Begin typing your search above and press return to search.

పెన్షన్ కష్టాలు : సర్కార్ కీలక నిర్ణయం...!

ఏపీలో సామాజిక పెన్షన్ కోసం వృద్ధులు పడిగాపులు పడుతున్నారు. క్యాలెండర్ లో డేట్ మారుతోంది కానీ నగదు మాత్రం జమ కావడం లేదు.

By:  Tupaki Desk   |   4 April 2024 3:48 AM GMT
పెన్షన్ కష్టాలు :  సర్కార్ కీలక నిర్ణయం...!
X

ఏపీలో సామాజిక పెన్షన్ కోసం వృద్ధులు పడిగాపులు పడుతున్నారు. క్యాలెండర్ లో డేట్ మారుతోంది కానీ నగదు మాత్రం జమ కావడం లేదు. ఏప్రిల్ నెలలో అక్షరాలా ఏప్రిల్ ఫూల్స్ అయిపోయారు. మొదటి రోజు పెన్షన్ ఇంటికి చేరలేదు.

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో వాలంటీర్లు పెన్షన్ ఇవ్వడం ఆగిపోయింది. మూడవ తేదీ నుంచి సచివాలయం వద్ద ఇస్తామని చెప్పారు. కానీ అది ఇంకా స్ట్రీం లైన్ కాలేదు. ఈలోగా మూడవ తేదీన ఉదయం నుంచి వృద్ధులు క్యూ కట్టి ఎండ దెబ్బకు సొమ్మసిల్లి పోయారు. కొందరు అయితే ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. దాంతో ఏపీ అంతటా పెన్షనర్ల కష్టాల మీదనే చర్చ సాగింది. అదే రాజకీయ రచ్చగా మారుతోంది. ఆ సంగతి అలా ఉంచితే పెన్షనర్లు అందరికీ ఇళ్ళ వద్దకు వచ్చి పంపిణీ చేయడం కుదరదు అని ప్రభుత్వం చెబుతోంది.

వయో వృద్ధులు ఆరోగ్యం బాగాలేని వారు వికలాంగులు ఉంటే వారి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తారు అని పేర్కొంది. అదే సమయంలో పెన్షన్ పంపిణీ చేసే వేళలను కూడా మార్చింది. ఎండలు తీవ్రంగా ఉండడంతో ఉదయం ఏడు గంటలకే సచివాలయం తెరచి పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వీటికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం కోరింది. ఉదయాన్నే పెన్షన్ పంపిణీ ప్రారంభిస్తే ఎండ ముదరకుండా అందరికీ ఇచ్చేందుకు వీలు అవుతుందని. అలా మూడు నాలుగు రోజులు పంపిణీ చేస్తే సచివాలయ పరిధిలో అందరికీ పెన్షన్ అందుతుందని పేర్కొంది. మొత్తానికి ప్రభుత్వం ఈ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంది మరి దీనిని ఆచరణలో సక్రమంగా అమలు చేస్తేనే ప్రయోజనం ఉంటుంది అంటున్నారు.