ట్రంప్ ను ఖాతరు చేయని ఆపిల్.. తెలుగు నేతలతో అమెరికా అధ్యక్షుడి పోటీ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆపిల్ సంస్థకు ఇచ్చిన సలహాలను, హెచ్చరికలను ఆ సంస్థ పట్టించుకోలేదని స్పష్టమైంది.
By: Tupaki Desk | 16 May 2025 11:04 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆపిల్ సంస్థకు ఇచ్చిన సలహాలను, హెచ్చరికలను ఆ సంస్థ పట్టించుకోలేదని స్పష్టమైంది. భారత్‌లో పెట్టుబడులు పెట్టవద్దని, బదులుగా అమెరికాలోనే ఉత్పత్తిని పెంచాలని ట్రంప్ ఇటీవల సౌదీ పర్యటనలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌కు బహిరంగంగానే సూచించారు. భారత్‌ను ఉద్దేశించి "వారు వారిని వారు చూసుకోగలరు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. "మీరు (ఆపిల్) భారత్‌లో ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడం మాకు ఇష్టం లేదు. మీరు మీ ఉత్పత్తిని ఇక్కడే (అమెరికాలో) పెంచండి" అని ఆయన టిమ్ కుక్‌తో అన్నారని తెలిపారు.
అయితే, సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం.. ఆపిల్ నాయకత్వం భారత్‌లో తమ నిర్ణయానికి కట్టుబడి ఉంది. భారత్‌లోని తయారీ యూనిట్లలో ఎలాంటి మార్పు ఉండదని, "వ్యాపారం యథాతథంగా కొనసాగుతుంది" అని ఆపిల్ ధృవీకరించినట్లు నివేదిక పేర్కొంది. ట్రంప్ సూచనలను లెక్కచేయకుండా ఆపిల్ భారత్‌లో తమ పెట్టుబడులు, తయారీ కేంద్రాలను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించడం ట్రంప్ సలహాకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చైనా ఆపిల్‌కు ఆచరణీయమైన ప్రత్యామ్నాయంగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆపిల్ భారత్‌లో తమ అవకాశాలను చురుగ్గా పరిశీలిస్తోంది. వాటిని పటిష్టం చేసుకోవాలని చూస్తోంది. పెద్ద ఎత్తున తయారీ వ్యాపారం కోసం భారత్ ఆపిల్‌కు అతి తక్కువ టారిఫ్‌లను అందిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. తయారీ రంగానికి భారత్‌లో అనుకూల వాతావరణం ఉందని, ఇక్కడ ఉత్పత్తి చేయడం ద్వారా ఆపిల్ వంటి సంస్థలు పోటీతత్వాన్ని అందిపుచ్చుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ప్రస్తుతం ప్రపంచ ఐఫోన్ ఉత్పత్తిలో దాదాపు 15% భారత్ నుంచే జరుగుతోందని అంచనా. ఐఫోన్లతో పాటు ఎయిర్‌పాడ్స్ వంటివి తెలంగాణలో తయారవుతున్నాయి. ఇది భారత ప్రభుత్వ "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమానికి మరింత ఊతమిస్తోంది. అమెరికాలో విక్రయించే అనేక ఐఫోన్లు ఇప్పటికే "మేడ్ ఇన్ ఇండియా" ట్యాగ్‌తో వస్తుండటం ఈ ప్రయోజనాలను ఆపిల్ గుర్తించిందనడానికి నిదర్శనం. ఈ పరిస్థితుల్లో ట్రంప్ ప్రకటన పెద్దగా ప్రభావం చూపకపోవడం సహజం.
ఆపిల్ విషయంలో ట్రంప్ వైఖరి ఒక ఎత్తు కాగా, పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఆయన శైలి మరో ఎత్తు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పెట్టుబడులను ఆకర్షించే విషయంలో తెలుగు రాష్ట్రాల నేతలతో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఏపీ లేదా తెలంగాణ నేతలు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు లేదా కంపెనీ ప్రతినిధులను కలిసినప్పుడు వేల కోట్ల పెట్టుబడుల ప్రకటనలు చేయడం మనకు అలవాటే. దీని ద్వారా తమ పాలన గొప్పదని చెప్పుకుంటారు. నిజం ఎంత ఉందో ఎవరికీ తెలియదు.
ఇప్పుడు ట్రంప్ కూడా ఇదే తరహాలో "మా అమెరికాకు ఇన్ని పెట్టుబడులు ఆకర్షించాను" అని ఎక్కడికి వెళ్లినా చెప్పుకుంటున్నారు. వారం వారం, నెలావారీగా ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయి. ఖతార్‌లో పారిశ్రామికవేత్తల సమావేశంతో ఇది మరింత ముదిరింది. లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నానని ఆయన అంటున్నారు. అయితే, నిజంగా వారంతా అమెరికాలో ఎంత పెట్టుబడి పెడతారో స్పష్టంగా తెలియదు. ప్రపంచంలోనే అగ్రదేశాధ్యక్షుడు స్వయంగా వెళ్లి పెట్టుబడులు పెట్టమని అడగడం కొందరికి ఇబ్బందికరంగా, అవమానకరంగా అనిపించవచ్చు. కానీ ట్రంప్ దీన్ని సులువుగా చేస్తున్నారు.
అమెరికాలో పెట్టుబడులు పెట్టాలని ఆయన కొన్నిసార్లు బెదిరిపులకు కూడా దిగుతున్నారు. ఐఫోన్ల ఉత్పత్తిని భారత్‌లో పెంచి అక్కడ అమ్ముకోవడం వెనుక రెట్టింపు ఖర్చులున్న అమెరికాలో ఉత్పత్తి చేయడం సాధ్యం కాదనే వాస్తవం ఉంది. తక్కువ ఖర్చుతో కూడిన కార్మికులు, ముడిపదార్థాలు దొరికే దేశాల్లోనే తయారీ జరుగుతుంది. అమెరికాలో మామూలు పనులు చేసే వారిని తరిమేస్తున్న ట్రంప్, ఫ్యాక్టరీలకు లేబర్లను ఎక్కడి నుంచి తెస్తారనే ప్రశ్న తలెత్తుతుంది. చైనా "మేక్ ఇన్ అమెరికా" పేరుతో ట్రంప్, మస్క్ లాంటి వాళ్లు ఫ్యాక్టరీల్లో పని చేస్తున్నట్లుగా వీడియోలు తయారు చేసి ట్రోల్ చేసింది.
అమెరికాలోని పరిస్థితులను అర్థం చేసుకుని, తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంపై దృష్టి పెట్టకుండా, బయట తయారు చేస్తున్న వారిపై విరుచుకుపడటం ట్రంప్ స్టైల్. అమెరికాను ఆయన నాలుగేళ్లలో ఎక్కడికి తీసుకెళ్తారో కానీ, ఇలాంటి శైలితో చులకన అవుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద ఆపిల్ వంటి సంస్థలు తమ వ్యాపార నిర్ణయాలను ఆర్థిక వాస్తవాల ఆధారంగా తీసుకుంటుండగా, ట్రంప్ పెట్టుబడుల ఆకర్షణ శైలి మాత్రం దేశీయ రాజకీయ నాయకుల ప్రకటనలను తలపిస్తోంది.
