Begin typing your search above and press return to search.

జగన్ చిరు సత్కారం...ముహూర్తం రెడీ...!?

కేంద్రంలోని బీజేపీ ఇటీవల పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో ఇద్దరు ఉద్ధండులు అయిన తెలుగు వారికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి.

By:  Tupaki Desk   |   4 Feb 2024 11:30 PM GMT
జగన్ చిరు సత్కారం...ముహూర్తం రెడీ...!?
X

కేంద్రంలోని బీజేపీ ఇటీవల పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో ఇద్దరు ఉద్ధండులు అయిన తెలుగు వారికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి. రాజకీయ భీష్ముడిగా పేరు గడించిన మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుకు, టాలీవుడ్ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవికి ఈ అత్యున్నత పౌర పురస్కారాలు దక్కాయి.

అయితే వెంటనే తెలంగాణా ప్రభుత్వం రెస్పాండ్ అయి ఈ ఇద్దరు దిగ్గజాలతో పాటు పద్మ పురస్కారాలు అందుకున్న వారిని అందరినీ ప్రభుత్వం తరఫున ఘనంగా సత్కరించింది. ఇపుడు అందరి చూపూ ఏపీ మీద ఉంది. జగన్ ఈ విషయంలో ఏమీ చేస్తారు అన్న చర్చ సాగుతోంది. రేవంత్ రెడ్డి సన్మానం చేసిన తరువాత ఏపీ ప్రభుత్వం మీద కూడా వత్తిడి ఉంటుందని అంటున్నారు. ఒక విధంగా బాకీ ఉందని అంటున్నారు.

ఎందుకంటే చిరంజీవి, వెంకయ్యనాయుడు ఇద్దరూ ఏపీకి చెందిన వారు. చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు అయితే వెంకయ్యనాయుడు నెల్లూరు జిల్లాకు చెందిన వారు. ఈ ఇద్దరినీ ఏపీ ప్రభుత్వం పక్షాన కూడా సత్కరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇక పద్మ పురస్కారాలు వీరికి ప్రకటించిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తరఫున వారికి అభినందనలు తెలిపారు.

ఇక ఇపుడు వారికి సత్కారం చేయాల్సిన దాని మీద ఏపీ ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిరంజీవిల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో మెగాస్టార్ జగన్ నివాసానికి రెండు సార్లు వెళ్లారు. టాలీవుడ్ పరిశ్రమ సమస్యల మీద ఆయన చర్చించారు కూడా. ఇపుడు మరోసారి ఈ ఇద్దరి భేటీ ఉండే అవకాశాలను కొట్టిపారేయడం లేదు.

అయితే ఏపీ ప్రభుత్వం పౌర సత్కారం చేస్తుందా లేక జగన్ చిరంజీవి ఇంటికి తానే స్వయంగా వెళ్ళి చిరంజీవిని సత్కరించి వస్తారా అన్నది కూడ చూడాల్సి ఉంది. పౌర సత్కారం చేసి చిరంజీవితో పాటు వెంకయ్యనాయుడుని కూడా సత్కరిస్తే బాగుంటుంది అన్నది ఒక చర్చగా ముందుకు వస్తోంది.

అయితే ఏపీలో చూస్తే వైసీపీ ప్రభుత్వం పనితీరు మీద ఆంగ్ల విద్యా విధానం మీద వెంకయ్యనాయుడు గతంలో ఇండైరెక్ట్ గా పలు కామెంట్స్ చేశారని చెబుతారు. తెలుగు మీడియం ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు. దానికి ఇండైరెక్ట్ గా వైసీపీ ప్రభుత్వం కూడా కౌంటర్ ఇచ్చింది. మరో వైపు చూస్తే తరచూ ఏపీలో వైసీపీలోని రాజకీయ నేతల మీద వెంకయ్యనాయుడు పరోక్ష విమర్శలు చేస్తున్నారు అని అంటారు.

బూతులు మాట్లాడుతున్నారు, అలాంటి వారిని బూత్ లో బటన్ నొక్కి ఇంటికి పంపాలని తాజాగా రేవంత్ రెడ్డి చేసిన సత్కార సభలో వెంకయ్య నాయుడు మరోసారి అన్నారు. అయితే ఇవన్నీ చూస్తారా లేక తెలుగు దిగ్గజాలు అని భావించి సత్కరిస్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా ఈ ఇద్దరి విషయంలో మాత్రం ఏదో ఒకటి చేయాలని ప్రభుత్వం ఉందని అంటున్నారు.

ఏకంగా ముఖ్యమంత్రి చిరు నివాసానికి వెళ్ళి ఆయనను సన్మానించే అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు అని అంటున్నారు. అలాగే వెంకయ్యనాయుడుని కూడా కలసి సత్కరించే ఆలోచన ఉండొచ్చు అంటున్నారు.

ఎందుకంటే ఏపీలో ఎన్నికల సీజన్ కూడా నడుస్తోంది. ఈ నెల 10 తరువాత ఏ క్షణం అయినా నోటిఫికేషన్ వెలువడే చాన్స్ ఉంది.

అందుకే పద్మ అవార్డులు అందుకున్న ప్రముఖుల వద్దకు ప్రభుత్వ పెద్దలు స్వయంగా వెళ్ళి సత్కరించడం మీద ఆలోచిస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో తెలియదు కానీ జగన్ చిరంజీవి మరోసారి భేటీ కాబోతున్నారు అన్న ప్రచారం మాత్రం సాగుతోంది.