Begin typing your search above and press return to search.

జగన్ చేతిలో కోరి మరీ బంగారు పళ్లెంలో అధికారం...?

రాజకీయాల్లో జనాల తీర్పు చిత్రంగా ఉంటుంది. ఒక నాయకుడి మీద అదే పనిగా విమర్శలు చేస్తే అది మరో వైపు ప్లస్ అవుతుంది కూడా.

By:  Tupaki Desk   |   13 Aug 2023 4:25 AM GMT
జగన్ చేతిలో కోరి మరీ బంగారు పళ్లెంలో అధికారం...?
X

రాజకీయాల్లో జనాల తీర్పు చిత్రంగా ఉంటుంది. ఒక నాయకుడి మీద అదే పనిగా విమర్శలు చేస్తే అది మరో వైపు ప్లస్ అవుతుంది కూడా. అందుకే గణిత శాస్త్రం రాజకీయాలకు వర్తించదు. అలాగే వ్యతిరేకత భారీగా ఉంటే అది కూడా ఒక్కోసారి అతి ప్రచారం వల్ల ప్లస్ అవుతూంటుంది. దానికి కారణం సానుభూతి అని అనుకోవాలి.

ఏపీలో చిత్రమైన పరిస్థితి ఉంది. విపక్షాలు ఒక్కసారి జోరు పెంచేసాయి. ఒకే రోజు ఒకేసారి మూడు ప్రాంతాల నుంచి ముగ్గురు నాయకులు జగన్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు ఒక చోట, లోకేష్ మరో చోట పవన్ కళ్యాణ్ ఇంకో చోట ఇలా ముగ్గురూ నాన్ స్టాప్ గా జగన్ మీదనే విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ఇది గత కొన్ని నెలలుగా సాగుతోంది. ఇపుడు పీక్స్ కి చేరింది. ఇలా వీరు చేసే ఉపన్యాసాలలో జగన్ పేరే మారు మోగుతోంది. పదుల సంఖ్యలో ఆయన పేరు చెబుతూ ఈ నాయకులు మాట్లాడుతున్నారు. ఏది మాట్లాడినా జగన్ అంటున్నారు. ఆఖరుకు పదేళ్ళ క్రితం ఉమ్మడి ఏపీ విడిపోతే దానికి కారణం జగన్ అంటున్నారు. సమస్త పాపాలకు జగనే కారకుడు ఆయనే పాపాల భైరవుడు అంటూ చేస్తున్న విమర్శలలో జోరు పెరిగి లాజిక్ మిస్ అవుతోంది అని అంటున్నారు.

అదే పనిగా జగన్ని విమర్శించే క్రమంలో వ్యూహం వికటిస్తోంది అని అంటున్నారు. అలాగే విపక్షాలు ట్రాక్ తప్పుతున్నారా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే పదే పదే జగన్ మీద పడి విమర్శలు చేసే క్రమంలో తాము ఏమి చేస్తాం, అధికారంలోకి వస్తే ఏమి ఇస్తామన్నది చెప్పడం పూర్తిగా మరచిపోతున్నారు. కొన్ని సార్లు అతి తక్కువగా చెబుతున్నారు.

ఇక దీని వల్ల జనాల మెదళ్ళకు జగన్ అన్న పేరే ఎక్కువగా వెళ్తోంది. అదే టైం లో జగన్ మీద చేస్తున్న అదే పనిగా విమర్శలు బూమరాంగ్ అవుతున్నాయి. అసూయ అక్కసుతో ఈ విమర్శలు చేస్తున్నారు అని వైసీపీ నుంచి వస్తున్న కౌంటర్లు కూడా జనాలను ఆలోచింపచేసేలా ఉన్నాయి. ఇక జగన్ కూడా తాజాగా అమలాపురం సభలో మాట్లాడుతూ ఒక్కడినైన తన కోసం ప్రతీ రోజూ మూడు ప్రాంతాలలో ముగ్గురు నాయకులు అదే పనిగా తిడుతూ వస్తున్నారని, తాను మాత్రం జనాలనే నమ్ముకున్నానని చెబుతూ సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు.

నిజానికి ఒకరిని పట్టుకుని మూకుమ్మడి దాడి చేస్తే ఆటోమేటిక్ గా అదే జరుగుతుంది. ఇపుడు ఏపీలో విపక్షం తీరు కూడా అలాగే ఉంది. ఏ మాట మాట్లాడినా దానికి ముందూ వెనకా జగన్ని తగిలిస్తేనే కానీ నిద్రపోని ప్రతిపక్షం ఈ అతి ఉత్సాహంలో తమ అజెండాను మరచిపోతున్నారు. దీన్ని చూసిన మీదటనే సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక మాట అన్నారు.

తన దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇలా ఒకే ఒక నాయకుడిని పట్టుకుని అదే పనిగా విమర్శలు చేసే విపక్ష నాయకులను చూడలేదని అన్నారు. తాము జనాలకు ఏమి చేసేది చెప్పుకోకుండా జగన్ని నిందించే వారికి ఏమీ రాజకీయంగా మేలు జరగదని ఇది తాను వైసీపీ పార్టీ లీడర్ గా కాకుండా అనుభవంతో చెబుతున్నాను అని అన్నారు.

బొత్స అన్నారని కాదు కానీ జగన్ మీద పూర్తి వ్యతిరేకత జనాల మెదళ్ళలో ఎక్కించాలన్న అతి తాపత్రయంతో విపక్షాలు తమ యాక్షన్ ప్లాన్ ని పక్కన పెట్టేస్తున్నాయని అంటున్నారు. ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని విమర్శించవచ్చు. వారికి ఆ హక్కు ఉంటుంది. కానీ అది నిర్మాణాత్మకంగా ఉండాలి. అయిన దానికీ కానిదానికీ కూడా జగనే కారకుడు అంటూ చేస్తున్న విమర్శలు జనాల బుర్రల్లోకి ఎక్కవు సరికదా సీరియస్ ఆరోపణలు కూడా ఆ గాలిలో పడి కొట్టుకుపోతాయని అంటున్నారు.

ఇలా గత కొద్ది నెలలుగా విపక్షాలు చేస్తున్న విమర్శలు జగన్ని టార్గెట్ చేయడం వల్ల వారి ప్రసంగాల పట్ల సీరియస్ నెస్ తగ్గిపోయిందని జనాలు కూడా లైట్ తీసుకుంటున్నారు అని అంటున్నారు. రొడ్డ కొట్టుడు రొటీన్ విమర్శలు చేయకుండా తమ గురించి తమ విధానాల గురించి విపక్షాలు ఈ అతి తక్కువ విలువైన సమయంలో చెప్పుకోకపోతే కోరి మరీ బంగారు పళ్లెంలో అధికారాన్ని మరో మారు జగన్ చేతిలో విపక్షాలు పెడతాయన్న విశ్లేషణలే నిజం అవుతాయని అంటున్నారు.