Begin typing your search above and press return to search.

డబ్బు కొట్టు... సర్వే రాయించుకో...!

ఏ సర్వే ఎలాంటిది ఎవరికి ఫేవర్ అన్నది కూడా కాస్తా రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి ఇట్టే అర్ధం అయిపోతోంది.

By:  Tupaki Desk   |   19 April 2024 4:30 PM GMT
డబ్బు కొట్టు... సర్వే రాయించుకో...!
X

అవునా ఇది నిజమా సర్వేలు అలాగే చేస్తారా రిజల్ట్స్ అలాగే ఇస్తారా వీటికి నమ్మదగిన అవకాశాలు అయితే లేవా అంటే జరుగుతున్న రాజకీయ చరిత్ర చూస్తే అదే నిజం అంటున్నారు. కాదేదీ కాసులకు అతీతం అన్నట్లుగా సర్వేలకు కూడా రంగు రుచి వాసన బాగా అంటుకుంటున్నాయని అంటున్నారు.

ఏ సర్వే ఎలాంటిది ఎవరికి ఫేవర్ అన్నది కూడా కాస్తా రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి ఇట్టే అర్ధం అయిపోతోంది. సర్వేను చూసి ఎవరైనా ఇదే నిజం అనుకుంటే అంతకంటే పొరపాటు లేదని అంటున్నారు. సర్వేలు నిజానికి సైటిఫిక్ మెధడాలజీతో చేస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. నూరు శాతం నిజాలు కాకపోయిన ఒక అవగాహనకు సమగ్రమైన అంచనాలకు సర్వేలు ఉపయోగపడతాయి. నిజానికి సర్వే వ్యవస్థ అన్నది చాలా ఉపయుక్తమైనది.

తప్పులు ఏదైనా జరిగితే సరిదిద్దుకునేందుకు వాడుకోవచ్చు. ప్రజల మూడ్ ఇలా ఉంది అంటే వాటిని సెట్ రైట్ చేసుకుంటూ వెళ్ళేందుకు ఆస్కారం సర్వేలు కల్పిస్తూ ఉంటాయి. కానీ సర్వేలనే తప్పు దోవ పట్టిస్తూ తమకు అనుకూలంగా చేయించుకుంటూ తమను తాము మభ్యపెట్టుకుంటూ జనాలకు మభ్యపెడుతూ వదులుతున్న ఈ సర్వేల వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అని అంటున్నారు.

గత రెండు ఎన్నికల నుంచి సర్వేశ్వరులు దిగిపోయారు రాజకీయ వ్యాపారానికి మించి సరిసాటి ఏదీ లేదని భావించి సర్వేశ్వరులు ఎక్కడ ఎన్నిక జరిగినా వచ్చి వాలిపోతున్నారు. వారు చేస్తున్న విధానం ఏమిటి తీసుకుంటున్న శాంపిల్స్ ఏమిటి అన్నది కూడా తెలియడం లేదు. కేవలం కాకి లెక్కలు చెబుతూ చిలక జోస్యం చెబుతూ ఏ రాజకీయ పార్టీ గూటి కాడ ఆ పాట పాడుతూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఫలితంగా సర్వేలను నమ్ముతున్న రాజకీయ పార్టీలు బొక్క బోర్లా పడుతున్నాయి. కొన్ని పార్టీలు అయితే విపరీతంగా నమ్మేసి అధికారం నుంచి కూడా దిగిపోయి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపధ్యం కూడా ఉంది.

ఇదిలా ఉంటే ఏపీలో చూస్తే సర్వేల కధా కమామీషూ చాలా తమాషాగా ఉంది అని చెప్పాల్సి ఉంది. సర్వేలు అంటే వెంటనే వచ్చే మాట ఫేక్ అని. జనాల మూడ్ ఏమిటో తెలియదు కానీ భారీ నంబర్లు వేసి ఫలానా పార్టీ గెలుస్తుంది అని వన్ సైడెడ్ గా చెప్పేస్తున్న సర్వే రాయుళ్ళను అంతా చూస్తున్నారు. జాతీయ సంస్థలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. వారికి ఉన్న ప్రయోజనాలు ఏమిటో ఎవరిని నెత్తిన పెట్టుకుని వస్తున్నారో జనాల చేత ఎవరిని మోయించాలని చూస్తున్నారో దాని వెనక వారికి ఉన్న ఇంట్రెస్ట్ ఏమిటి అన్నది అందరికీ తెలిసిందే.

అలాంటి ఫేక్ సర్వేలను చూసిన జనాలు మాత్రం అసలు నమ్మడం మానేస్తున్నారు. కేవలం పలుకుబడి డబ్బులకు లొంగి పోయిన ప్రతిష్టాత్మకమైన జాతీయ సంస్థలు కూడా సర్వేలు ఇస్తున్నాయంటే దిగజారుడు పోకడలకు ఇది నిదర్శనం అని అంటున్నారు. నిజంగా చూస్తూంటే ఈ సంస్థలు తమ ఇమేజ్ ని సైతం పక్కన పెట్టి ఈ విధంగా రాజకీయ ఉచ్చులో చిక్కుకోవడం ద్వారా చేస్తున్నది ఏమిటి అన్నది కూడా అంతా ఆలోచిస్తున్న నేపధ్యం ఉంది.

ఇక ఎవరితో బిజినెస్ రిలేషన్ ఉంటే వారికి అనుకూలంగా సర్వేలు చేసి ఇవ్వడం కూడా అలవాటుగా మారింది అని అంటున్నారు. దాని ఫల్ల క్రెడిబిలిటీ ఆయా సంస్థలకే పోతోంది. మరి వాటికి కూడా సిద్ధపడి సర్వేలు చేస్తున్నారు అంటే దాని వెనక వత్తిళ్ళు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా అర్ధం చేసుకోవాలని అంటున్నారు.

ఈ రకంగా దిగజారుడు తీరుతో ఇస్తున్న సర్వేలు వస్తున్న పోకడలు చూసిన విద్యావంతులు కానీ టీవీలు చూస్తున్న వారు కానీ సోషల్ మీడియాలో చురుకుగా ఉండేవారు కానీ అసలు నమ్మడం లేదు సరికదా సర్వేలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. గ్రౌండ్ రియాల్టీస్ అన్నవి అక్కడ ఉన్న ఓటర్లకు తెలుస్తాయి. అలాగే అభ్యర్ధులకు ఎంతో కొంత నాడి అర్ధం అవుతుంది. ఇక రాజకీయ పార్టీల అధినేతలు జనాల్లోకి వెళ్తున్నపుడు జనంలో వచ్చే స్పందన వల్ల కొంత అర్ధం చేసుకోగలుగుతారు.

కానీ వాటిని పక్కన పెట్టి ఎక్కడో కూర్చుని అంకెల గారడీతో ఇచ్చే సర్వేలను నమ్ముకుంటే మాత్రం నిండా మునగడం ఖాయమని అంటున్నారు. కర్నాటక, మధ్యప్రదేశ్ రాజస్థాన్ చత్తీస్ ఘర్ రాష్ట్రాలలో చేసిన సర్వేలలో దాదాపుగా మెజారిటీ శాతం ఫెయిల్ అయ్యాయి. నాలుగు నెలల క్రితం తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన అనేక సర్వేలు తప్పుడివి అని నిరూపించబడ్డాయి.

ఇపుడు ఏపీలో వస్తున్న సర్వేల తీరుని కూడా జనాలు తమ తీర్పు ద్వారా ఎక్కడో పెడతారు అనే అంటున్నారు. వెనకటికి ఒక జ్యోతీష్కుడు పుడితే ఆడపిల్ల లేకపోతే మగపిల్లాడు అని చెప్పాడట. అలా ఏపీలో రెండే పార్టీలు ఉన్నాయి. అందువల్ల ఎవరు వచ్చినా మా క్రెడిట్ మా సర్వే క్రెడిట్ అని చెప్పుకునే వారు కూడా తయారవుతున్నారు. సో సర్వేలకు కాలం చెల్లింది అనే అంటున్నారు మెజారిటీ జనాలు.