యాపిల్ 'సిరి'లో కీలక అప్ డేట్... 'నిజం' వివరాలివే!
అవును... బ్లూమ్ బెర్గ్ లోని ఒక నివేదిక ప్రకారం 'సిరి' అప్ గ్రేడ్ కు ముందు ఆపిల్ రహస్యంగా చాట్ జీపీటీ శైలి ఐఫోన్ యాప్ ను పరీక్షిస్తోంది.
By: Raja Ch | 28 Sept 2025 10:44 AM ISTయాపిల్ తన పర్సనల్ అసిస్టెంట్ ‘సిరి’ విషయంలో సీక్రెట్ గా ఓ పని మొదలుపెట్టిందని తెలుస్తోంది. ఈ మేరకు బ్లూమ్ బెర్గ్ కి సంబంధించిన ఓ నివేధిక తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... యాపిల్ సిరి లో భారీ అప్ గ్రేడ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దీనికోసం చాట్ జీపీటీ తరహా యాప్ ను రూపొందించింది.
అవును... బ్లూమ్ బెర్గ్ లోని ఒక నివేదిక ప్రకారం 'సిరి' అప్ గ్రేడ్ కు ముందు ఆపిల్ రహస్యంగా చాట్ జీపీటీ శైలి ఐఫోన్ యాప్ ను పరీక్షిస్తోంది. 'వెరిటాస్' అనే కోడ్ నేమ్ తో రూపొందించిన ఈ యాప్.. యాపిల్ ఇంజినీర్లు మాత్రమే ఉపయోగించేలా డిజైన్ చేశారని అంటున్నారు. దీన్ని టెస్ట్ చేసి, లోపాలను సరిచేసి 2026లో విడుదలకు సిద్ధం చేయనున్నారు.
ప్రస్తుతం యాపిల్ ఏఐ టీమ్ ఈ యాప్ ద్వారా రియల్ వరల్డ్ చాట్స్ ను అనుకరిస్తూ.. సిరి సమాధానాల నాణ్యతతో పాటు పలు అంశాలను మెరుగుపరుస్తోంది. ఈ యాప్ కూడా ఇతర చాట్ బాట్స్ లానే పని చేస్తుంది. ‘లిన్ వుడ్’ పేరుతో అభివృద్ధి చేసిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆధారంగా ఈ యాప్ రూపుదిద్దుకుంది.
వాస్తవానికి గూగుల్, శాంసంగ్ లతో పోలిస్తే ఏఐ రంగంలో యాపిల్ వెనుకబడి ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలుత ఐఓఎస్ 18తో నెక్ట్స్ జెన్ సిరిని విడుదల చేయాలని యాపిల్ ప్రణాళిక రచించింది. అయితే.. అది ఆలస్యం కావడంతో 2026 మార్చిలో మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తన వినియోగదారులకు ఏఐ సేవలు అందించేందుకు యాపిల్ ఇప్పటికే పలు ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా.. ఓపెన్ ఏఐ, క్లాడ్, గూగుల్ జెమిని టీమ్ లతో చర్చలు జరిపింది. భవిష్యత్తులో ఏఐ ఆధారిత వెబ్ సెర్చ్ సేవల్లో కూడా కొత్త ఫీచర్లను తీసుకురావాలని యోచిస్తోంది. కాగా... 'వెరిటాస్' అంటే లాటిన్ లో 'నిజం' అని అర్థం!
