ఇన్‌ఫ్లూయెన్సర్ స్కాండల్: మహిళలే టార్గెట్
వారు ఈ సంఘటనలో అపూర్వ తప్పు లేదని ఆమె తప్పు ఒప్పుకోకపోయినా జరిగిన దాడులు, బెదిరింపులు సరిగా లేవని అభిప్రాయపడుతున్నారు.
By: Tupaki Desk | 20 Jun 2025 6:00 PM ISTఇండియాస్ గాట్ టాలెంట్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ‘రెబెల్ కిడ్’గా ప్రసిద్ధి చెందిన అపూర్వ మఖిజా పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆమెతో పాటు ఇన్‌ఫ్లూయెన్సర్లు రణవీర్ అల్లహబాదియా, సమయ్ రైనా ప్రదర్శించిన అసభ్యతపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, సమాజ విలువలను దెబ్బతీస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ విమర్శల ప్రభావం అపూర్వపైనే ఎక్కువగా పడిందని, ముఖ్యంగా ఆమె మహిళ కావడంతో ఈ స్థాయిలో ఆగ్రహం వెళ్లగక్కినట్లు చాలామంది భావిస్తున్నారు.
- అపూర్వపై వ్యక్తిగత దాడులు, గృహనిర్బంధం
అపూర్వ ఇటీవల తనపై జరిగిన విమర్శల వల్ల తాను, తన కుటుంబం ఎలా బాధపడిందో వెల్లడించారు. ఆమెకు లైంగిక దాడి బెదిరింపులు వచ్చాయని, కుటుంబాన్ని దుర్భాషలాడారని చెప్పింది. అంతేకాకుండా, ఆమె నివసిస్తున్న ఇంటి యజమాని ఇంటిని ఖాళీ చేయమని ఆదేశించారట. పోలీసు విచారణ కోసం వారి అపార్ట్‌మెంట్ వద్దకు రావడంతో, "ఇంతకే సింగిల్ మహిళలకు ఇల్లు ఇవ్వదలుచుకోము" అని అన్నారని ఆమె తెలిపారు.
బిల్డింగ్ మేనేజ్‌మెంట్ కూడా ఆమె జీవనశైలిని కష్టతరం చేసింది. ఒకవైపు పోలీసుల వేధింపులు, మరోవైపు ఇంటి యజమాని ఆంక్షలు ఆమెను మానసికంగా కుంగదీసినట్లు తెలుస్తోంది.
- అభిమానుల మద్దతు, ప్రభుత్వానికి సూచనలు
ఈ నేపథ్యంలో పలువురు అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. వారు ఈ సంఘటనలో అపూర్వ తప్పు లేదని ఆమె తప్పు ఒప్పుకోకపోయినా జరిగిన దాడులు, బెదిరింపులు సరిగా లేవని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఇలాంటి వ్యవహారాలపై కాకుండా మరిన్ని ప్రధాన సమస్యలపై శక్తి, సమయం ఖర్చు చేయాలని సూచిస్తున్నారు.
- నేటి సమాజంలో మహిళల స్థితి
ఈ సంఘటన నేటి సమాజంలో మహిళల స్థితిని, ఒక మహిళా ఇన్‌ఫ్లూయెన్సర్ ఎదుర్కోవాల్సిన కఠిన పరిస్థితులను మరోసారి బయటపెట్టింది. సోషల్ మీడియాలో జరిగే విమర్శలు వ్యక్తిగత జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయన్న దానికి ఇది చక్కటి ఉదాహరణగా నిలిచింది. ప్రజాస్వామ్యంలో విమర్శలు సాధారణమే అయినప్పటికీ, అవి వ్యక్తిగత దాడులు, బెదిరింపులకు దారితీస్తే, అది సమాజానికి ప్రమాదకరమని ఈ సంఘటన స్పష్టం చేసింది.
