Begin typing your search above and press return to search.

ఏపీ డబ్బులు ఖర్చు పెట్టడం లేదంటున్న కేంద్రమంత్రి!

2021 తర్వాత కేంద్రం ఈ పథకానికి కేటాయించిన నిధుల్లో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ పైసా ఖర్చు పెట్టుకోలేదని తెలిపారు.

By:  Tupaki Desk   |   25 July 2023 4:08 AM GMT
ఏపీ డబ్బులు ఖర్చు పెట్టడం లేదంటున్న కేంద్రమంత్రి!
X

కేంద్ర ప్రభుత్వ పథకం జల్‌ జీవన్ మిషన్ అమలులో ఆంధ్రప్రదేశ్ పనితీరు ఆశించిన స్థాయిలో లేదని కేంద్ర జల్‌ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పేర్కొన్నారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు.

అవును... గ్రామీణంలో ఇంటింటికీ కుళాయి నీరు అందించేందుకు ఉద్దేశించిన జల్‌ జీవన్‌ మిషన్‌ అమలులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పనితీరు ఆశించిన స్థాయిలో లేదని కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. 2021 తర్వాత కేంద్రం ఈ పథకానికి కేటాయించిన నిధుల్లో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ పైసా ఖర్చు పెట్టుకోలేదని తెలిపారు.

ఇదే సమయంలో 2021-22 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వాటానూ సమకూర్చలేదని వివరించారు. ఇదే సమయంలో వారితో నిరంతరం సంప్రదిస్తూ ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచిస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో ఏ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందనే విషయాలపైనా కేంద్రమంత్రి వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా... ఇప్పటివరకు దేశంలో తెలంగాణ, దాద్రానగర్‌ హవేలీ, దామన్‌ దయ్యూ, అండమాన్‌ నికోబార్‌ దీవులు, గోవా, గుజరాత్‌, హరియాణ రాష్ట్రాలు తమ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం ఇళ్లకు టాప్ వాటర్ ను అందుబాటులోకి తెచ్చాయని పేర్కొన్నారు.

ఇదే సమయంలో పుదుచ్చేరి, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలు 99%కిపైగా ఇళ్లకు నీరందిస్తున్నాయని అన్నారు. ఇదే క్రమంలో బిహార్‌ రాష్ట్రం 96.38% ఇళ్లకు కుళాయి నీరు ఇస్తోందని వెల్లడించారు. ఇదే సమయంలో 70శాతం ఇళ్లకు నీరందిస్తోన్న రాష్ట్రాల వివరాలు కూడా మంత్రి తెలిపారు.

ఇందులో భాగంగా... మిజోరం (89.71%), సిక్కిం (86.16%), అరుణాచల్‌ ప్రదేశ్‌ (84.50%), ఉత్తరాఖండ్‌ (78.41%), లద్ధాఖ్‌ (78.01%), మహారాష్ట్ర (77.44%), మణిపుర్‌ (76.63%), నాగాలాండ్‌ (73.07%), ఏపీ (70.05%) ఉందని స్పష్టం చేశారు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్!

కాగా... ఈ పథకానికి సంబంధించి కేంద్రం ఇచ్చిన వాటాతోపాటు మ్యాచింగ్ గ్రాంట్ గా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తం పెట్టాల్సిన సంగతి తెలిసిందే!