Begin typing your search above and press return to search.

లోకల్ ఉప పోరు: సగానికి పైనే ఏకగ్రీవం.. ఎవరికి సొంతమంటే?

ఏపీ వ్యాప్తంగా స్థానిక సంస్థలకు సంబంధించి పెద్ద ఎత్తున ఉప ఎన్నికలు జరుగుతున్నాయి

By:  Tupaki Desk   |   16 Aug 2023 5:57 AM GMT
లోకల్ ఉప పోరు: సగానికి పైనే ఏకగ్రీవం.. ఎవరికి సొంతమంటే?
X

ఏపీ వ్యాప్తంగా స్థానిక సంస్థలకు సంబంధించి పెద్ద ఎత్తున ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 484 మండలాల్లో 1033 గ్రామ పంచాయితీల్లో సర్పంచ్.. వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో సగానికి పైగా స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 66 సర్పంచ్ స్థానాలతో పాటు 1064 వార్డు సభ్యులకు జరుగుతున్న ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావటం తెలిసిందే. ఈ నెల 19న పోలింగ్ జరగనుంది.

ఆగస్టు పదో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ సాగుతుండగా.. సోమవారం సాయంత్రం మూడింటికి నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసింది. సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగే 66 గ్రామాల్లో 32 చోట్ల ఎన్నికలు ఏకగ్రీవమైనట్లుగా ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. రెండు చోట్ల అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవటం గమానార్హం. దీంతో.. 32 చోట్ల మాత్రమే సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

మరోవైపు వార్డు సభ్యలకు సంబంధించిన ఉప ఎన్నికలకు 70 శాతానికి పైగా ఏకగ్రీవం కావటం గమనార్హం. మొత్తం 1064 వార్డుసభ్యులకు ఉప ఎన్నికలు జరుగుతుండగా.. 757 స్థానాలకు ఏకగ్రీవం అయ్యాయి. కేవలం 261 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరగనుంది. వార్డు సభ్యలకు సంబంధించి కూడా 46 వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కరు కూడా నామినేషన్లు వేయలేదు.

దీంతో.. ఆయా స్థానాల్లో ఎన్నికలు నిర్వహించటం లేదు. 2021 జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయితీల్లో ఎన్నికలు జరగ్గా.. సర్పంచ్ స్థానాల్లో కేవలం 17 శాతం.. వార్డు సభ్యుల స్థానాల్లో 36 స్థానం ఏకగ్రీవం అయ్యాయి. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో అంతకు మూడున్నర రెట్లు ఏకగ్రీవం కావటం విశేషం. అధికార పార్టీకి చెందిన వారే ఏకగ్రీవాల్లో తమ సత్తా చాటుతున్నారు.