Begin typing your search above and press return to search.

మొబైల్‌ ఫోన్ల వాడకంపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలకు విద్యార్థులు మొబైల్‌ ఫోన్లు తేవటంపై పూర్తి నిషేధం విధిస్తూ మోమో జారీ చేసింది.

By:  Tupaki Desk   |   28 Aug 2023 1:41 PM GMT
మొబైల్‌ ఫోన్ల వాడకంపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
X

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్‌ ఫోన్ల వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలకు విద్యార్థులు మొబైల్‌ ఫోన్లు తేవటంపై పూర్తి నిషేధం విధిస్తూ మోమో జారీ చేసింది.

కేవలం విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులు సైతం తరగతి గదుల్లోకి ఫోన్లు తీసుకురాకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. టీచర్లు తరగతి గదులకు వెళ్లేముందు తమ మొబైల్‌ ఫోన్లను ప్రధానోపాధ్యాయుడికి అప్పగించాలని మెమో ఉత్తర్వుల్లో పేర్కొంది.

యునెస్కో విడుదల చేసిన గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌ రిపోర్ట్‌ ఆధారంగా.. బోధనకు ఎటువంటి ఆటంకం రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించి తరగతి గదుల్లోకి ఫోన్లు తీసుకొచ్చే ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పై అధికారులు ఈ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశాల్లో పేర్కొంది.

బోధన సమయంలో ఎటువంటి ఆటంకం రాకుండా, ఉపాధ్యాయుల తోపాటు విద్యార్థులు తమ పూర్తి ఏకాగ్రత పాఠ్యాంశాల మీదనే ఉంఛాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ విద్యా శాఖ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఐక్యరాజ్యసమితికి చెందిన యునెస్కో ఇటీవల విడుదల చేసిన గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌ రిపోర్ట్‌ ఆధారంగా విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఇది దోహదపడుతుందని తెలిపింది.

కాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో పది రకాల వసతుల కల్పనకు శ్రీకారం చుట్టింది. అలాగే జగనన్న విద్యా కానుక కింద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, మూడు జతల దుస్తులు, షూ, సాక్స్, స్కూల్‌ బ్యాగ్‌ అందిస్తోంది. అలాగే జగనన్న గోరుముద్ద పథకం కింద మధ్యాహ్న భోజనం కూడా పెడుతోంది.

అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ లను అందిస్తోంది. వీటిలో బైజూస్‌ కంటెంట్‌ ను లోడ్‌ చేసి ఇస్తోంది. ఈ సంస్కరణల్లో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు మొబైల్‌ ఫోన్లు తేకుండా నిషేధం విధించింది.