అవహేళన చేసినా ఐఫోన్ డ్యూయోకి శాంసంగ్ పెద్ద సాయం!
ఈ భారీ ఒప్పందం ద్వారా శాంసంగ్ కేవలం డిస్‌ప్లేలను అందించడమే కాకుండా.. యాపిల్ ఫోల్డబుల్ మార్కెట్లోకి ప్రవేశించడంలో కీలక భాగస్వామిగా మారుతోంది.
By: Sivaji Kontham | 12 Sept 2026 12:59 PM ISTవ్యాపార ప్రపంచంలో శాశ్వత శత్రువులు గానీ.. శాశ్వత మిత్రులు గానీ ఉండరనే నానుడి మరోసారి నిజమైంది. ఒకప్పుడు యాపిల్ కంపెనీని.. దాని ఉత్పత్తులను బహిరంగంగా అవహేళన చేసిన దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్.. ఇప్పుడు అదే యాపిల్ తలపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫోల్డబుల్ ఫోన్ `ఐఫోన్ డ్యూయో`కు సాయం చేయడం చర్చగా మారింది. తమ ప్రత్యర్థి అయినా యాపిల్‌కు అతి ముఖ్యమైన డిస్‌ప్లే ప్యానెళ్లను సరఫరా చేసేందుకు శాంసంగ్ డిస్‌ప్లే సంస్థ ముందుకు రావడం టెక్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశమైంది. గ్లోబల్ మార్కెట్‌లో వ్యాపారం అంటే కేవలం అమ్ముకోవడమేనని.. అక్కడ పోటీదారులైనా ఒకరికొకరు సహకరించుకోక తప్పదని ఈ పరిణామం నిరూపిస్తోంది.
చైనీస్ లీకర్ ఇన్‌స్టంట్ డిజిటల్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. శాంసంగ్ డిస్‌ప్లే సంస్థ యాపిల్‌తో మూడేళ్ల ప్రత్యేక సరఫరా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద ఐఫోన్ డ్యూయో .. భవిష్యత్తులో రానున్న మోడళ్ల కోసం ఫోల్డబుల్ డిస్‌ప్లే ప్యానెళ్లను శాంసంగ్ అందించనుంది. ఈ ఫోల్డబుల్ స్క్రీన్ ఒక్కోదాని ధర సుమారు 250 డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 21,000) ఉంటుందని అంచనా. సాధారణ ఐఫోన్ డిస్‌ప్లేల ధరతో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఈ అత్యంత ఖరీదైన .. కీలకమైన డిస్‌ప్లే కాంపోనెంట్‌ను సృష్టించడంలో శాంసంగ్ తన సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి యాపిల్‌కు బలమైన మద్దతుగా నిలుస్తోంది.
ఐఫోన్ డ్యూయోలో వాడనున్న శాంసంగ్ అత్యాధునిక M16 OLED మెటీరియల్ సెట్ ఈ డిస్‌ప్లేకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. గత జనరేషన్లతో పోలిస్తే ఇది మరింత మెరుగైన బ్రైట్‌నెస్, కలర్ పెర్ఫార్మెన్స్, సుదీర్ఘ కాలం మన్నిక .. పవర్ ఎఫిషియెన్సీని అందిస్తుంది. అయితే యాపిల్ సాధారణంగా తన డిస్‌ప్లేల కోసం నమ్ముకునే ఇతర సరఫరాదారులైన ఎల్‌జీ డిస్‌ప్లే వద్ద ఫోల్డబుల్ స్క్రీన్ తయారీ సామర్థ్యం ఇంకా పూర్తిస్థాయిలో లేదు. మరొక సంస్థ అయిన బీవోఇ నాణ్యతా ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో.. యాపిల్‌కు శాంసంగ్ ఒక్కటే ఏకైక నమ్మదగిన ప్రత్యామ్నాయంగా మిగిలింది.
ఈ భారీ ఒప్పందం ద్వారా శాంసంగ్ కేవలం డిస్‌ప్లేలను అందించడమే కాకుండా.. యాపిల్ ఫోల్డబుల్ మార్కెట్లోకి ప్రవేశించడంలో కీలక భాగస్వామిగా మారుతోంది. సుమారు 1999 డాలర్ల (భారతదేశంలో సుమారు రూ. 2,99,900) భారీ ధరతో మార్కెట్లోకి రానున్న ఈ ఐఫోన్ డ్యూయో కోసం... శాంసంగ్ సరఫరా చేస్తున్న ఇన్నర్ స్క్రీన్ డివైజ్‌లో ఎనిమిదో వంతు ఖర్చును కలిగి ఉంది. 2026 చివరి నాటికి సుమారు ఐదు మిలియన్ల ఫోల్డబుల్ ఫోన్లను షిప్పింగ్ చేయాలని భావిస్తున్న యాపిల్ ప్రణాళికలకు ఈ భాగస్వామ్యం అత్యంత కీలకం కానుంది. ఈ త్రైమాసికంలో శాంసంగ్‌కు ఇది స్థిరమైన- భారీ ఆదాయ వనరుగా మారే అవకాశం ఉంది.
ఎప్పుడూ ఒకరికొకరు పోటీ పడే టెక్ దిగ్గజాలు ఇలాంటి వ్యాపార ఒప్పందాల ద్వారా కలిసి పనిచేయడం మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌కు తెరలేపింది. ప్రత్యర్థి కంపెనీ అని చూడకుండా టెక్నాలజీ అవసరాలరీత్యా శాంసంగ్ అందించిన ఈ చేయూత యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ విజయానికి ప్రధాన సోపానంగా నిలవనుంది. వ్యాపారంలో శత్రుత్వం వేరైనా, లాభాలు - నాణ్యత విషయంలో రాజీపడకుండా ఈ రెండు దిగ్గజాలు ఒకరిపై ఒకరు ఆధారపడటం గ్లోబల్ మార్కెట్ నైజాన్ని స్పష్టంగా చాటుతోంది. అయితే తాము సాయం చేస్తున్నట్టు ఇంకా శాంసంగ్ అధికారికంగా ప్రకటించకపోవడంతో ఈ డీల్ విషయంలో సందేహాలు నెలకొన్నాయి. దీనిపై ఇరువర్గాలు ఏదైనా ప్రకటన చేస్తాయేమో చూడాలి.
