జగన్ అసెంబ్లీని ఉపయోగించుకుంటారా ?
ఈనెల 21వ తేదీనుండి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలను టీడీపీకి వ్యతిరేకంగా ఉపయోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసినట్లు సమాచారం.
By: Tupaki Desk | 16 Sept 2023 9:00 PM ISTఈనెల 21వ తేదీనుండి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలను టీడీపీకి వ్యతిరేకంగా ఉపయోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసినట్లు సమాచారం. సమావేశాలు 21వ తేదీన మొదలైతే ఎన్నిరోజులు జరగాలని బీఏసీ సమావేశంలో డిసైడ్ అవుతుంది. వర్షాకాల సమావేశాలు కాబట్టి సుమారు ఐదురోజులు జరుగుతుందని అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే తమ ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలని జగన్ డిసైడ్ అయ్యారట.
ఇదే సమయంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలను పూర్తిగా వివరించేందుకు సమావేశాలను జగన్ ఉపయోగించుకోబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టయి రిమాండులో ఉన్న చంద్రబాబు పాత్రపై పూర్తి వివరాలను అందించేందుకు జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ రెడీ చేస్తున్నారట. స్కిల్ స్కామ్ తో పాటు ఇతరత్రా మరికొన్ని కేసులను కూడా ప్రస్తావించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో అమరావతి రాజధాని భూ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం, పోలవరంలో అవినీతి లాంటి అనేక అంశాలపై అసెంబ్లీలోనే జగన్, ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్లు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో అందులోను సీఐడీ అరెస్టుచేసిన తర్వాత జరగుతున్న అసెంబ్లీ సమావేశాలని గుర్తుంచుకోవాలి. అందుకనే ఈ సమావేశాల్లో మరోసారి అస్త్రాలను సంధించేందుకు జగన్ రెడీ అవుతున్నారు. నిజానికి అసెంబ్లీ వేదికగా అవినీతి ఆరోపణలు చేసుకున్నంత మాత్రాన ఏమీకావు.
ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు కేసు కోర్టు మెట్లెక్కేసింది. కాకపోతే ఇంకా ట్రయల్ మొదలుకాలేదు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనేందుకు తన దగ్గరున్న ఆధారాలను సీఐడీ ఏసీబీ కోర్టుకు అందించింది. అయితే చంద్రబాబు ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టులో కూడా బెయిల్ దరఖాస్తు చేసున్నారు. రెండు చోట్లా కేసుపై విచారణలు మొదలైతే అప్పుడు అవినీతి జరిగిందా ? లేదా అన్నది కోర్టు తేలుస్తుంది. అప్పుడు ఎవరిది అవినీతి ఎవరిది దౌర్జన్యం అన్నది జనాలకు తెలుస్తుంది. అప్పటివరకు కాస్త గందరగోళం తప్పదు.
