ఏపీలో కుల గణన....జగన్ సంచలన నిర్ణయం
దేశంలో ఇపుడు కుల గణన డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. దీనికి మొదట నాంది పలికింది బీహార్ స్టేట్.
By: Tupaki Desk | 15 Oct 2023 7:21 PM ISTదేశంలో ఇపుడు కుల గణన డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. దీనికి మొదట నాంది పలికింది బీహార్ స్టేట్. నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ ప్రభుత్వం కుల గణనను తొలిసారి చేపట్టి దేశంలో సామాజిక రాజకీయ సంచలనం రేకెత్తించింది. ఆ తరువాత ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీ నుంచి విపక్షాలు అన్నీ కేంద్రం మీద డిమాండ్ పెట్టాయి.
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని ఇండియా కూటమి కోరింది. అయితే ఇది ఎన్నికల స్టంట్ గానే ఎన్డీయే పెద్దలు భావిస్తూ పక్కన పెట్టేస్తున్నారు. మరో వైపు కొన్ని రాష్ట్రాలు తాముగా స్వచ్చందంగా తమ రాష్ట్రాలలో కుల గణన కార్యక్రమం చేపట్టాయి. అందులో పంజాబ్ ఒడిషా రాష్ట్రాలు ఉన్నాయి.
ఇక ఏపీలో జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం కూడా కుల గణన చేపట్టాలని డిసైడ్ అయిందని తెలుస్తోంది. ఏపీలో మరో ఆరు నెలల వ్యవధిలో ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో కుల గణన చేపట్టడం ద్వారా రాజకీయంగా లబ్దిని పొందేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లుగా విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి.
ఈ ఏడాది నవంబర్ 15 నుంచి ఏపీలో ఉమ్మడి పదమూడు జిల్లాలలో ఈ కుల గణన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అని తెలుస్తోంది. ఆరు నెలల పాటు ఈ కార్యక్రమం ఏపీ అంతటా ముమ్మరంగా సాగుతుంది అని అంటున్నారు. ఏపీలో కుల గణన బాధ్యతను గ్రామ వార్డు సచివాలయం పర్మనెంట్ ఉద్యోగులకు అప్పగించారు. ఇప్పటిదాకా ఏ రకమైన డేటా కోసమైనా వాలంటీర్లను ఉపయోగించుకునేవారు.
కానీ వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారు. దాంతో అనవసరం అయిన వివాదాలు వస్తాయన్న కారణంతో ఈసారికి వారిని పక్కన పెడుతున్నారు. తాము శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన సచివాలయ వ్యవస్థనే ఉపయోగించుకుని పెద్ద ఎత్తున కుల గణన కార్యక్రమం ఏపీలో చేపట్టనున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా కుల గణన చేయడానికి గతంలోనే ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఇపుడు దానికి అనుగుణంగా కుల గణనను వేగవంతం చేయనుంది అని అంటున్నారు. కుల గణనను సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్ళి చేపట్టాల్సి ఉంటుంది. ఆ డేటాను వారు వారి మీద ఉన్నతాధికారులు కూడా రెండవసారి చెక్ చేస్తారు. కుల గణన డేటా సక్రమంగా రావడం కోసం రెవిన్యూ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను సూపర్ వైజర్లుగా నియమిస్తారు.
ఇక కుల గణన సక్రమంగా సాగడం కోసం విపక్షాల నుంచి విమర్శలు రాకుండా ఉండడం కోసం ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్ ని దీని కోసం తీసుకునివస్తోందని తెలుస్తోంది. ప్రతీ కుటుంబం నుంచి సేకరించిన డేటాను ఆ యాప్ లో ప్రత్యేకంగా భద్రపరుస్తారు. ఈ యాప్ ని రూపొందించే పనిలో ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తు చేస్తోంది అని అంటున్నారు.
కుల గణనను చేపట్టడం ద్వారా బీసీ ఇతర బడుగు కులాలను తమ వైపు తిప్పుకోవాలన్న రాజకీయ ఎత్తుగడలో వైసీపీ ఉందని అంటున్నారు. అయితే ఎన్నికల ముందు చేపడుతున్న ఈ కుల గణన సకాలంలో పూర్తి అవుతుందా అన్నది పెద్ద డౌట్ గా ఉంది. ఎందుకంటే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే మార్చి మూడవ వారంలో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఆరు నెలల వ్యవధిలో కుల గణన పూర్తి కావడం అంటే అప్పటికి నాలుగైదు నెలలు మాత్రం సమయం ఉంటుంది. మరి ఒక్కసారి కనుక ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది.
అయితే ప్రభుత్వం మాత్రం కచ్చితంగా అనుకున్న టైం లోనే కుల గణన పూర్తి చేఅస్తుందని వైసీపీ వర్గాలు అంటున్నారు. ఏపీలో రాజకీయం పూర్తిగా కులాల వారీగా విడిపోయిన నేపధ్యం ఉంది. దీంతో ఈసారి గుత్తమొత్తంగా బీసీల ఓట్లను తమ ఖాతాలో వేసుకోవడానికే ఈ కులగణన అని విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనా వైసీపీ మాస్టర్ స్ట్రోక్ కుల గణన అని అంటున్నారు.
