అమరావతి రెండో విడత భూసమీకరణ.. ప్రభుత్వానికి షర్మిల కీలక ప్రశ్నలు
రాజధాని అమరావతి విస్తరణ నిమిత్తం రెండో విడత భూమిని సమీకరించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్రంగా తప్పుబట్టారు.
By: Tupaki Political Desk | 29 Nov 2025 7:55 PM ISTరాజధాని అమరావతి విస్తరణ నిమిత్తం రెండో విడత భూమిని సమీకరించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పటికే తీసుకున్న 34 వేల ఎకరాల్లో ఎటువంటి అభివృద్ధి చేయకుండా, కొత్తగా మరో 20 వేల ఎకరాలను ఎందుకు తీసుకుంటున్నారని ఆమె నిలదీశారు. ప్రైవేటు వ్యక్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఉందని షర్మిల విమర్శలు గుప్పించారు.
ప్రపంచస్థాయి క్రీడా పోటీలకు వేదికలైన ఒలింపిక్స్ స్టేడియంలకు కూడా లేని విధంగా అమరావతిలో స్పోర్ట్స్ విలేజ్ కోసం భూములు తీసుకోవడాన్ని ఆమె ప్రస్తావించారు. అదేవిధంగా కొత్త విమానాశ్రయానికి 5 వేల ఎకరాల భూములు కావాలన్న ప్రభుత్వ వాదనను షర్మిల ఆక్షేపించారు. ప్రభుత్వం రెండో విడత భూములు సేకరించే ముందు పదేళ్ల క్రితం రైతుల నుంచి తీసుకున్న భూమితోపాటు అందుబాటులో ఉన్న సర్కారు భూమితో కలిపి రాజధాని నిర్మాణానికి 54 వేల ఎకరాల భూమి ఉందని షర్మిల తెలిపారు.
ఈ 54 వేల ఎకరాల్లో ఏం చేశారో ప్రభుత్వం వివరించాలని ఏపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మి తొలి దశలో 29 వేల మంది రైతుల నుంచి 34 వేల ఎకరాలను రైతులు అప్పగించారని షర్మిల గుర్తు చేశారు. 11 సంవత్సరాలు గడిచినా, రాజధాని ప్రాంతంలో దాదాపుగా అభివృద్ధి కనిపించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి నగరంగా మారాల్సిన రాజధాని ప్రాంతం ఇప్పుడు కలుపు మొక్కలతో, నిర్జన స్థలాలతో కనిపిస్తోందని ఎత్తిచూపారు. ప్రధాన భవనాలు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు వంటివేవీ ఇప్పటికీ రాలేదని షర్మిల ఆరోపించారు.
ప్రభుత్వం వద్ద ఇప్పుడు 700 ఎకరాలు మాత్రమే మిగిలి ఉందని చెప్పడం ఏంటని షర్మిల ప్రశ్నించారు. మొదటి దశలో తీసుకున్న భూములను ఎలా ఉపయోగించారు? ఎవరికి కేటాయించారు అనే దానిపై పూర్తి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వివరాలు CRDA వెబ్‌సైట్‌లో ఎందుకు అందుబాటులో లేవని షర్మిల ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో రెండో దశ భూ సమీకరణను షర్మిల తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది అనవసరమని, రైతులకు అన్యాయం చేయడమేనని వ్యాఖ్యానించారు.
కొత్త విమానాశ్రయానికి 5000 ఎకరాలు అవసరమని ప్రభుత్వం చేస్తున్న వాదన తప్పుదారి పట్టించేదిగా షర్మిల అభిప్రాయపడ్డారు. ముంబై, భోగాపురం, గన్నవరం వంటి అంతర్జాతీయ విమానాశ్రయాలకు అంత భూమి అవసరం లేదని చెప్పారు. ప్రస్తుతం ఉన్న గన్నవరం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడం తెలివైన నిర్ణయం అవుతుందని ప్రభుత్వానికి షర్మిల సూచించారు. ఇక 2500 ఎకరాల్లో స్పోర్ట్స్ విలేజ్ నిర్మిస్తామన్న ప్రతిపాదనను షర్మిల తీవ్రంగా వ్యతిరేకించారు.
