హైకోర్టు కళ్లకే గంతలు కట్టి?... పీ.ఎస్.ఆర్. మేటర్ సీరియస్!
ఈ వ్యవహారంలో పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు, మధుసూదన్ ల పాత్ర గురించి రిమాండ్ రిపోర్టులో పోలీసులు వివరించారు.
By: Tupaki Desk | 8 May 2025 6:40 AMఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 2020లో 169 గ్రూప్-1 పోస్టుల భర్తీకి మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు 6,807 మంది హాజరయ్యారు. అయితే.. నోటిఫికేషన్ లో పేర్కొన్నట్లు కాకుండా సమాధాన పత్రాల్ని డిజిటల్ మూల్యాంకనం చేయించారు.. 2021 ఏప్రిల్ 28న ఫలితాలు ప్రకటించారు. దీనిపై అభ్యర్థులు అభ్యంతరం తెలిపారు.
నోటిఫికేషన్ పేర్కొన్న దానికి విరుద్ధంగా సమాధాన పత్రాల్ని డిజిటల్ మూల్యాంకనం చేయించడంపై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. మాన్యువల్ గా మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. అయితే... అలా చేయకుండానే చేసినట్లుగా హైకోర్టుకే కళ్లకు గంతలు కట్టి మోసం చేసే పనికి ఆంజనేయులు పూనుకున్నారనేది తాజా సమస్య!
డిజిటల్ మూల్యాంకనం వద్దు, మాన్యువల్ మూల్యాంకనమే చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు.. న్యాయస్థానాన్ని మభ్యపెడుతూ మాన్యువల్ మూల్యాంకనం చేయకుండానే చేసినట్లు తతంగాన్ని నడిపించారని పోలీసులు తాజాగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంలో నాటి ఏపీపీఎస్సీ అధికారులు అభ్యంతరం తెలిపినా.. ఈ మొత్తం వ్యవహారానికి తానే బాధ్యత తీసుకుంటానని సైతం చెప్పారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూల్యాంకన బాధ్యతల్ని ఓ ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వాలని నిర్ణయించిన ఆంజనేయులు.. క్యాం సైన్ మీడియా అనే ప్రైవేటు సంస్థను తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో.. పోలీసుల దర్యాప్తులో ఈ కుట్ర మొత్తం బయటపడిందని తెలుస్తోంది. దీంతో.. ఈ కేసులో రెండో నిందితుడైన క్యాం సైన్ డైరెక్టర్ మధుసుధన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. ఆయనకు ఈ నెల 21 వరకూ రిమాండ్ విధించారు. ఈ వ్యవహారంలో పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు, మధుసూదన్ ల పాత్ర గురించి రిమాండ్ రిపోర్టులో పోలీసులు వివరించారు.
ఇలా... గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు హైకోర్టునే మోసం చేసి, వేలమంది గ్రూప్-1 అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడారనే అభియోగాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి!