Begin typing your search above and press return to search.

ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసులో తొలి అరెస్టు.. సీనియర్ ఐపీఎస్ పీఎస్సార్ కు మరిన్ని చిక్కులు!

డైరెక్టర్ మధుసూదన్ ను సుదీర్ఘం ప్రశ్నించారు. అనంతరం మంగళవారం ఉదయం మధుసూదన్ ను అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 May 2025 6:38 AM
APPSC Arrest Case
X

సినీ నటి జెత్వానీ కేసులో అరెస్టు అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుకు మరిన్ని చిక్కులు ఎదురుకానున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఛీప్ గా పనిచేసిన పీఎస్సార్ కూటమి ప్రభుత్వానికి టార్గెట్ గా మారారని ప్రచారం జరుగుతోంది. దీంతో సినీనటి కాదంబరి జెత్వానీని అక్రమంగా నిర్బంధించారనే కేసులో పీఎస్సార్ ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో దేశంలోనే జైలుకు వెళ్లిన తొలి డీజీ స్థాయి అధికారిగా తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నారు. ఇక ఆయనపై మరో కేసు కూడా తెరపైకి తెచ్చిన ప్రభుత్వం.. అందులో ఏ2 నిందితుడిని మంగళవారం హైదరాబాదులో అరెస్టు చేసింది.

ఏపీపీఎస్సీ గ్రూప్ -1 పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలకు పాల్పడ్డారని సీనియర్ ఐపీఎస్ పీఎస్సార్ ఆంజనేయులుపై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఏ1 నిందితుడిగా ఆయనపై అభియోగాలు మోపిన ప్రభుత్వం.. కేసు దర్యాప్తులో భాగంగా ఏ2 నిందితుడిగా హైదరాబాదుకు చెందిన కామ్ సైన్ మీడియా డైరెక్టర్ పమిడికాల్వ మధుసూదన్ ను గుర్తించింది. గ్రూప్-1 పరీక్ష పేపర్ల డిజిటల్ మూల్యాంకనాన్ని కామ్ సైన్ సంస్థే చేపట్టింది. దీంతో ఐపీఎస్ అధికారి పీఎస్సార్ తో కలిసి అవకతవకలకు పాల్పడినట్లు కామ్ సైన్ డైరెక్టరు మధుసూదన్ పై కేసు నమోదు చేసింది.

సోమవారం విజయవాడ నుంచి హైదరాబాదు వచ్చిన పోలీసులు కామ్ సైన్ సంస్థ కార్యాలయంలో సోదారుల చేశారు. డైరెక్టర్ మధుసూదన్ ను సుదీర్ఘం ప్రశ్నించారు. అనంతరం మంగళవారం ఉదయం మధుసూదన్ ను అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు. గ్రూప్-1 కేసులో మధుసూదన్ తొలి అరెస్టుగా చెబుతున్నారు. దీంతో సీనియర్ ఐపీఎస్ పీఎస్సార్ ను కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

కరోనా సమయంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనాన్ని మాన్యువల్ పద్ధతితోపాటు డిజిటల్ పద్దతిలోనూ చేపట్టారు. ఒకే పరీక్షకు రెండు సార్లు మూల్యాంకనం చేయడంపై అభ్యర్థులు అప్పట్లోనే కోర్టులో కేసు వేశారు. తమకు కావాల్సిన వారి కోసమే ఇలా రెండుసార్లు మూల్యాంకనం చేశారని నిరుద్యోగ అభ్యర్థులు అప్పట్లో కేసు వేశారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయంపై ఫోకస్ పెట్టి కేసు నమోదు చేసింది.

డిజిటల్ మూల్యాంకనం చేసినందుకు గాను కామ్ సైన్ సంస్థకు రూ.1.14 కోట్లు చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. సంస్థ డైరెక్టరు మధుసూదన్ ను ఏ2 నిందితుడిగా అభియోగాలు మోపారు. సోమవారం హైదరాబాదులోని పంచవటి కాలనీలో మధుసూదన్ కార్యాలయానికి వచ్చిన పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అప్పట్లో ఏపీపీఎస్సీలో ఏం జరిగింది? ఏపీపీఎస్సీ కార్యాలయంలో కాకుండా ప్రైవేటు రిసార్ట్స్ లో మూల్యాంకనం ఎందుకు చేశారు? అనే ప్రశ్నలు వేసినట్లు చెబుతున్నారు. డిజిటల్ మూల్యాంకనానికి వినియోగించిన ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర డాక్యుమెంట్లను స్వాధానం చేసుకున్నారని అంటున్నారు. విచారణ అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు.