Begin typing your search above and press return to search.

పవన్‌ ఆశలపై షర్మిల నీళ్లు!

ఏపీలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని.. ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోనని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ మొదటి నుంచీ చెబుతూ వస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 Feb 2024 8:42 AM GMT
పవన్‌ ఆశలపై షర్మిల నీళ్లు!
X

ఆంధ్రప్రదేశ్‌ లో మరో కొత్త పొత్తు పొడిచింది. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు దాదాపు ఖరారైంది. ఇప్పుడు ఇదే కోవలో కాంగ్రెస్‌ పార్టీ సీపీఎం, సీపీఐల మధ్య పొత్తు పొడిచింది. వచ్చే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం నేతలు వెంకటేశ్వరరావు, గపూర్‌ తదితరులు సమావేశమై పొత్తులపై నిర్ణయించారు.

కాగా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల కూటమితో టీడీపీ, జనసేన కూటమికి ఇబ్బందులు ఎదురుకావచ్చని అంటున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని.. ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోనని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ మొదటి నుంచీ చెబుతూ వస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీకి స్నేహహస్తం చాచారు. అంతేకాకుండా బీజేపీ అగ్ర నాయకత్వంతో చీవాట్లు తిని మరీ వారిని పొత్తుకు ఒప్పించానని తెలిపారు.

అయితే ఇప్పుడు షర్మిల నేతృత్వంలోని ఏపీ కాంగ్రెస్‌.. సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకోవడంతో కొంత ఓటు బ్యాంకును ఈ కూటమి చీల్చుకుంటే టీడీపీ, జనసేన కూటమికి నష్టం తప్పదనే అంచనాలు ఉన్నాయి. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి అంత బలం లేకపోయినా కమ్యూనిస్టు పార్టీలకు ఉద్యోగ, కార్మిక సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాల మద్దతు ఉంది. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు నేపథ్యంలో ఉద్యోగ, కార్మిక, కూలీ సంఘాలు ఈ కూటమి వైపు మొగ్గితే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది. అప్పుడు అంతిమంగా వైసీపీకే మేలు చేకూరుతుందని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని చెబుతున్న టీడీపీ, జనసేన కూటమికి నష్టం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

వాస్తవానికి సీపీఐ, సీపీఎం పార్టీలు... టీడీపీ, జనసేన కూటమితో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించాయి. అయితే టీడీపీ, జనసేన.. తమతో బీజేపీని కలుపుకోవడానికి నిర్ణయించుకోవడంతో కమ్యూనిస్టు పార్టీలు.. కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపాయి.

మరోవైపు సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ నేతృత్వంలోని జై భారత్‌ నేషనల్‌ పార్టీ కూడా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలతో చేరే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. ఇప్పటివరకు లక్ష్మీనారాయణ ఈ దిశగా ప్రకటన చేయలేదు. అలాగే రామచంద్ర యాదవ్‌ నేతృత్వంలోని భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ కూడా కాంగ్రెస్‌ కూటమితో చేరితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవచ్చని చెబుతున్నారు. అలాగే బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) కూడా కాంగ్రెస్‌ తో చేరితే కాంగ్రెస్‌ కూటమి బలం కొంత పెరగొచ్చని అంటున్నారు.

అంతిమంగా కాంగ్రెస్‌ కూటమి ఎంత బలపడితే అంతగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవచ్చని అంటున్నారు. దీనివల్ల టీడీపీ, జనసేన కూటమికి నష్టం కలుగుతుందని, వైసీపీకి లాభం కలగొచ్చని భావిస్తున్నారు.

ఫిబ్రవరి 26న కాంగ్రెస్‌ పార్టీ అనంతపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని తలపెట్టింది. ఇందులో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పాల్గొనున్నారు. ఈ సభకు కమ్యూనిస్టు పార్టీల నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సభ తర్వాత మూడు పార్టీలు కూటమిని బలోపేతం చేసే చర్యలపై దృష్టి సారిస్తారని తెలుస్తోంది.