఇచ్చేంతవరకూ వాలంటీర్లు వచ్చేంతవరకూ రోడ్ల మీదకు వచ్చి ఎండలకు వానలకు కూడా కాసి మరీ స్కీముల కోసం చూసేవారు. దాని నుంచి బెటర్ గా వైసీపీ చేసి చూపించింది.

ఇపుడు ఎన్నికల్లో ఇది సరిపోతుందా ఇంకా కావాలా అసలు జనాలు ఏమి ఆలోచిస్తున్నారు అన్నది ఒక చర్చగా ఉంది. ఇంటికి పధకాలు తెచ్చి ఇస్తే చాలదేమో ఇంట్లోకి వచ్చి నోట్లో తినిపించి పోయే వాలంటీర్ల వ్యవస్థ కావాలేమో అని సెటైర్లు పడుతున్నాయి.

వాలంటీర్ల విషయానికి వస్తే వారు చేయాల్సింది చాలానే చేశారు. కానీ అయిదేళ్ళ కాలంలో అది బాగానే ఆస్వాదించిన లబ్దిదారులు ఇపుడు మరింత సౌకర్యం కోరుకుంటారు అని అంటున్నారు. అది చంద్రబాబు అయినా లేక జగన్ అయినా తమకు ఇంకా మేలు చేసేలా మరింత ఉచితాలు ఇస్తే వాటిని ఎంజాయ్ చేయడానికే ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నారు అని అంటున్నారు.

వ్యక్తిగత స్వార్ధం పెరిగిన తరువాత సమాజ హితం మీద శ్రద్ధ ఉండదు. అయిదేళ్లలో జగన్ పుణ్యమాని లక్షలలో నగదుని అందుకుని దాన్ని బ్యాంకులలో ఫిక్స్ డ్ డిపాజిట్లు కూడా చేసుకున్న వారు ఉన్నారు. ఇపుడు అంతకంటే ఎక్కువ కావాలని కోరుకునే వారే కచ్చితంగా అధికంగా ఉంటున్నారు.

అందువల్ల ఈసారి పధకాలలో మరింత జోరు రాజకీయ పార్టీలు చూపిస్తూంటే ఇంకా మాకు చాలా కావాలి అనే వారే కనిపిస్తున్నారు. మరి ఈ విధంగా లబ్దిదారుల ఆశలు ఆకాశానికి చేరుకుంటూ ఉంటే రేపటి ఎన్నికల్లో ఎవరు విజేత అవుతారు అంటే చెప్పడం కష్టమేమో. అలాగే సంక్షేమమే తమకు క్షేమం అనుకునే రాజకీయం కనుక స్థిరపడిపోతే అపుడు అప్పులు తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించదు అని కూడా అంటున్నారు

ఏది ఏమైనా ఓటర్లలో లబ్దిదారులు వేరయా అని అంటున్నారు. వారి మూడ్ వేరుగా ఉంటుంది. వారికి కావాల్సిన తీరున ఉచిత పధకాలు ఇచ్చే వారికే జై కొడతారు అన్నది అర్ధమవుతున్న విషయం. మరి వారిని ధీటుగా మెప్పించే వారు ఎవరో 2024 ఎన్నికల్లో తేలిపోతుంది.